శనివారం 06 జూన్ 2020
Nagarkurnool - Feb 13, 2020 , 00:05:19

నల్లమలలో ఇంటింటికీ తాగునీరు

నల్లమలలో  ఇంటింటికీ తాగునీరు

అచ్చంపేట రూరల్‌: కొండలు, కోనలు చీల్చుకుంటూ.. ఎత్తు పల్లాలను దాటుకుంటూ.. మండల కేంద్రం నుంచి నల్లగొండ జిల్లాలోని నాగర్జున్‌సాగర్‌ బ్యాక్‌వాటర్‌ వరకు భగీరథ జలాలు చేరుకున్నాయి. అనుకున్న సమయానికి భగీరథ జలాలు ఇంటింటికి వెళ్లి తలుపులు తట్టడంతో మహిళల ఆనందానికి అవధుల్లేకుండా పోతున్నాయి. రాష్ట్రంలోని ప్రతి పల్లెలో ఇంటింటికీ తాగునీరు అందించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మిషన్‌ భగీరథ పథకాన్ని 2016 ఆగస్టులో ప్రారంభించారు. ప్రభుత్వ లక్ష్యాన్ని పకడ్భందీగా అమలు చేయాలని సంబంధిత ఆర్‌డబ్ల్యూఎస్‌, మిషన్‌ భగీరథ అధికారులు కృషి చేస్తున్నారు. అచ్చంపేట మండలంలో 60,189 మంది జనాభా ఉన్నారు. వారందరికి ఇంటింటికీ కుళాయిల ద్వారా తాగునీటిని అందించాలని మిషన్‌ భగీరథ పథకం ద్వారా ఒక అచ్చంపేట మండలానికి రూ.17కోట్లు కేటాయించారు. దీంతో అచ్చంపేట మండలానికి 39 ట్యాంకులు మంజూరు కాగా ఇప్పటికే 38 ట్యాంకులు పూర్తయ్యాయి. మరో ఒక ట్యాంకు వారం రోజుల్లో పూర్తి కానున్నది. అదేవిధంగా మండలంలో 140 కిలోమీటర్ల మేరకు పైప్‌లైన్‌ పనులు పూర్తి చేశారు. 61 గ్రామాలలో 60 గ్రామాలలో మిషన్‌ భగీరథ పనులు పూర్తయి ఇంటింటికీ తాగునీరు అందుతున్నాయి. 2014కు పూర్వం ఎండకాలం వచ్చిందంటే బిందెలు పట్టుకుని వ్యవసాయ పొలాలు, బోరుబావుల వెంట పరుగులు తీసేవారు. అప్పుడు విద్యుత్‌ ఉంటేనే నీరు.. లేదంటే అంతే సంగతి. అలాంటిది నేడు నిత్యం తండాలు, చెంచు గూడెంలు, గ్రామాలలో తాగునీరు సస్యశ్యామలం కావడంతో ప్రభుత్వ కల నెరవేరిందని సీఎం కేసీఆర్‌కు గ్రామాలు, తండాలలోని మహిళలు హారతులు పడుతున్నారు. మరో వారం రోజులయితే మిగిలిన పులిదేవిబండతండాకు నీరందించేందుకు కట్టుబడి ఉన్నామని సంబంధిత అధికారులు చెబుతున్నారు. దీంతో మండలంలోని ప్రజలకు తాగునీటి కష్టాలు శాశ్వతంగా తీరాయి.


logo