శనివారం 06 జూన్ 2020
Nagarkurnool - Feb 11, 2020 , 00:21:30

సేవలోనే సంతోషం

సేవలోనే సంతోషం

నాగర్‌కర్నూల్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: సేవలోనే సంతోషం ఉందంటూ..విధుల్లో నిర్లక్ష్యాన్ని సహించనంటూ తన దైన శైలిలో చెప్పారు సోమవారం విధుల్లో చేరిన నాగర్‌కర్నూల్‌ అడిషనల్‌ కలెక్టర్‌ మనూ చౌదరి. ముందుగా ఆయన కలెక్టర్‌ శ్రీధర్‌ను క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకొన్నారు. ఇక్కడ కలెక్టర్‌తో పాటు వివిధ శాఖల అధికారులు పుష్పగుచ్ఛాలతో శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కలెక్టరేట్‌కు చేరుకోగా డీఆర్‌వో మధుసూదన్‌ నాయక్‌ ఆయనను సాదరంగా ఆహ్వానించారు. అడిషనల్‌ కలెక్టర్‌ చాంబర్‌ వద్దకు తీసుకెళ్లారు. ఇక్కడే అడిషనల్‌ కలెక్టర్‌గా మనూ చౌదరి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన నమస్తే తెలంగాణతో ముచ్చటించారు..ఆ వివరాలు..

నమస్తే తెలంగాణ : నాగర్‌కర్నూల్‌ జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌గా బాధ్యతలు తీసుకోవడంపై మీ అభిప్రాయం...?

అడిషనల్‌ కలెక్టర్‌ : నాగర్‌కర్నూల్‌ ప్రాంతం ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతోంది. ఇక్కడ ఎస్సీ,ఎస్టీ,బీసీలే 85శాతం మంది వరకు ఉన్నారు. ఇలాంటి చోట విధులు నిర్వహించడం నాకు సంతోషంగా ఉంది. పేదలకు సేవ చేయడంలో ఉన్న సంతోషం ఎక్కడా ఉండదు. పెద్దదైన నాగర్‌కర్నూల్‌ జిల్లా అభివృద్ధి, పేదల సంక్షేమం కోసం పని చేస్తూ ప్రజల నుంచి మంచి పేరు తెచ్చుకోవడమే నా బాధ్యతగా భావిస్తా.

నమస్తే : మీ కుటుంబ నేపథ్యం గురించి వివరిస్తారా...?

అడిషనల్‌ కలెక్టర్‌ : మాది తెలంగాణలోని కొత్తగూడెంస్వస్థలం. విద్యావంతుల కు టుంబం. నాన్నరాజబాబు ఓరియంట్‌ సి మెంట్‌ ఉద్యోగి. తల్లి భారత గృహిణి. త మ్ముడు రిలయన్స్‌లో ఉద్యోగం చేస్తుంటారు. చిన్నప్పటి నుంచి నన్ను ఐఏఎస్‌ సాధించేందుకు అమ్మా,నాన్నా ప్రోత్సహించారు. 

నమస్తే : మీ విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది...? తెలుగు స్పష్టంగా మాట్లాడటానికి కారణం...?

అడిషనల్‌ కలెక్టర్‌ : ఆదిలాబాద్‌ జిల్లా మంచిర్యాలలో ప్రాథమిక విద్యను చదివా. నాన్న ఉద్యోగరీత్యా మహారాష్ట్రకు బదిలీ అయ్యారు. దీనివల్ల 6వ తరగతి నుంచి బీటెక్‌ మెకానికల్‌ ఇంజనీరింగ్‌ వరకు మహారాష్ట్రలోని జలగాంలో చదివాను. ఎంబీఏ(పీజీడీఎం) ఢిల్లీలో చదువుకున్నా. ఇలా 2015వరకు నా విద్యాభ్యాసం కొనసాగింది. పదేళ్లకుపైగా మన రాష్ట్రంలోనే ఉండటంతో తెలుగు స్పష్టంగా మాట్లాడుతా. అర్థం చేసుకుంటా. చదవడమే కాస్త వేగంగా చదవలేను. 

నమస్తే :  ఐఏఎస్‌కు ఎప్పుడు ఎంపికయ్యారు..?

