శనివారం 30 మే 2020
Nagarkurnool - Feb 02, 2020 , 01:56:02

సహకారానికి సై

సహకారానికి సై

 నాగర్‌కర్నూల్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : సింగిల్ విండో ఎన్నికలకు రాజకీయ పార్టీలు సమాయత్తమవుతున్నాయి. జిల్లాలోని 23విండోల చైర్మన్ల పదవులతో పాటుగా 299 డైరెక్టర్ల పదవులకు ఈ నెల 15వ తేదీన ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికల్లో ప్రతి విండోకు 13డైరెక్టర్ల పదవులు ఉంటాయి. ఇందులో 2 ఎస్సీ, 2 బీసీ, ఒకటి ఎస్టీ, ఒకటి ఓసీ మహిళకు కాగా మరో ఏడు జనరల్‌కు రిజర్వుకానున్నాయి. ఇందులో ఏయే స్థానాలు ఏయే కేటగిరీకి రిజర్వు కానున్నాయనే అంశంపై ఆదివారం స్పష్టత రానుంది. సోమవారం నోటిఫికేషన్ విడుదల కానుండటంతో అధికారులు రిజర్వేషన్లను ఖరారు పూర్తి చేస్తారు. దీంతో ఆయా స్థానాల్లో పోటీ చేసేందుకు ఆశావహులకు స్పష్టత వస్తుంది. ఇప్పటికే ఆశావహులు పోటీకై తమ డైరెక్టర్ పరిధిలోకి వచ్చే రైతులతో మాటామంతీ చేసుకొంటున్నారు. ఓటర్ల తుది జాబితాపై కూడా ఆదివారమే స్పష్టత వస్తుంది. దీంతో ఓటర్లు, రిజర్వేషన్ల ఖరారు కోసం ఆశావహులు ఎదురు చూస్తున్నారు. నామినేషన్ల ప్రక్రియ ఈ నెల 6వ తేదీ నుంచి ప్రారంభం కానుంది.   ఈ ఎన్నికల్లో గెలుపు కోసం అధికార టీఆర్‌ఎస్ సహా కాంగ్రెస్, కమలం పార్టీలు మరోసారి తలపడనున్నాయి. ఈ ఎన్నికలు పార్టీ గుర్తులతో సంబంధం లేకుండా జరగబోతుండటంతో కులాల వారీగా బలంగా ఉన్న ఓటర్ల వర్గాన్ని పార్టీలు లక్ష్యంగా  చేసుకొంటున్నాయి.  ఈ ఎన్నికల్లో గత ఎన్నికల మాదిరిగానే టీఆర్‌ఎస్ బలపర్చిన అభ్యర్థులకే విజయావకాశాలు అధికంగా ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఎంజీకేఎల్‌ఐ ప్రాజెక్టును పూర్తి చేసి జిల్లాలో వేలాది ఎకరాలకు నీరు అందిస్తోంది. నాలుగు విడతలుగా 12వందల చెరువులను మిషన్ భగీరథ పథకం ద్వారా పునరుద్ధరణ చేసింది. దీంతో నీటి వనరుల లభ్యత పెరిగింది.  24గంటల కరెంట్, రైతుబంధు ద్వారా ప్రతి సంవత్సరం పంటలకు రూ.10వేల చొప్పున ఆర్థిక సాయం, రైతు బీమాలాంటి పథకాలను అమలు చేస్తోంది. రైతులకు ప్రతి వ్యవసాయ సీజన్‌లోనూ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను అందిస్తోంది. పండిన పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తోంది. మహిళా సంఘాలతో పాటుగా సింగిల్ విండోల ద్వారా కొనుగోళ్లు చేస్తూ రైతన్నలకు మద్దతు ధరను అందజేస్తోంది. దీంతో  రైతులకు టీఆర్‌ఎస్‌పై ప్రత్యేక అభిమానం ఏర్పడింది. గత అసెంబ్లీ, పార్లమెంట్, సర్పంచ్, మండల, జిల్లా పరిషత్ ఎన్నికలతో పాటుగా ఇటీవలే వెల్లడైన పురపాలికల్లోనూ గులాబీ పార్టీకి పట్టం కట్టారు. పార్టీ గుర్తులతో జరిగినా, సర్పంచ్ ఎన్నికల్లో గుర్తులు లేకుండా జరిగినా టీఆర్‌ఎస్ మద్దతుదారులనే గెలిపిస్తున్నారు. రైతులు ఈ గెలుపులో కీలకంగా మారుతున్నారు. దీంతో నేరుగా జరుగుతున్న రైతుల సహకార సంఘ ఎన్నికల్లోనూ అదే ఫలితాలు పునరావృతమయ్యే అవకాశమున్నట్లుగా రాజకీయ పార్టీలు అంచనా వేస్తున్నాయి. కాంగ్రెస్, కమలం పార్టీలకు ఈ ఎన్నికల్లో అభ్యర్థులే దొరకడం కష్టంగా మారింది. కాంగ్రెస్ పార్టీ మాత్రం మరోసారి తనఅదృష్టాన్ని పరీక్షించుకోనుంది. టీఆర్‌ఎస్‌లో మాత్రం పెద్ద ఎత్తున ఆశావహులు పోటీకి ఎదురు చూస్తున్నారు. మొత్తం మీద సహకార పోరు మరోసారి కారులో హుషారు నింపబోతుండగా కాంగ్రెస్, కమలంలో మాత్రం ఆందోళనకు తెరతీసింది.


logo