శనివారం 06 జూన్ 2020
Nagarkurnool - Jan 31, 2020 , 02:28:36

‘సహకార’ నగారా

‘సహకార’ నగారా
  • నోటిఫికేషన్‌ విండోల పరిధిలో ఎన్నికలు
  • సర్దుకుంటున్న ఆశావహులు
  • హక్కు వినియోగించుకోనున్న 1.10లక్షల మంది సభ్యులు

నాగర్‌కర్నూల్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: సహకార సంఘాల ఎన్నికలకు అధికారులు సిద్ధమయ్యారు. నాగర్‌కర్నూల్‌ జిల్లాలోనూ 23 సహకార సంఘాల ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేపడుతున్నారు. జిల్లాలో 23సహకార సంఘాల పరిధిలో 1.10లక్షల మంది రైతన్నలు సభ్యులు ఉన్నారు. ఈ సభ్యుల సంఖ్యపై త్వరలో విండో అధికారులు మార్పులు చేర్పులు చేపట్టనున్నారు. గతంలో రూపొందించిన జాబితా కాగా కొందరు రైతులు మృతి చెందడం, సంఘాల్లో లేకపోవడంతో ఓటర్ల సంఖ్యలో స్వల్ప మార్పు ఉండనుంది. కాగా జిల్లాలో 23సంఘాలు ఉండగా ఇటీవలే ప్రభుత్వం ప్రతి మండలానికి రెండు చొప్పున సంఘాలను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది. దీని ప్రకారం కొత్తగా 18సంఘాలకు నోటిఫికేషన్‌ విడుదల కాగా మొత్తం 41విండోలు ఏర్పాటు కానుండగా దీని ప్రకారం ఎన్నికల నిర్వహణలో సాంకేతిక ఇబ్బందులు ఎదురుకానున్నాయి. దీంతో కొత్త సంఘాల ఉత్తర్వులు రద్దు అవుతూ గతంలో ఉన్న 23సంఘాల ప్రాతిపదికనే విండోల ఎన్నికలు జరగనున్నాయి. సహకార సంఘాలకు 2013 ఫిబ్రవరిలో చివరిసారిగా ఎన్నికలు జరిగాయి. అయితే ఆ తర్వాత పాలకవర్గ పదవీ కాలం ముగిసినా ఎన్నికలు జరగలేదు. దీంతో ఆరు నెలలకు ఒకసారి విండోల పాలకవర్గాల పదవీ కాలాన్ని పొడిగిస్తూ రావడం జరుగుతోంది. 


ప్రస్తుత పొడిగింపు ఫిబ్రవరి 4వ తేదీతో ముగియనుంది. ఈ కారణంగా మరోసారి ఎన్నికలపై సందేహాలు ఏర్పడగా సీఎం కేసీఆర్‌ ఇటీవలే ఎన్నికల నిర్వహణకు వ్యవసాయ శాఖకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమీషన్‌ సైతం ఎన్నికల నిర్వహణకు సిద్ధమైంది. శుక్రవారం 23సంఘాల ప్రాతిపదికన ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది. జిల్లాలోని నాగర్‌కర్నూల్‌, కొల్లాపూర్‌, పెద్దకొత్తపల్లిలో రెండు, కోడేరులో మూడు విండోలు ఉన్నాయి. కొత్తగా ఏర్పడిన పదర, ఊర్కొండలో సింగిల్‌ విండోలు లేవు. పెంట్లవెల్లి, చారకండల్లో ఇంతకు ముందే విండోలు ఉండటం గమనార్హం. ఇక మిగిలిన అన్ని మండలాల్లో ఒకటి చొప్పున సహకార సంఘాలు ఉన్నాయి. ఈ విండోలన్నింటికీ ఫిబ్రవరి 15న ఎన్నికలు జరుగుతాయి. ఆయా సంఘాలున్న గ్రామ కేంద్రాల్లోనే పార్టీ గుర్తులు లేకుండా ఎన్నికలు జరుగుతాయి.  సహకార సంఘాల ద్వారా రైతన్నలకు ఎన్నో రకాల సేవలు అందుతున్నాయి. రైతులకు ప్రతి రబీ, యాసంగి సీజన్లలో విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను సబ్సిడీపై విక్రయాలు జరుగుతున్నాయి. 


అలాగే పంటలు వచ్చాక రైతుల నుంచి ప్రభుత్వం సూచించిన మద్దతు ధర ప్రకారం వరి, వేరుశనగ, మొక్కజొన్న, తదితర పంటలను కొనుగోళ్లు చేస్తున్నాయి. అదే విధంగా రైతులకు, చిరువ్యాపారులకు రుణాలు, బంగారు ఆభరణాలపై రుణాలు, లాకర్‌ సదుపాయాల్లాంటి పలు సేవలను అందిస్తున్నాయి. అయితే పాలక మండళ్ల గడువును పొడిగిస్తూ వస్తుండటం వల్ల పాలకవర్గాల్లో నిస్తేజం అలుముకొంది. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే రైతు సమన్వయ సమితిలను ఏర్పాటు చేసింది. రైతుల కోసం 24గంటల కరెంట్‌, రైతుబంధు పథకం ద్వారా ఎకరానికి రూ.5వేల చొప్పున రెండు పంటలకు రూ.10వేలు, రైతు భీమా కింద చనిపోయిన రైతు కుటుంబాలకు రూ.5లక్షల ఆర్థిక సాయం అందజేస్తోంది. వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వం సహకార సంఘాల ఎన్నికలకూ సిద్ధమైంది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, సంక్షేమ చర్యలతో రైతన్నల్లో సానుకూలత నెలకొంది. 


దీని వల్లే గత ఏడాదికిపైగా వరుసగా జరుగుతూ వస్తున్న ఎమ్మెల్యే, ఎంపీ, సర్పంచ్‌, మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికలతో పాటు తాజాగా జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌కు తిరుగులేని విజయాన్ని కట్టబెట్టారు. పార్టీ గుర్తులు లేని సర్పంచ్‌ ఎన్నికల్లో సైతం టీఆర్‌ఎస్‌ మద్దతుదారులను భారీ మెజార్టీతో గెలిపించారు. తాజాగా ఇలాగే జరగబోయే ఈ ఎన్నికల్లోనూ రైతులు టీఆర్‌ఎస్‌ మద్దతుదారులకు పట్టం కట్టనున్నారని ఆ పార్టీ నాయకులు ధీమాగా చెబుతున్నారు. కాగా ఎన్నికలకు అధికారులు సైతం సమాయాత్తమయ్యారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో పాల్గొన్న అధికారులు, ఉద్యోగుల జాబితా ఇప్పటికే అందుబాటులో ఉండటంతో నోటిఫికేషన్‌ విడుదల చేసిన వెంటనే నిర్వహించనున్నారు. ఇక ఈ ఎన్నికలకు నోటిఫికేషన్‌ రావడంతో గ్రామాల్లో రైతన్నల రాజకీయ పోరు మొదలు కానుంది. logo