సోమవారం 01 జూన్ 2020
Nagarkurnool - Feb 12, 2020 , 00:13:55

కొత్త చట్టాలపై దిశా నిర్దేశం

కొత్త చట్టాలపై దిశా నిర్దేశం

మహబూబ్‌నగర్‌ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ఇటీవలే దాదాపు అన్ని జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించారు. నాగర్‌కర్నూల్‌ మినహా అన్ని జిల్లాలకు కొత్తగా కలెక్టర్లను నియమించారు. కలెక్టర్లు బాధ్యతలు తీసుకున్న వారం రోజులకే సీఎం కేసీఆర్‌తో అందరికీ సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని కలెక్టర్లందరికీ ప్రభుత్వ విజన్‌ను తెలిపేందుకే ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లుగా నిపుణులు అంచనా వేస్తున్నారు. సీఎం కేసీఆర్‌కు అభివృద్ధిపై ఉన్న దూరదృష్టికి ఈ సమావేశం ఓ నిదర్శనంగా పలువురు భావిస్తున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా కలెక్టర్లంతా ముఖ్యమంత్రితో సమావేశానికి హాజరయ్యారు. ముఖ్యమంత్రి కలెక్టర్లను ఉద్దేశించి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు సహా వివిధ అంశాలపై ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. వర్షాభావానికి కేరాఫ్‌ అడ్రస్‌గా ఉన్న పాలమూరులో హరితహారం మరింత విజయవంతం చేయాల్సిన అంశాలపైనా ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం. పల్లెప్రగతి, పట్టణ ప్రగతి, హరితహారం ప్రాధాన్య అంశాలుగా కలెక్టర్లు పనిచేయాల్సిన విషయాన్ని ఈ సమావేశం స్పష్టంగా వెల్లడించిందని తెలుస్తోంది. సీఎం కేసీఆర్‌తో జరిగిన సమావేశానికి ఉమ్మడి జిల్లా కలెక్టర్లు వెంకట్రావు, శ్రీధర్‌, యాస్మిన్‌బాష, హరిచందన, శృతిఓఝా హాజరయ్యారు. ఈ సమావేశం ద్వారా కొత్త పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ చట్టంపైనా కలెక్టర్లకు దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. యువ ఐఏఎస్‌ అధికారులు రాష్ర్టానికి దారి చూపే హోదాల్లో పనిచేసే అవకాశం ఉందని సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకు అధికారులు సరైన పాత్ర పోషించే విషయంలో సీఎం కేసీఆర్‌ చేసిన దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. అస్తవ్యస్తంగా ఉన్న రెవెన్యూ రికార్డులను సరిచేయడం, భూమి సంబంధ సమస్యల పరిష్కారం, వివిధి సమస్యలను ఎదుర్కొంటున్న రైతులకు సత్వరం న్యాయం చేయడం వంటి అంశాలపై కలెక్టర్లకు మార్గనిర్దేశం జరిగినట్లు తెలుస్తున్నది. జేసీ వ్యవస్థ పోయి కొత్తగా నియమించిన అడిషనల్‌ కలెక్టర్లు, వారి బాధ్యతలపైనా ఈ సమావేశం ద్వారా అవగాహన వచ్చినట్లు భావిస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో కలెక్టర్‌ స్థాయి నుంచి పంచాయతీ కార్యదర్శి స్థాయి వరకు వెంటనే స్పందించాల్సిన ఆవశ్యకతపైనా సీఎం కేసీఆర్‌ సందేశం ఇచ్చినట్లు సమాచారం. సీఎంతో కలెక్టర్లకు జరిగిన సమావేశం వల్ల రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో చేపట్టబోయే పథకాలు, కార్యక్రమాలపై జిల్లా ముఖ్యాధికారులకు ఓ చక్కని పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చినట్లుగా ఉందని భావిస్తున్నారు. 


logo