శనివారం 30 మే 2020
Nagarkurnool - Feb 12, 2020 , 00:15:07

ప్రచారం షురూ..

ప్రచారం షురూ..

నాగర్‌కర్నూల్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: నాగర్‌కర్నూల్‌ జిల్లాలో సహకార సంఘాల ఎన్నికల ప్రక్రియ రాజకీయాలను రసకందాయంగా మార్చింది. తక్కువ ఓటర్లు ఉన్న ఈ సంఘాల ఎన్నికల్లో గెలుపు, ఓటముల అంతరమూ అంతే స్థాయిలో ఉంటుంది. దీంతో ఎన్నికల్లో గట్టెక్కేందుకు అధికార టీఆర్‌ఎస్‌తో పాటు కాంగ్రెస్‌ సైతం ప్రచారాన్ని తీవ్రతరం చేశాయి. జిల్లాలో 23సహకార సంఘాల పరిధిలోని 299డైరెక్టర్ల పదవులకు 1168మంది నామినేషన్లు వేశారు. ఇందులో 561మంది నామినేషన్లు ఉపసంహరించుకోగా 554మంది బరిలో నిలిచారు. ఇందులో 53వార్డులు ఏకగ్రీవమయ్యాయి. దీంతో 246వార్డులకు గాను ఎన్నికలు జరగనుండగా 554మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. కాగా అధికార టీఆర్‌ఎస్‌ ఉపసంహరణలోనే తన హవాను కొనసాగించింది. గొరిట(తిమ్మాజిపేట), మాచినేనిపల్లి సింగిల్‌ విండోలను ఏకగ్రీవంగా గెలుపొందింది. ఇక మొత్తం 53వార్డులకు గాను 48వార్డులను సాధించింది. ఇదే క్రమంలో ప్రచారంలోనూ టీఆర్‌ఎస్‌ మద్దతుదారులు ప్రచారం వేగిరం చేశారు. అలాగే కాంగ్రెస్‌, స్వతంత్ర అభ్యర్థులు సైతం తమ వంతుగా ప్రచారంలో మునిగిపోయారు. ఉదయంతో పాటు సాయంత్రం నుంచి రాత్రి వరకు రైతుల ఇండ్ల వద్దకు వెళ్తున్నారు. మధ్యాహ్నం సమయంలో కూడా అభ్యర్థులు పొలం గట్ల వద్దకు చేరుకొని ఓటు హక్కు కలిగి ఉన్న రైతులను కలుస్తు ఓట్లు అభ్యర్థిస్తున్నారు. పార్టీ గుర్తులతో సంబంధం లేకుండా జరుగుతున్న ఎన్నికలు కావడంతో ఒక వార్డు నుంచి స్వతంత్రంగా పలువురు అభ్యర్థులు బరిలో నిలిచి ఉన్నారు. దీనివల్ల కొద్ది మొత్తంలో ఉన్న రైతు ఓటర్లను బరిలో నిలిచిన అభ్యర్థులు, ఇతర పరిచయం ఉన్న నాయకులు సైతం కలుస్తూ ఓటు వేయాలని కోరుతున్నారు. తమకు కేటాయించిన గుర్తులను వివరిస్తున్నారు. ఓస్థాయి కలిగిన పెద్ద రైతులకు పార్టీ ముఖ్య నాయకులచే ఫోన్‌లలో మాట్లాడింపజేస్తున్నారు. అదే విధంగా గ్రూపుల వారీగా ఓటర్లను సమావేశపర్చి తాము గెలిస్తే కలిగే లబ్దిని వివరిస్తున్నారు. ఎన్నికల పర్వంతో గ్రామాల్లో ఉదయం నుంచి రాత్రి వరకూ మరోసారి నాయకుల సందడి నెలకొంది. ఇటీవలి పరిషత్‌ ఎన్నికల మాదిరిగా ప్రచార పర్వం కనిపిస్తోంది. ఈనెల 15వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. దీనివల్ల బుధ, గురువారాల్లో మాత్రమే ప్రచారం మిగిలి ఉంది. ఈ కారణంగా అభ్యర్థులు ప్రచారాన్ని మరింత ఉదృతం చేయనున్నారు. విండో చైర్మన్‌ పదవులు ఆశిస్తున్న అభ్యర్థులు ప్రచారాన్ని భుజాన వేసుకొన్నారు. ప్రతి విండోలో 13వార్డులు ఉండటంతో ఎలాగైనా మెజార్టీ స్థానాలు గెలవడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఇప్పటికే బరిలో నిలిచిన అభ్యర్థుల బలాబలాలను, ఆయా వార్డుల్లో ఉన్న కులాల ఓట్ల సమీకరణాలను పరిగణలోకి తీసుకొన్న నేతలు గెలుపునకు వ్యూహాలను రచిస్తున్నారు. తాయిలాలతోనూ ప్రలోభపెట్టే యత్నాలకు తెరతీశారు. మందు విందులను సైతం ఏర్పాటు చేస్తున్నారు. సింగిల్‌ విండోలను గెలుచుకునేందుకు చేయాల్సిన అన్ని ప్రయత్నాలనూ చేస్తున్నారు. రైతుల్లో టీఆర్‌ఎస్‌ మద్దతుదారులైన అభ్యర్థుల పట్ల సానుకూలత వ్యక్తమవుతోంది. తెలంగాణ ప్రభుత్వ పథకాలతో వ్యవసాయం అభివృద్ధి చెంది రైతులు సంతోషంతో ఉన్నారు. దీనివల్ల ఇటీవలి పురపాలిక ఫలితాలే ఈ ఎన్నికల్లోనూ వస్తాయనే ధీమా టీఆర్‌ఎస్‌ నాయకులు, అభ్యర్థులు పేర్కొంటున్నారు. మొత్తం మీద సహకార ఎన్నికల ప్రచార పర్వం గ్రామాలను మరింత వేడెక్కించాయి. 


logo