బుధవారం 03 జూన్ 2020
Nagarkurnool - Feb 07, 2020 , 00:38:40

తొలిరోజు నామినేషన్లు 97

తొలిరోజు నామినేషన్లు 97
  • బిజినేపల్లిలో అత్యధికంగా 17నామినేషన్లు
  • ఐదు విండోలకు నిల్‌
  • ముగ్గురు పిల్లలుంటే అనర్హత
  • ఒకే చోట, గరిష్టంగా రెండు నామినేషన్లే
  • రేపటితో నామినేషన్ల తుది గడువు

నాగర్‌కర్నూల్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : సహకార ఎన్నికల సమరం మొదలైంది. ఎన్నికల్లో తొలి ఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. జిల్లాలోని 23సహకార సంఘాల పరిధిలోని 299డైరెక్టర్ల పదవులకు గాను ఈనెల 15న జరిగే ఎన్నికల్లో భాగంగా మూడు రోజుల పాటు నామినేషన్ల స్వీకరణ జరగనుంది. ఇందులో భాగంగా తొలిరోజైన గురువారం 97నామినేషన్లు దాఖలయ్యాయి. అత్యధికంగా బిజినేపల్లి విండోలో 17 నామినేషన్లు వచ్చాయి. అచ్చంపేట, చారకొండ, రంగాపూర్‌, నర్సాయపల్లి, కొండ్రావుపల్లి విండోల్లోని డైరెక్టర్‌ పదవులకు ఒక్క నామినేషన్‌ కూడా రాకపోవడం గమనార్హం.శనివారంతో నామినేషన్ల ఘట్టం ముగియనుంది. ముగ్గురు పిల్లలున్న వారు  పోటీకి అనర్హులని అధికారులు తేల్చారు. ఒక వ్యక్తి గరిష్టంగా ఒకే చోట రెండు నామినేషన్లు వేసేందుకు వీలుంది.  


సహకార ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. జిల్లాలోని 23సహకార సంఘాల్లోని 299డైరెక్టర్ల పదవులకు ఈనెల 15న ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికల కోసం డైరెక్టర్ల పదవులకు గాను గురువారం నామినేషన్లను స్వీకరించడం మొదలైంది. తొలి రోజు కేవలం 97నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి. ఇంకా రాజకీయ పార్టీలు సింగిల్‌ విండో ఛైర్మన్లను ఖరారు చేయడంలో తలమునకలయ్యారు. ఈ అభ్యర్థులు ఎవరో తేలాక డైరెక్టర్లను గెలిపించుకునే బాధ్యతను అప్పగించేందుకు పార్టీలు సమాయాత్తమయ్యాయి. దీంతో తొలిరోజు డైరెక్టర్లకు అంతంత మాత్రంగానే నామినేషన్లు వచ్చాయి. బిజినేపల్లిలో అత్యధికంగా 17నామినేషన్లు సమర్పించడం జరిగింది. ఇక పెద్దకొత్తపల్లి, కొత్తపేట, తెలకపల్లి, అమ్రాబాద్‌లో ఒకటి చొప్పున మాత్రమే నామినేషన్లు దాఖలయ్యాయి. కాగా ఐదు విండోల పరిధిలో ఒక్కటంటే ఒక్కటి కూడా నామినేషన్లు దాఖలు కాకపోవడం గమనార్హం. ఇందులో అచ్చంపేట, చారకొండ, రంగాపూర్‌. నర్సాయపల్లి, కొండ్రావుపల్లి విండోలు ఉన్నాయి. గన్యాగుల, పెంట్లవెల్లితో పాటు బిజినేపల్లిలో లాంటి మూడు విండోల పరిధిలోని రెండంకెల సంఖ్యలో నామిన్షేన్లు వేయడం గమనార్హం. 


విండో చైర్మన్ల అభ్యర్థులు తేలడంపైనే డైరెక్టర్ల అభ్యర్థుల ఖరారు ముడిపడి ఉంది. దీనివల్ల తొలిరోజు మొక్కుబడి నామినేషన్లు వచ్చాయి. టీఆర్‌ఎస్‌ తరపున ప్రతి డైరెక్టర్‌ స్థానంలో ఒక్కరే నామినేషన్‌ వేసేలా ఎమ్మెల్యేలు చర్యలు తీసుకుంటున్నారు. గులాబీ పార్టీలో ఆశావహులు అధికంగా ఉండటంతో నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం చేస్తున్నారు. ఇక కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసే అభ్యర్థులే అక్కడక్కడా నామినేషన్లు వేయడం జరిగింది. జిల్లాలోని అన్ని విండో కార్యాలయాల్లో ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు నామినేషన్లను స్వీకరించారు. కాగా ఈ ఎన్నికల్లో ముగ్గురు పిల్లల నిబంధనను అధికారులు వర్తింపజేయనున్నారు. ఆకస్మికంగా వెలువడిన ఈ  నిబంధన చాలా మంది ఆశావహుల ఆశలను తుంచేసింది. నాగర్‌కర్నూల్‌లో కాంగ్రెస్‌ నుంచి విండో ఛైర్మన్‌గా పోటీ చేయాలని భావించిన అభ్యర్థి అయోయంలో పడ్డారు. చాలా చోట్ల పోటీ చేయాలని భావించిన నాయకులు ఈ నిబంధనతో తలలు పట్టుకొంటున్నారు. 


దీనివల్ల కొత్త అభ్యర్థులను నాయకులు అన్వేషిస్తున్నారు. అదే విధంగా ఒక్క విండోకు మాత్రమే నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. అది కూడా రెండు సెట్ల నామినేషన్లే వేయాలి. ఇతర ఎన్నికల మాదిరిగా ఒకటికంటే ఎక్కువ డైరెక్టర్ల పదవులకు నామినేషన్లు వేయరాదు. ఈ నిబంధనలను అధికారులు తొలిరోజైన గురువారమే ప్రకటించడం జరిగింది. శుక్ర, శనివారాలు మాత్రమే నామినేషన్లు స్వీకరించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణ ఈనెల 10వ తేదీతో ముగుస్తుంది. ఆ తర్వాతే అభ్యర్థులకు గుర్తులను కేటాయిస్తారు. బ్యాలెట్‌ పద్ధతిపై పార్టీ గుర్తుల ప్రమేయం లేకుండా ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం మీద సహకార ఎన్నికల సమరాంగణం నామినేషన్ల ఘట్టంతో ప్రారంభమైంది.logo