అడిషనల్‌ కలెక్టర్‌ : ఎంబీఏ పూర్తైన తర్వాత 2016లో సివిల్స్‌ పరీక్షలు రాశాను. ఇందులో నేను 2017బ్యాచ్‌లో ఐఏఎస్‌ 36వ ర్యాంకులో ఉత్తీర్ణత సాధించాను. 1992లో జన్మించిన నేను 25సంవత్సరాలకే ఐఏఎస్‌గా ఎంపికయ్యాను. అనంతరం రెండేళ్లు ముస్సోరిలో శిక్షణ తీసుకున్నాను. 2019అక్టోబర్‌ నుంచి వరంగల్‌ అర్బన్‌ స్పెషల్‌ కలెక్టర్‌గా పని చేస్తూ నాగర్‌కర్నూల్‌ అడిషనల్‌ కలెక్టర్‌గా బదిలీ అయ్యాను.

నమస్తే :నాగర్‌కర్నూల్‌ ప్రాంతంపైఅవగాహన ఉందా....?

అడిషనల్‌ కలెక్టర్‌ :  సరిగ్గా గుర్తు లేదు కానీ శ్రీశైలానికి వెళ్తూ చిన్నప్పుడు నాగర్‌కర్నూల్‌ నుంచి వెళ్లాను. అప్పుడు రోడ్ల పక్కల ఉన్న భూములు ముళ్ల చెట్లతో నిండిపోయి కనిపించేది. ఇప్పుడు మాత్రం పచ్చని పంటలతో కళకళలాడుతుంది. నాగర్‌కర్నూల్‌ వస్తున్నప్పుడు తిమ్మాజిపేట, బిజినేపల్లి,పాలెంలో నిండుగా పచ్చదనం సంతోషపరుస్తోంది.

నమస్తే : మీరు జిల్లాలో ప్రధానంగా గుర్తించిన అభివృద్ధి ఏమిటి...

అడిషనల్‌ కలెక్టర్‌:  ప్రభుత్వం ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో ఎంజీకేఎల్‌ఐ ప్రాజెక్టు వల్ల సాగునీరు వనరులు పెరిగాయి. దీనివల్ల వ్యవసాయం గణనీయంగా పెరిగింది. అలాగే కృష్ణానదీ పరివాహక ప్రాంతాల్లో పర్యాటకానికి ఊతం లభించింది. నల్లమలలోని అమ్రాబాద్‌ అభయారణ్యం, పెద్దపులుల గురించీ తెలుసు. నీళ్ల రాకతో నాగర్‌కర్నూల్‌ అభివృద్ధిలో వచ్చిన మార్పు స్పష్టంగా కనిపిస్తుంది.

నమస్తే : మీరు జిల్లా అభివృద్ధికి నిర్దేశించుకున్న లక్ష్యాలు...?

అడిషనల్‌ కలెక్టర్‌ : జిల్లాలో మౌళిక సదుపాయాలను కల్పించేందుకు చర్యలు తీసుకుంటాను. పేదలకు సంక్షేమ పథకాలు అందించేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజల సహకారంతో ముందుకు సాగుతాను. విధుల పట్ల నిక్కచ్చిగా వ్యవహరిస్తాను. నిర్లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించను. ప్రజలకు సేవ చేయడాన్ని అధికారులు, ఉద్యోగులు బాధ్యతగా తీసుకోవాలి.

నమస్తే : యువతకు మీరు ఇచ్చే సలహా...?

అడిషనల్‌ కలెక్టర్‌      : ప్రతి ఒక్కరూ చిన్నప్పటి నుంచే కలలు కనాలి. ఆ కలలను సాకారం చేసుకునేందుకు ఓ లక్ష్యం నిర్దేశించుకోవాలి. ఎంత కష్టపడి చదివితే అంత ఉన్నత స్థానాలు సాధ్యమవుతాయి. పరీక్షల్లో పాస్‌ అవుదామనే చదువులతో పోటీ పరీక్షల్లో నెగ్గడం కష్టం. నేను ఐఏఎస్‌ సాధించాలనే లక్ష్యాన్ని చిన్నప్పటి నుంచే పెట్టుకొన్నాను. ప్రతి సబ్జెక్టును క్షుణ్ణంగా అభ్యసించాను. రోజుకు 9గంటలకుపైగా చదువులోనే ఉన్నాను. 

నమస్తే : పాతికేళ్లకే ఐఏఎస్‌ సాధించిన మీరు నేటి యూత్‌ చేసే సంతోషాన్ని కోల్పోయానని భావిస్తున్నారా....?

అడిషనల్‌ కలెక్టర్‌ : ఐఏఎస్‌ సాధించాలనే లక్ష్యం ముందు ఆ ఆలోచన ఎప్పుడూ రాలేదు. ఉద్యోగ నిర్వహణలో పేదలకు సేవ చేయడాన్ని సంతోషంగా భావిస్తా. మనం చేసే పనిలో వచ్చిన మంచి ఫలితాలే ఆనందాన్ని కల్పిస్తాయి. 


logo