శుక్రవారం 07 ఆగస్టు 2020
Nagarkurnool - Feb 02, 2020 , 02:04:45

పాలమూరుకు పైసలియ్యలే

పాలమూరుకు పైసలియ్యలే

మహబూబ్‌నగర్ నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి : కేంద్ర బడ్జెట్‌లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు గుండెకాయ వంటి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కల్పించకపోవడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. కనీసం ప్రత్యేకంగా నిధుల కేటాయింపు కూడా చేయకపోవడంపై రైతులు పెదవి విరుస్తున్నారు. కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత జిల్లాకో నవోదయ పాఠశాల, కేంద్రీయ విద్యాలయం ఇవ్వాల్సిన కేంద్రం ఆ విషయంలోనూ నిర్లక్ష్యం చూపడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు 25 వేల కోట్లు ఇవ్వాలని నీతి అయోగ్ సిఫార్సు చేసినా.. కేంద్రం పట్టించుకోకపోవటం విస్మయానికి గురి చేస్తున్నది. మరోవైపు రైల్వే ఆన్ గోయింగ్ ప్రాజెక్టులకు మాత్రమే నిధులు ఇచ్చినట్లు తెలుస్తోంది. దేశంలో కొత్తగా 100 ఎయిర్ పోర్టులు ఏర్పాటు చేస్తామని బడ్జెట్‌లో ప్రతిపాదించడంతో ఇక ఎప్పటి నుంచో ప్రతిపాదనల్లో ఉన్న స్థానిక ఎయిర్ పోర్ట్ (మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి సమీపంలో)పై ఆశలు చిగురిస్తున్నాయి.  

ఆశల ప్రాజెక్టుపై నీళ్లు..

దక్షిణ తెలంగాణ వరప్రదాయినిగా భావిస్తున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వకపోవడంతోపాటు నిధులు కూడా విదిల్చకపోవడం విమర్శలకు తావిస్తున్నది. ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ జాతీయ నాయకులు ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని హామీలు కూడా ఇచ్చినా అమలుకునోచలేదు. కూరగాయల మార్కెటింగ్ కోసం విమానాలను వినియోగించుకునేంత అభివృద్ధి చేస్తామని ప్రకటించడంపై రైతులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మైక్రో ఇరిగేషన్ కు ప్రోత్సహించడంపైనా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  

కేంద్ర విద్యాలయాలేవీ..

కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థలు నెలకొల్పాలని జిల్లాకు చెందిన ఎంపీలు కోరుతూ వస్తున్నారు. పలుమార్లు కేంద్ర మంత్రులను కలిసి వినతిపత్రాలు సైతం సమర్పించినా బడ్జెట్‌లో ఆ ఊసేలేదు. కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో 4 కేంద్రీయ విద్యాలయాలు, 4 నవోదయ పాఠశాలలు ఏర్పాటు చేయాల్సి ఉంది. వీటి ఏర్పాటుతో కేంద్ర ఉద్యోగుల పిల్లలు, పేదలకు మెరుగైన కార్పొరేట్ విద్య అందించే అవకాశం లభించేది.  

రైల్వే ప్రాజెక్టులకు హామీ లేదు..

ప్రస్తుతం కొనసాగుతున్న ఆన్ గోయింగ్ ప్రాజెక్టులకు నిధులు కేటాయించింది. పెండింగ్ ప్రాజెక్టులపై కేంద్ర శీతకన్ను వేసింది. ప్రస్తుతం సాగుతున్న కాచిగూడ- మహబూబ్ నగర్ డబ్లింగ్, విద్యుదీకరణ... దేవరకద్ర- మునీరాబాద్ రైల్వే లైన్లకు మినహా మిగతా వాటికి నిధులు ఇవ్వలేదని సమాచారం. ఇక 11వేల కిలోమీటర్ల రైల్వే లైన్ విద్యుదీకరణ చేస్తామని చెప్పడం మాత్రం అన్ని ప్రాంతాలకూ ఊరటే. దీని వల్ల డీజిల్ రైళ్లు తగ్గి.. వేగంగా సాగే వి ద్యుత్ రైళ్లు వచ్చేందుకు అవకాశం ఉంది. ఇక దక్షిణ మధ్య రైల్వే పరిధిలో రైల్వే కేటాయింపులు ఏం ఉన్నాయో వివరాలు మరో నాలుగైదు రోజుల్లో తెలిసే అవకాశం ఉంది.  

పాలమూరుకు గాలిమోటరు

ఉడాన్ కింద 2024 నాటికి చిన్న పట్టణాలకు సైతం విమానయాన సౌకర్యం కల్పించేందుకు కేంద్రం తీసుకువచ్చిన పథకం ఉడాన్. ఈ పథకం ద్వారా ఎప్పటి నుంచో ఊరిస్తున్న ఎయిర్ పోర్ట్ ఏర్పాటు అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల మండ లం గుడిబండ సమీపంలో జాతీయ రహదారికి సమీపంలో ఎయిర్ పోర్ట్ కోసం గతంలో ప్రతిపాదనలు చేశారు. అయితే స్థల సేకరణ మాత్రం ఇంకా పూర్తి కాలేదు. ఎయిర్ పోర్ట్ ఏర్పాటు అయితే సామాన్యులకు సైతం విమానయాన సౌకర్యం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. 

మరిన్ని సోలార్ ప్రాజెక్టులు

సంప్రదాయేతర ఇంధన వనరులకు రూ. 22వేల కోట్లు కేటాయించారు. వీటి వల్ల ఉమ్మడి జిల్లాలో ఇంకా సోలార్ ప్రాజెక్టులు ఏర్పాటు అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పెద్ద ఎత్తున సోలార్ ప్లాంట్లున్నాయి. ప్రస్తుతం భారీగా నిధుల కేటాయింపు వల్ల విద్యుత్ రంగం మరింత అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంది. ఇక భారత్ నెట్ ద్వారా గ్రామ పంచాయతీలకు నెట్ సౌకర్యం అందించడం మంచి ఆలోచనగా పేర్కొంటున్నారు. వర్సిటీల కోసం తీసుకువచ్చిన జాతీయ విధానం, కోర్సుల పెంపు ప్రకటన వల్ల పాలమూరు యూనివర్సిటీకి మేలు జరుగుతుందని ఆశిస్తున్నారు. జిల్లా దవాఖానలకు మెడికల్ కళాశాలలతో అనుసంధానం, వైద్య పీజీ కోర్సుల కోసం జనరల్ దవాఖానాలకు మరిన్ని ప్రోత్సాహకాలు ఇస్తామని ప్రకటించిన కేంద్ర ఆర్థిక మంత్రికి వైద్య విద్యార్థులు కృతజ్ఞతలు చెబుతున్నారు. టీబీ హరేగా... దేశ్ బచేగా స్కీం, మిషన్ ఇంద్రధనుష్‌కు నిధుల కేటాయింపు పైనా హర్షం వ్యక్తం అవుతున్నది. logo