శనివారం 30 మే 2020
Nagarkurnool - Feb 03, 2020 , 23:31:04

పోరు షురూ..‘సహకార’ నోటిఫికేషన్‌ విడుదల

పోరు షురూ..‘సహకార’ నోటిఫికేషన్‌ విడుదల

నాగర్‌కర్నూల్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : నాగర్‌కర్నూల్‌ జిల్లాలో సహకార సంఘాల ఎన్నికలకు అధికారులు చర్యలు చేపట్టారు. జిల్లాలోని 23సింగిల్‌ విండోలకు ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. జిల్లాలో 20మండలాలు ఉన్నాయి. తెలంగాణతో పాటుగా జిల్లాగా మారిన తర్వాత నాగర్‌కర్నూల్‌లో తొరిసారిగా సింగిల్‌ విండో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. చివరగా 2013, ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ప్రతి విండోకు 13 డైరెక్టర్ల పదవులకు పోలింగ్‌ జరుగుతుంది. ఇందులో ఎస్సీలకు 2చొప్పున 46డైరెక్టర్ల పదవులు రిజర్వు అయ్యాయి. అలాగే బీసీలకు 2చొప్పున 46డైరెక్టర్లు, ఎస్టీలకు 23డైరెక్టర్లు, జనరల్‌ మహిళకు 23డైరెక్టర్ల చొప్పున రిజర్వు చేయగా మరో 161డైరెక్టర్ల పదవులు జనరల్‌గా ఉంటాయి. ఈ ఎన్నికలకు సింగిల్‌ విండో అధికారులు సోమవారం నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఈనెల 6,7,8తేదీల్లో డైరెక్టర్ల పదవులకు నామినేషన్లను స్వీకరిస్తారు. ఇక 10వ తేదీన ఉపసంహరణ ఉంటుంది. చివరగా ఈనెల 15న ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు పోలింగ్‌ ఉంటుంది. అదే రోజు మధ్యాహ్నం 3గంటలకు ఓట్లను లెక్కిస్తారు. ఆ వెంటనే విజేతలను ప్రకటిస్తారు. ఒక్క రోజులోనే పోలింగ్‌, ఫలితాల వెల్లడి ఉంటుంది.  కాగా 23 సింగిల్‌ విండోల ఛైర్మన్ల పదవులకు మాత్రం రిజర్వేషన్లు ఉండవు. ప్రతి విండో పరిధిలో గెలిచిన 13మంది సభ్యుల్లో మెజార్టీ డైరెక్టర్లు పరోక్ష పద్ధతిలో ఒకరిని ఛైర్మన్‌గా ఎన్నుకుంటారు. ఈ ఎన్నిక 16వ తేదీన జరుగుతుంది. ఈ ఎన్నికల్లో 91,421మంది రైతులు ఓటు హక్కు వినియోగించుకుంటారు. జిల్లాలో 23విండోల పరిధిలో 1.81లక్షల మంది రైతులు సభ్యులుగా ఉండగా ఓటింగ్‌ అర్హత కలిగిన 91వేల మంది మాత్రమే ఎన్నికల్లో పాల్గొంటారు. ఈ ఎన్నికలతో దాదాపుగా అన్ని ఎన్నికలు పూర్తవుతాయి. గత డిసెంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా ఆ తర్వాత సర్పంచ్‌, మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికలు, ఏప్రిల్‌-మే వరకు ఎంపీ ఎన్నికలు జరిగాయి. ఇటీవలే మున్సిపల్‌ ఎన్నికలు సైతం జరిగాయి. ఇలా అన్ని రకాల ఎన్నికలు పూర్తికాగా సహకార సంఘాల ఎన్నికలకు సైతం నోటిఫికేషన్‌ వెలువడ్డాయి. గత ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌ పార్టీనే ఆధిక్యత నిరూపించుకొంది. పార్టీ గుర్తులతో జరిగిన అసెంబ్లీ,పార్లమెంట్‌, పరిషత్‌ ఎన్నికలు, పార్టీ గుర్తులు లేని సర్పంచ్‌ ఎన్నికల్లోనూ అత్యధిక స్థానాలను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకొంది. ప్రతిపక్ష కాంగ్రెస్‌, కమలం పార్టీలు మాత్రం ఉనికిని కోల్పోయాయి. చివరివైన ఈ ఎన్నికల్లోనూ మెజార్టీ లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ ముందుకు సాగుతోంది. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేలు ఇప్పటికే ఆశావహులు, ముఖ్య నాయకుల సమావేశాలు నిర్వహించారు. అదే ప్రతిపక్షాలు మాత్రం నిస్తేజంలో మునిగిపోయాయి. ఇదిలా ఉంటే అధికారులు మాత్రం ఎన్నికలను విజయవంతంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. నామినేషన్ల స్వీకరణకు ఆయా విండో కార్యాలయాల్లోనే ఏర్పాట్లు చేపట్టనున్నారు. మూడు రోజుల పాటు ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఇందుకోసం ఇతర శాఖలకు సంబంధించిన డివిజన్‌ స్థాయి అధికారులు రిటర్నింగ్‌ అధికారులుగా నియమించడం జరిగింది. ఇక సహాయకులుగా విండో అధికారులు వ్యవహరిస్తారు. ఎన్నికలకు సంబంధించిన కార్యాచరణపై జిల్లా కలెక్టర్‌ శ్రీధర్‌ సహకార అధికారులతో పాటుగా రిటర్నింగ్‌ అధికారులకు సైతం ఇప్పటికే సూచనలు జారీ చేశారు. ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించడం జరిగింది. మొత్తం మీద సహకార ఎన్నికలతో గ్రామాల్లో మరోసారి ఎన్నికల సమరం మొదలైంది.  logo