శుక్రవారం 07 ఆగస్టు 2020
Nagarkurnool - Feb 05, 2020 , 00:18:54

టూరిజం హబ్‌గా నల్లమల

టూరిజం హబ్‌గా నల్లమల

నాగర్‌కర్నూల్‌ ప్రతినిధి/అచ్చంపేట, నమస్తే తెలంగాణ/అమ్రాబాద్‌ రూరల్‌: నల్లమలలో ఉన్న ప్రతి టూరిజం ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు తగినన్ని నిధులు కేటాయిస్తామని, పర్యాటకులు అబ్బురపడేలా అభివృద్ధి చేస్తామని పర్యాటక, ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. మంగళవారం నల్లమల ప్రాంతంలోని అమ్రాబాద్‌ మండల పరిధిలోని మన్ననూర్‌లో రూ.14కోట్లతో హరిత టూరిజం హోటల్‌, రిసార్ట్‌ను విప్‌లు గువ్వల బాలరాజు, కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, టూరిజంశాఖ చైర్మెన్‌ భూపతిరెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌ నుంచి శ్రీశైలం టూరిజం ప్యాకేజీలను చేపడతామ, పాపికొండలు, గోవాలను తలదన్నే విధంగా అభివృద్ధి పరుస్తామని మంత్రి పేర్కొన్నారు. పుష్కలమైన అటవీ సంపద కలిగి.. సహజ నీటి వనరులున్న ఉమ్మడి జిల్లాను జాతీయస్థాయిలో పేరు తీసుకువస్తామని అన్నారు. తెలంగాణ వస్తే ఏమోస్తదని పదే పదే మాట్లాడిన వారి నోర్లు..నేడు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి మూసుకున్నాయని గుర్తుచేశారు. తమ నాయకుడు సీఎం కేసీఆర్‌ ఇంకా 20 యేండ్లు రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తాడని, యువకిశోరం మంత్రి కేటీఆర్‌ ఆధ్వర్యంలో మరింత ఎక్కువ సమయం శక్తివంచన లేకుండ పనిచేస్తామన్నారు. ఏపీలో ఉన్న పాపికొండలను తలదన్నేలా నల్లమల టూరిజం అభివృద్ధికి రూ. 50 కోట్లు కేటాయించిన విషయాన్ని గుర్తుచేశారు. 


ఉమామహేశ్వరంలో రూ. 10 కోట్లు, మన్ననూర్‌లో హరిత టూరిజం కోసం రూ.14కోట్లు, ఈగలపెంట వద్ద హరిత టూరిజం నిర్మాణం కోసం రూ. 26 కోట్లు ఖర్చు చేస్తుందన్నారు. నల్లమల ఒకప్పుడు తుపాకులతో దద్దరిల్లుతుండేదని.. నేడు ఇక్కడే పర్యాటక రంగం అభివృద్ధిలో పరుగులు పెట్టించేందుకు విప్‌ గ్వువల బాలరాజు ఎంతగానో కృషి చేస్తున్నారని గుర్తుచేశారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రతి ఎకరాకు సాగునీరందించే అందించే కార్యక్రమం జరుగుతుందని, ఇదేక్రమంలో అమ్రాబాద్‌ లిఫ్ట్‌ ద్వారా అచ్చంపేట ప్రాంతాన్ని ఉమ్మడి అమ్రాబాద్‌ మండలానికి సాగునీరు అందించే కార్యక్రమంపై సీఎం కేసీఆర్‌తో మాట్లాడి ఒప్పించిన విషయం గుర్తుచేశారు. కేవలం మూడు సంవత్సరాలలోనే కాళేశ్వరం ప్రాజెక్టుకు శరవేగంగా పూర్తిచేసి 104టీఎంసీల నీరు ఉండేలా గొప్పనిర్మాణం, అలాగే 350 కి. మీ దూరం గోదావరి నదిలో నీరు ఉంచేలా చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు. 

       

సందర్భంగా విప్‌   మాట్లాడుతూ రానున్న రోజుల్లో నల్లమలలో పర్యటక రంగం మరింతగా విస్తరించేలా మంత్రి సహకారంతో మరిన్ని నిధులు వచ్చేలా కృషి చేస్తానన్నారు. అచ్చంపేటను మరో సిద్దిపేట చేసే వరకు వెనకడుగు వేసేది లేదన్నారు. మద్దిమడుగు వద్ద కృష్ణానదిపై బ్రిడ్జి నిర్మాణం కోసం కృషి చేస్తానన్నారు. విప్‌ కుచుకుళ్ల మాట్లాడుతూ జిల్లాలోని సోమశిల టూరిజం ప్రాంతాన్ని చూస్తే వేరే దేశంలో ఉన్న అనుభూతి కలుగుతుందని అన్నారు. నల్లమల టూరిజం హబ్‌ మారుతుందన్నారు. ఈకార్యక్రమంలో జెడ్పీ చైర్‌ పర్సన్‌ పద్మావతి, కలెక్టర్‌ శ్రీధర్‌, ఆర్డీవో పాండునాయక్‌, ఎంపీపీ అవుట శ్రీనువాసులు, పదర జెడ్పీటీసీ రాంబాబునాయక్‌, ఎంపీటీసీలు దాసరి శ్రీనువాసులు, మంతటి బాలమ్మ, టూరిజం చైర్మెన్‌ భూపతిరెడ్డి, సర్పంచ్‌ శ్రీరాంనాయక్‌, ఎంపీడీవో శంకర్‌నాయక్‌, తాసిల్దార్‌, టీఆర్‌ఎస్‌ మండల పార్టీ అధ్యక్షుడు రవిందర్‌రెడ్డి, జిల్లా నాయకులు పెర్ముల చెన్నకేశవులు, సీఎంరెడ్డి, తులసీరాం, రాజేందర్‌, అనిల్‌కుమార్‌, నర్సింహ్మగౌడ్‌ వివిధ ప్రాంతాలకు చెందిన టీఆర్‌ నాయకులు పాల్గొన్నారు.


logo