గురువారం 28 మే 2020
Nagarkurnool - Feb 10, 2020 , 00:43:07

సర్వదర్శనానికి బారులుదీరిన భక్తులు

సర్వదర్శనానికి బారులుదీరిన భక్తులు

శ్రీశైలం ,నమస్తే తెలంగాణ : అష్టాదశ శక్తిపీఠాలు..ద్వాదశ జోతిర్లింగాలలో ప్రఖ్యాతిగాంచిన శ్రీశైల భ్రమరాంబికా,మల్లికార్జునస్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు ఆదివారం వచ్చిన భక్తులతో పుర వీధులన్నీ కిటకిటలాడాయి. వారాంతపు సేలవులు రావడంతో కుటుంబసమేతంగా స్వామి అమ్మవార్ల దర్శనానికి క్షేత్రానికి చేరుకుంటున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యాత్రికులు తెల్లవారుజామునే నదిలో పుణ్య స్నానాలు చేసుకుని కృష్ణమ్మకు పసుపు కుంకుమ సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం మాడవీధుల నుంచి దర్శనానికి క్యూలైన్లలో నిలుచున్నారు. ఉచిత దర్శనానికి 2 గంటల సమయం పట్టగా శీఘ్ర దర్శనానికి గంట సమయం పడుతుందని ఆలయ పౌర సంబంధాల అధికారి శ్రీనివాసరావు తెలిపారు. స్వామి,అమ్మవార్లకు జరిగే నిత్య కైంకర్యాలను దర్శించుకున్న భక్తులు తీర్థ ప్రసాదాలను తీసుకున్నారు. సాయంత్రం వాతావరణం చల్లబడటంతో ఉద్యానవనాల్లో చిన్నారులు ఆటవిడుపు పొందారు. పరిసర ఆలయాలైన శిఖరేశ్వరం, పాలధార పంచదార, హఠకేశ్వరం,సాక్షిగణపతి ఆలయాలు సందడిగా మా రాయి. 

అమ్మవారి పల్లకీసేవ

శ్రీశైల భ్రమరాంబికా అమ్మవారికి ఆదివారం సాయంత్రం పల్లకీ సేవ కన్నుల పండువగా జరిగింది. అమ్మవారికి ప్రీతికరమైన గులాబీ, గన్నేరు, దేవగన్నేరు, నందివర్దనం, గరుడవర్దనం, మల్లెలు, చామంతులతో పుష్పాలంకరణ చేసిన పల్లకీలో స్వామి, అమ్మవార్లను వేంచేబు చేసే ముందుగా సేవా సంకల్పాన్ని వేదపండితులు అర్చక స్వాములు పఠించారు. అనంతరం స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను పల్లకీలో అధిష్టింపజేసి సహస్త్రనామాలతో షోడశోపచార క్రతువులు నిర్వహించారు. అమ్మవారి ఆలయ ప్రదక్షిణ చేస్తూ శోభాయమానంగా సాగిన పల్లకీసేవలో అసిస్టెంట్‌ కమిషనర్‌ కోదండరామిరెడ్డి పాల్గొన్నారు. పల్లకీసేవలో సామాన్య భక్తులు పాల్గొనేందుకు అవకాశం కల్పించినట్లు ఆలయ అధికారులు తెలిపారు.

కళారాధనలో తోలుబొమ్మలాట

ఆలయ దక్షిణ మాడవీధిలో జరిగిన కళారాధన కార్యక్రమంలో ఆదివారం సాయంత్రం తోలుబొమ్మలాట అందరినీ అలరించింది. స్వామి అమ్మవార్ల దర్శనానంతరం భక్తులు మాడవీధిలో కూర్చుని తోలుబొమ్మల విన్యాసాన్ని ఆద్యాంతం తిలకించారు.

నిత్యాన్నదానానికి రెండులక్షల విరాళం

  శ్రీశైల దేవస్ధానం నిర్వహిస్తున్న నిత్యాన్నదానానికి మహబూబ్‌నగర్‌జిల్లాకు చెందిన వీ రాములమ్మ కుటుంబసభ్యులు రూ.1, 00,000లు (లక్ష రూపాయలు) విరాళంగా ఇచ్చారు. ఆదివారం ఆలయ  ఏఈవో హరిదాస్‌కు విరాళాన్ని చెక్కు రూపంలో అందించారు.  గుంటూరుకు చెందిన సి వెంకట నాగమల్లేశ్వరరావు ఆలయ అధికారి వెంకటేశ్వరరావుకు రూ.1,00,000లు (లక్ష రూపాయలు) చెక్కురూపంలో విరాళాన్ని ఇచ్చారు. దేవస్ధానం వారు శ్రీభ్రమరాంబికా మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనాన్ని కల్పించి స్వామివార్లకు ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం స్వామి అమ్మవార్ల శేషవస్ర్తాలు, ప్రసాదాలు, ఙ్ఞాపిక పత్రాన్ని అందజేశారు. 

 శైవులకు సన్మానం

  శ్రీశైల క్షేత్రంలో స్వామి, అమ్మవార్లకు పదుల సంవత్సరాలుగా ఆధ్యాత్మిక సేవలందిస్తున్న వీరశైవ అర్చకులకు అవార్డులు ఇచ్చారు.  ఉదయం వీరశైవ ఆగమ పరిషత్‌ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ఈఓ కేఎస్‌ రామామావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా మల్లికార్జున స్వామివారి ఆలయ ప్రధాన అర్చకులు పీఠం మల్లయ్య, ఉప ప్రధాన అర్చకులు భద్రయ్యతో పాటు ఇతర అర్చకులకు పురస్కారాలు అందజేసి ఘనంగా సత్కరించారు. ప్రఖ్యత వీరశైవ సిద్ధాంతి రేవన రచించిన పలు పుస్తకాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో వీరమల్లేశ్‌,మహంతయ్య,జగదీశ్‌ పాల్గొన్నారు.


logo