మంగళవారం 26 మే 2020
Nagarkurnool - Feb 11, 2020 , 00:22:59

బరిలో 554మంది

బరిలో 554మంది

నాగర్‌కర్నూల్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : సహకార ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ పూర్తైంది. ఇక ఎన్నికల పోరు జరుగుతోంది. జిల్లాలోని 23విండోల పరిధిలోని 299డైరెక్టర్లకు గాను 51వార్డులు ఏకగ్రీవమయ్యాయి. అలాగే గొరిట(తిమ్మాజిపేట మండలం) సింగిల్‌ విండో ఏకగ్రీవమైంది. ఇక నామినేషన్ల ఉపసంహరణలో భాగంగా 1168మందికి గాను సోమవారం 561మంది నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీంతో 246వార్డులకు గాను 554మంది ఎన్నికల బరిలో నిలిచారు. ఇలా సహకార ఎన్నికల సమరాంగణం మొదలు కావడంతో రాజకీయం మరింత రంజుగా మారనుంది.

264వార్డులకు 554మంది పోటీ

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో సహకార ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులపై స్పష్టత వచ్చింది. ఈనెల 6,7,8తేదీల్లో మూడు రోజుల పాటు నామినేషన్ల స్వీకరణ జరిగింది. ఇందులో భాగంగా 9వ తేదీన పరిశీలన అనంతరం 1168నామిన్షేన్లను అధికారులు సరైనవిగా గుర్తించారు. ఇక సోమవారం ఉపసంహరణ కార్యక్రమం జరిగింది. ఈ ఉపసంహరణతో పెద్ద ఎత్తున డైరెక్టర్లకు నామినేషన్లు వేసిన అభ్యర్థులు వెనక్కు తీసుకున్నారు. జిల్లాలో మొత్తం 23సహకార సంఘాల పరిధిలో 299వార్డులు ఉన్నాయి. సోమవారం నాడు 51వార్డులు ఏకగ్రీవమయ్యాయి. తిమ్మాజిపేట మండల పరిధిలోకి వచ్చే గొరిట సింగిల్‌ విండోలో 13వార్డులు ఏకగ్రీవం కావడం విశేషం. దీంతో ఆ విండో ఎన్నికను అధికారులు ఏకగ్రీవం చేశారు. ఛైర్మన్‌నే ఈనెల 16వ తేదీన ఎన్నుకుంటారు. ఇందులోని 13వార్డులకు ఇక ఎన్నికలు జరగవు. ఇదిలా ఉంటే సోమవారం 561మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకొన్నారు. దీని కారణంగా 246వార్డులకు ఎన్నికలు ఈనెల 15వ తేదీన జరగనున్నాయి. నామినేషన్ల ఉపసంహరణతో 554మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. తాడూరు సింగిల్‌ విండో పరిధిలో అత్యధికంగా 30మంది అభ్యర్థులు పోటీలో ఉండగా కొత్తపేటలో 10మంది బరిలో నిలిచారు. గొరిట విండోలోని మొత్తం 13వార్డులు ఏకగ్రీవం కాగా ఆ తర్వాతి స్థానం కొత్తపేటలో 8వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ఐదు వార్డుల్లో కలిపి 10మంది అభ్యర్థులు ఎన్నికల్లో తలపడనున్నారు. నామినేషన్ల ఉపసంహరణతో అభ్యర్థులకు సాయంత్రం గుర్తులను కేటాయించారు. ఈ కారణంగా విండోల పరిధిలో సందడి నెలకొంది. నామినేషన్ల ఉపసంహరణకు వచ్చిన అభ్యర్థులు, ఇతర నాయకులతో పాటుగా పోటీలో నిలిచే అభ్యర్థుల రాకతో కార్యాలయాలు కోలాహలంగా మారాయి. ఇక ఎన్నికల అధికారులు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తీసుకున చర్యలు సత్ఫలితాలనిచ్చాయి. నామినేషన్ల స్వీకరణతో పాటుగా ఉపసంహరణ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఇలా ఉపసంహరణ ముగియగా మంగళవారం నుంచి ఎన్నికల ప్రచారం మొదలు కానుంది. ఈ ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌ హవా పక్కాగా కనిపించింది. గొరిట సింగిల్‌ విండో టీఆర్‌ఎస్‌ కైవసం అయ్యింది. మిగిలిన డైరెక్టర్లలోనూ అత్యధికంగా 40వరకు స్థానాలు టీఆర్‌ఎస్‌ బలపర్చిన అభ్యర్థులవే కావడం గమనార్హం. గొరిట విండోలో ఏకగ్రీవమైన డైరెక్టర్లను ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌ రెడ్డి కలిసి అభినందించారు. టీఆర్‌ఎస్‌ పట్ల రైతులకు ఉన్న నమ్మకానికి ఈ విండో ఏకగ్రీవమే నిదర్శనమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇక నామినేషన్ల పర్వం మ ఉగియగా మూడు రోజులు ఎన్నికల ప్రచారం జరగనుంది. సోమవారం రాత్రే అభ్యర్థులు తమకు కేటాయించిన గుర్తుల కరపత్రాలను ముద్రించారు. మంగళవారం నుంచి గురువారం వరకు రైతులైన ఓటర్లను కలిసి ఓట్లను అభ్యర్థించనున్నారు. ఇప్పటికే ఓమారు ఓటర్లను కలిసిన అభ్యర్థులు ఇక గుర్తులను ప్రచారం చేయనున్నారు. ఈ ఎన్నికలపై టీఆర్‌ఎస్‌ ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది. కాంగ్రెస్‌ పార్టీ మాత్రమే మద్దతుదారులైన అభ్యర్థులను బరిలో నిలిపింది. కమలం పార్టీ ఉనికి మాత్రం సహకార ఎన్నికల్లో కానరాకుండా పోయింది. మొత్తం మీద సహకార ఎన్నికల ప్రక్రియ ప్రచార పర్వానికి చేరుకోవడంతో గ్రామాల్లో రాజకీయ వేడి రసకందాయంగా మారింది.


logo