బుధవారం 03 జూన్ 2020
Nagarkurnool - Feb 03, 2020 , 23:33:13

గోపల్‌దిన్నెకు జూరాల నీళ్లివ్వండి

గోపల్‌దిన్నెకు జూరాల నీళ్లివ్వండి

కొల్లాపూర్‌,నమస్తే తెలంగాణ: కొల్లాపూర్‌ నియోజక వర్గంలోని (వనపర్తి జిల్లా పరిధిలో) వీపనగండ్ల మండలం గోపల్‌దిన్నె రిజర్వాయర్‌కు జూరాల నీటితో వెంటనే నింపి ఆయకట్టు పొలాలకు సాగునీరందించి రైతాంగాన్ని ఆదుకోవాలని స్థానిక ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్‌రెడ్డి నీటిపారుదల చీఫ్‌ ఇంజనీర్‌ మురళీధర్‌ని కోరారు. సోమవారం ఎర్రమంజిల్‌లోని ఈఎన్సీ కార్యాలయంలో  మురళీధర్‌తో ఎమ్మెల్యే బీరం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. గోపల్‌దిన్నె రిజర్వాయర్‌ ఆయకట్టు పరిధిలోని వీపనగండ్ల, చిన్నంబావి మండలాల్లో వేలాది ఎకరాల్లో సాగు చేసిన వ్యవసాయ పొలాలకు గత కొన్ని రోజులుగా నీటి విడుదల లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్న విషయాన్ని ఎమ్మెల్యే బీరం ఈఎన్సీ మురళీధర్‌ దృష్టికి తీసుకొచ్చారు. గోపల్‌దిన్నె రిజర్వాయర్‌లో సాగునీరు తగ్గడంతో రైతుల పొలాలకు సాగునీరందడం లేదన్నారు. ఇదివరకు జూరాల ప్రాజెక్టు కెనాల్‌ నుంచి నీటిని  గోపల్‌దిన్నె రిజర్వాయర్‌కు సరఫరా జరుగుతుండేదని ఎమ్మెల్యే బీరం వివరించారు.  వెంటనే రిజర్వాయర్‌ను జూరాల నీటితో నింపి ఆయకట్టు పొలాలకు నీటిని విడుదల చేయాలని ఎమ్మెల్యే ఈఎన్సీ మురళీధర్‌ని కోరారు. దీంతో సోమవారం సాయంత్రానికి జూరాల ప్రాజెక్టు నుంచి గోపల్‌దిన్నె రిజర్వాయర్‌కు నీటి విడుదలకు ఈఎన్సీ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఈ సమావేశంలో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు చింతలపల్లి జగదీశ్వర్‌రావు, వీపనగండ్ల మండల పరిషత్‌ మాజీ ఉపాధ్యక్షుడు జి.ఇంద్రసేనారెడ్డిలున్నారు.logo