శనివారం 30 మే 2020
Nagarkurnool - Feb 06, 2020 , 02:58:46

నీటి సంపులో పడి ఇద్దరు మృతి

నీటి సంపులో పడి ఇద్దరు మృతి

ఇంటి ముందు ఆడుతూ పాడుతూ అల్లారు ముద్దుగా తిరుగుతున్న ఇద్దరు పసి పిల్లలు ఒక్కసారిగా మాయమయ్యారు. ఇంటి వారు తేరుకొని చూసేసరికే ప్రాణాలు కోల్పోయారు. ఆ పిల్లలు ఆడుకుంటూ వెళ్లి ఇండ్ల ముందున్న నీటి సంపుల్లో పడి ప్రాణాలు కోల్పోవడం ఆ కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిల్చింది. ఈ విషాద ఘటనలు పెబ్బేరు, హన్వాడ మండలాల్లో చోటు చేసుకున్నాయి. 

- పెబ్బేరు రూరల్‌ (శ్రీరంగాపురం)/హన్వాడ


ఆయా గ్రామస్తులు, బాధిత కుటుంబీకులు తెలిపిన కథనం మేరకు..  శ్రీరంగాపురం మండలం కంభాళాపురం గ్రామానికి చెందిన అయ్యన్న, అనిత దంపతుల ఏకైక సంతానం యేడాది మూడు రోజుల వయసున్న జశ్వంత్‌. బుధవారం మధ్యాహ్నం బెలూన్‌తో ఆ బాలుడు ఆడుకుంటున్నాడు. అది నీటిలో పడిపోవడంతో దాని కోసం వెళ్లి ప్రమాదవశాత్తు నీటి గుంతలో పడిపోయాడు. అప్పటి వరకు తమ కళ్లెదుట ఉన్న బిడ్డ కనిపించకపోయే సరికి వారు ఇల్లంతా వెతికారు. చివరికి నాలుగడుగుల లోతున్న నీటి సంపులో శవమై కనిపించడంతో వారి రోదనలు చెప్పనలవి కావు. 


అలాగే హన్వాడ మండల కేంద్రంలోని బీసీ కాలనీకి చెందిన ఆశన్న, అరుణ దంపతుల రెండేండ్ల కుమారుడు అనిల్‌ కుమార్‌. బుధవారం సాయంత్రం వేళ ఆడుకుంటూ ఇంటి ముందున్న నీటి సంపులో పడ్డాడు. కొద్దిసేపటికి కుమారుడు కనిపించడం లేదంటూ చుట్టుపక్కల ఇళ్లలో వెతికారు. బాలుడు గురించి అందరినీ అడిగారు. ఎక్కడా బాలుడి జాడ కనిపించకపోవడంతో ఇంటి ముందున్న నీటి సంపులో చూశారు. అప్పటికే బాలుడు ప్రాణాలు కోల్పోవడంతో కన్నీటి పర్యంతమయ్యారు. బాలుడి శవాన్ని చూసిన గ్రామస్తులు కంటతండి పెట్టుకున్నారు. 


logo