గురువారం 28 మే 2020
Nagarkurnool - Feb 06, 2020 , 03:09:38

అడవిని కాపాడుదాం

అడవిని కాపాడుదాం
  • అమ్రాబాద్‌ అతిపెద్ద పులుల అభయారణ్యం
  • ఫైర్‌లైన్స్‌ ఏర్పాటుతో తగ్గిన నష్టం
  • నల్లమలలో వారంలోనే రెండు సార్లు కార్చిచ్చు
  • సుమారు 20 హెక్టార్లలో దగ్ధమైన అడవులు

అమ్రాబాద్‌ రూరల్‌: నల్లమలలోని అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ (ఏటీఆర్‌)అడవుల్లో ఫిబ్రవరి నెలలోనే  రెండు సార్లు మంటలు వ్యాపించడం కలకలం రేపింది. అయితే ఫిబ్రవరి మొదటి వారంలోనే అడవిలో గడ్డి ఎండిపోవడంతో ప్రమాద తీవ్రత పెరిగిందని చెప్పవచ్చు.  ఈ క్రమంలో అడవుల్లో అనుకోకుండ నిప్పు రాజుకొని, లేక అడివికి వెళ్లిన వారు తెలియక బీడీ, సిగరేటు కాల్చిన తరువాత అలాగే వదిలేయడంతో తరుచూ ప్రమాదాలు జరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా రోడ్డు వెంట సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిత్యం పర్యవేక్షించాల్సి ఉన్నది. అయితే రహదారి పొడవునా సూచిక బోర్డులు, హెల్ప్‌లైన్‌ నంబర్లు ఏర్పాటు చేస్తే ప్రమాదం జరిగిన వెంటనే అధికారులకే తెలిపే అవకాశం ఉంటుంది. 


ప్రమాదం జరిగినప్పుడే కాకుండా ప్రతిరోజూ ఒక బృందాన్ని ఏర్పాటు చేసి రహదారి పొడవునా పెట్రోలింగ్‌ చేస్తే యాత్రికులు కూడా ఇలాంటి సంఘటనలకు పాల్పడకుండా ఉంటారు. ఎక్కడైనా బీడి, సిగరెట్‌ కాల్చినట్లు కనిపిస్తే వారికి భారీ జరిమానా, కఠిన చర్యలు తీసుకునేలా ప్రణాళికలు రూపొందించాలి. హైదరాబాద్‌- శ్రీశైలం జాతీయ రహదారి రోజు వందలాది వాహనాలు వెళ్తుంటాయి. దారిపొడవునా ఎక్కడ పడితే అక్కడ వాహనాలు ఆపకుండా నిర్ణీత ప్రదేశంలోనే నిలిపే విధంగా చర్యలు తీసుకోవాలి. వేసవి కాలం సమీపిస్తున్న నేపథ్యంలో ఎండలూ ముందుగానే కాస్త తీవ్రతను పెంచుతున్నాయి. ఈక్రమంలో అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. యాత్రికులకు అడవుల ప్రాధాన్యతపై అంతగా అవగాహన లేకపోవడంతో కార్చిచ్చులాంటి సంఘటనలు అప్పుడప్పుడు చోటుచేసుకుంటున్నాయి.


ఏటీఆర్‌ అడవుల్లో రెండు పర్యాయాలు కూడ దోమలపెంట రేయింజ్‌ పరిధిలోని వటువర్లపల్లి.. దోమలపెంట గ్రామాల మధ్యన కార్చిచ్చు సంభవించింది. హైదరాబాద్‌-శ్రీశైలం జాతీయ రహదారి వెంట రోడ్డుకు ఇరువైపులా ఫైర్‌లైన్‌ ఏర్పాటు చర్యలు ముందుగానే చేపట్టడంతో నష్టతీవ్రత తగ్గిందని చెప్పవచ్చు. రోడ్డుకు ఇరువైపులా పదిఫీట్ల దూరంలో ఎలాంటి గడ్డి లేకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. నిఘా పెంచుతాం

మంగళవారం మధాహ్నం 12 గంటల సమయంలో శ్రీశైలం జాతీయ రహదారి ఉడుంబండ వద్ద అడవిలో మంటలు వ్యాపించడంతో సిబ్బందితో వెళ్లాం. అక్కడ కార్చిచ్చు జరగడం యాత్రికుల తప్పిదమే అని భావిస్తున్నాం. శ్రీశైలం వెళ్తూ మార్గమధ్యలో ఆగిన సమయంలో యాత్రికులు బీడీ, సిగరేట్‌ తాగి వదిలేసిన దాని వల్లనే సంఘటన జరిగినట్లుగా నిర్దారణకు వచ్చాం. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా రౌండిది క్లాక్‌ గస్తీ వాహనాన్ని తిప్పుతూ నిఘా పెంచుతున్నాం.   - రవిమోహన్‌భట్‌, రేంజర్‌ 


logo