శనివారం 06 జూన్ 2020
Nagarkurnool - Feb 07, 2020 , 00:37:06

సాధువే చంపేశాడు!

సాధువే చంపేశాడు!

అచ్చంపేట, నమస్తే తెలంగాణ : నల్లమల అడవిలోని శ్రీశైలం-హైదరాబాద్‌ జాతీయ రహదారి అక్కమహాదేవి రోడ్డు మార్గంలో ఈ నెల 2న హత్యకు గురైన మహిళ కేసును మూడు రోజుల్లోనే పోలీసులు చేధించారు. హత్యా స్థలంలో లభించిన ఆధారాల కనుగుణంగా శ్రీశైలం ఆలయ ప్రాంగణంలో సీసీ కెమెరా పుటేజీలను పరిశీలించి కేసును చేధించారు. మహిళపై అత్యాచారం జరిపి హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీశైలంలో సాధువును కోర్టులో హాజరుపర్చగా జడ్జి రిమాండ్‌ విధించారు. ఈ కేసు పూర్తి వివరాలను గురువారం అచ్చంపేట డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ నర్సింహులు విలేకరుల సమావేశంలో వెల్లడించారు.  ఈ నెల 2న ఫారెస్టు వాచర్లు అక్కమ్మ బిలం బీట్‌ ఏరియాలో మండ్లి లింగయ్య, లక్ష్మయ్యలు మరికొంత మంది కూలీలతో కలిసి అక్కమ్మబిలానికి సుమారు మూడు కిలో మీటర్ల దూరం ఫైర్‌లైన్‌ పని నిమిత్తం అడవిలోకి వెళ్లగా అక్కడ దుర్వాసన వచ్చింది. దగ్గరకు వెళ్లి పరిశీలిస్తే మహిళ శవం కనిపించిందని డీఎస్పీ వెల్లడించారు. ఆ శవం ఒంటిపై ఎలాంటి దుస్తులు లేకుండా, ముఖం గుర్తు పట్టలేని విధంగా, కుళ్లిపోయిన స్థితిలో ఉన్నదన్నారు. ఈ విషయాన్ని ఈగలపెంట పోలీసులకు సమాచారం తెలుపగా ఈగలపెంట ఎస్సై బద్రీనాథ్‌ కేసు నమోదు చేసుకొని అమ్రాబాద్‌ సీఐ బీసన్న, డీఎస్పీ నర్సింహులు సహకారంతో సంఘటనా ప్రదేశానికి వెళ్లి చూడగా ఆ ప్రాంతంలో కుంకుమ, పసుపు, నిమ్మకాయలు పడి ఉన్నట్లు తెలిపారు. 


అక్కడికి కొద్ది దూరంలో ఒక చింపివేసిన బ్యాగుతో పాటు ఆ మహిళకు సంబంధించిన ఆధార్‌ కార్డు, పాన్‌కార్డు, శ్రీశైలంలో బసచేసిన రశీదులు ఉన్నాయని, దీనిని బట్టి మహిళ ముంబైకి చెందిన వ్యక్తిగా అనుమానించామన్నారు. ఆమెను హత్య చేసినట్లుగా కేసు నమోదు చేసుకొని విచారణ చేశామని అన్నారు. శ్రీశైలంలో ఉన్న నందీశ్వర డార్మెంటరీలో బస చేసినట్లుగా నిర్ధారించుకొని సీసీ కెమెరాల ద్వారా పరిశీలించి చూడగా ఒక సాధువు వెనుక మహిళ వెళ్లినట్లుగా తెలిసిందన్నారు. సీసీ పుటేజీ ఆధారంగా ఆ సాధువును అదుపులోకి తీసుకొని విచారించగా అతని పేరు రామకృష్ణ అలియాస్‌ మట్కా స్వామి అలియాస్‌ పిలక స్వామి తండ్రి పేరు గోవింద ఆచారి, వయస్సు 65 సంవత్సరాలుగా, కులం విశ్వబ్రాహ్మణ, వృత్తి సాధువు, అడ్రస్‌ శ్రీశైలంగా గుర్తించారు. పిలక స్వామి స్వస్థలం తమిళనాడు కృష్ణగిరి జిల్లా అని వెల్లడించారు. అతను ముంబైకి చెందిన 52 సంవత్సరాల వయస్సు గల మహిళతో కలిసి గత జనవరి 25న ఉదయం ఎనిమిది గంటల సమయంలో శ్రీశైలం నుంచి సున్నిపెంటకు కమాండర్‌ జీపులో జాతీయ రహదారి 168 ఫారెస్ట్‌ రేంజ్‌ గేటు దగ్గర దిగి అక్కడి నుంచి అక్కమ్మ బిలం టెంపుల్‌ వైపు కాలినడకన ఆ మహిళతో కలిసి ప్రయాణం చేస్తున్న క్రమంలో ఆమెపై కామవాంఛ కలిగి బలవంతంగా లైంగికదాడి చేశాడన్నారు. 


ఈ విషయం ఇతరులకు చెబుతుందనే అనుమానంతో సాధువు వెంట ఉన్న నిమ్మకాయలను కోసే కత్తితో గొంతుకోసి హత్య చేసినట్లు తెలిపారు. హత్య చేసిన తర్వాత మృతురాలి బ్యాగును చింపివేసి అందులో గల వస్తువులు దగ్గరలో ఉన్న పొదల్లో పడేశాడని తెలిపారు. మృతురాలి సెల్‌ఫోన్‌, హత్య చేసిన కత్తి అతడి నుంచి స్వాధీనం చేసుకొని అరెస్టు చేసి జుడీషియల్‌ రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. కేసును అతి తక్కువ సమయంలో ఛేదించిన పోలీసు అధికారులు, సిబ్బందికి రివార్డు కోసం ఉన్నతాధికారులకు నివేదిక పంపనున్నట్లు డీఎస్పీ పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో అమ్రాబాద్‌ సీఐ బీసన్న, ఎస్సై బద్రీనాథ్‌, సిబ్బంది పాల్గొన్నారు.logo