గురువారం 28 మే 2020
Nagarkurnool - Feb 01, 2020 , 01:14:43

నల్లమల సాగునీటి కల సాకారం చేస్తా

నల్లమల సాగునీటి కల సాకారం చేస్తా
  • కేసీఆర్‌ అపర భగీరథుడు
  • ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలంచిన విప్‌ గువ్వల బాలరాజు
  • గున్నంపెంట లిఫ్ట్‌ ఏర్పాటుకు కృషి చేస్తా

పదర: నల్లమల ప్రజలకు సాగునీరందించేందుకు కృషి చేస్తున్నామని, రాష్ట్రంలో ప్రతి ఎకరాకు సాగునీరందించేందుకు సీఎం కేసీఆర్‌ అపర భగీరథుడిలా శ్రమిస్తున్నారని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. సాగునీరు విషయమై మండల నాయకులు, ప్రజాప్రతినిధులతో శుక్రవారం మండలం పరిధిలోని గున్నపెంటను విప్‌ సందర్శించారు. కృష్ణానది పరీవాహక లోతట్టు ప్రాంతమైన గున్నపెంట ఇప్పలపల్లికి 14కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ముందుగా అక్కడే కొలువుదీరిన వెంకటేశ్వర స్వామి సేవలాల్‌ మహరాజ్‌కు బంజారా సంస్కృతిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండలానికి వచ్చే సాగునీరు విషయంలో ఏర్పాటు చేసే లిఫ్ట్‌ కోసం స్థల పరిశీలన చేశారు. సముద్ర మట్టానికి 680మీటర్ల ఎత్తులో ఉన్న పదర ప్రాంతానికి సాగునీరు విషయమై అనేక సార్లు అసెంబ్లీలో ప్రస్తావించినట్లు తెలిపారు. గున్నపెంట వద్ద ప్రత్యేక లిఫ్ట్‌ ఏర్పాటు చేసి 5కిలోమీటర్ల వరకు నీళ్లు పంపింగ్‌ చేసి చెరువులు, కుంటలు నింపితే మద్దిమడుగు, ఇప్పలపల్లి మారడుగు, గానుగపెంట గ్రామ పంచాయతీల పరిధిలో పంట పొలాలకు సాగునీరందుతుందన్నారు. 


అవసరమైతే ఇరిగేషన్‌ శాఖ అధికారులతో కలిసి సర్వే నిర్వహించి ప్రతిపాదనలు తయారు చేసి, సీఎం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు ఆయన హామీ ఇచ్చారు. అలాగే ఇక్కడి పురాతన దేవాలయ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెడ్తానని ఆయన అన్నారు. త్వరలోనే పోడు భూములకు సమస్యలు తీరుతాయని చెప్పారు. అనంతరం వంకేశ్వర గ్రామంలోని సైదులు బాబా దర్గాలో ప్రత్యేక పూజాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ రాంబాబు నాయక్‌, ఎంపీపీ బీక్య నాయక్‌, వైస్‌ ఎంపీపీ వరుణ్‌ కుమార్‌, టీఆర్‌ఎస్‌ జిల్లా నాయకులు ఎర్ర నరసింహులు, సర్పంచులు బాజుతారాసింగ్‌, నీలవిష్ణు, రామ్‌ నాయక్‌, బాలకిషన్‌, మాజీ సర్పంచ్‌ రాయ శ్రీనివాసులు, ఎంపీటీసీలు సునిత, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు వెంకటయ్య, నాయకలు ముత్యాలు, ఎల్లయ్య యాదవ్‌, వెంకటయ్య సుబ్బారెడ్డి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.


logo