ఆదివారం 31 మే 2020
Nagarkurnool - Feb 02, 2020 , 01:42:31

పశువుల వివరాలు నమోదు

 పశువుల వివరాలు నమోదు

     తిమ్మాజిపేట : పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో పశువుల వివరాలు నమోదు చేస్తున్నట్లు జిల్లా పశువైద్యాధికారి అంజిలప్ప తెలిపారు. శనివారం మండల కేంద్రంలో పశువ్యాధి నివారణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.  అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ  మనుషులకు ఆధార్‌కార్డు తరహాలోనే ప్రతి పశువుకు , పశువు యజమానికి  కార్డు జారీ చేస్తామని, ఇందులో పశువు వివరాలు, రైతు వివరాలు, రైతుకు సంబంధించిన పశువుల వివరాలు నమోదు చేసి ప్రతి పశువుకు ట్యాగ్ వేయనున్నట్లు తెలిపారు. గతంలో ఉమ్మడి ఆంద్రప్రదేశ్‌లో నాలుగు జిల్లాలో ఈ కార్యక్రమం ప్రారంభమైందని, ప్రస్తుతం అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు  పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి  పశువు వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయనున్నట్లు పేర్కొన్నారు. గాలికుంటు వ్యాధి నివారణ కోసం ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు.  రైతు, పశువుకు సంబంధించిన సమగ్ర సమాచారం సేకరించిన అనంతరం ట్యాగింగ్ ద్వారా వ్యాధి నివారణ మందులు వేస్తామన్నారు. ఇందుకు రైతులు సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని మండల కేంద్రంలో ప్రారంభించారు. కార్యక్రమంలో స్థానిక పశువైద్యాధికారి శివరాజు పాల్గొన్నారు. 


logo