బుధవారం 03 జూన్ 2020
Nagarkurnool - Jan 31, 2020 , 02:25:08

జగజ్జననికి వందనం

జగజ్జననికి వందనం
  • నిజరూప దర్శనమిచ్చిన జోగుళాంబ
  • నేత్రపర్వంగా ఆదిదంపతుల శాంతి కల్యాణం
  • అలరించిన గ్రామదేవతల వేషధారణలు
  • భక్తి శ్రద్ధలతో కలశాల ఊరేగింపు
  • పులకించిన తుంగభద్ర తీరం

అలంపూర్‌, నమస్తే తెలంగాణ : అమ్మల గన్నయమ్మ మువురమ్మల మూలపుటమ్మకు భక్తకోటి ప్రణమిల్లింది. జగజ్జనని పాహిమాం అంటూ వేడుకున్నది. తుంగభద్ర తీరం జనసంద్రమైంది. కలశాలతో తరలివచ్చిన సువాసినులు క్యూలో నిలుచొని అమ్మవారికి అభిషేక జలాలు సమర్పించారు. జోగుళాంబ వార్శిక బ్రహ్మోత్సవాల సందర్భంగా అలంపూరు క్షేత్రం మొత్తం ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది.తెలంగాణ రాష్ట్రంలోని ఏకైక శక్తి పీఠమైన శ్రీ జోగుళాంబ అమ్మవారు. ప్రతి ఏటా వసంత పంచమి సందర్భంగా భక్తులకు నిజరూప దర్శనం ఇవ్వటం ఆనవాయితీగా వస్తున్నది. ఇందులో భాగంగా అమ్మవారికి నవ ఔషధులు, సుగంధ ద్రవ్యాలు, పండ్ల రసాలు, తుంగభద్ర జలాలతో వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య నేత్రపర్వంగా అభిషేకాలు నిర్వహించారు. 


వసంతపంచమి రోజున..

అలంపురాన్ని పురాణాల్లో హేమలాపురంగా కీర్తించారు. తుంగభద్ర తీరాన వెలసిన జోగుళాంబ క్షేత్రంలో అమ్మవారు ప్రతి వసంతపంచమి రోజున నిజరూప దర్శనం ఇస్తారు. గురువారం అమ్మవారు నిజరూపదర్శనం ఇవ్వడంతో భక్తులు పారవశ్యంతో ఉప్పొంగారు. ఐదు రోజులుగా జరుగుతున్న వార్శిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న చండీయాగం పూర్ణాహుతి నిర్వహించారు. వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో రాష్ట్ర నలుమూలల నుంచేగా ఏపీ, కర్ణాటకల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా జోగుళాంబ దేవి ముఖ మండపంలో ఆలయ అర్చకులు వెయ్యిఎనిమిది కలశాలతో సహస్త్ర ఘటాలకు ప్రత్యేక పూజలు చేశారు. 


అభిషేకానికి భారీగా..

1008 కలశాలల్లో భక్తులు తీసుకొచ్చిన పవిత్ర తుంగభద్ర జలాలతో అమ్మవారి మూల విరాట్‌ను ఆలయ అర్చకులు అభిషేకించారు. మొదట పంచామృతాలు, వివిధ రకాల పళ్ల రసాలతో, ఆ తర్వాత సుగంధ ద్రవ్యాలను, నవ ఔషధులను జలాల్లో కలిపి అభిషేకం నిర్వహించారు. అభిషేక జలాలను భక్తులు శిరస్సు పై చల్లుకొని చల్లంగా కాపాడుమంటూ జోగుళాంబను వేడుకున్నారు. అభిషేక జలాలను మరికొందరు తీర్థంగా స్వీకరించారు. 


ఉత్సవాలకే  వన్నె తెచ్చిన ఊరేగింపు..

కొన్ని సంవత్సరాలుగా అమ్మవారి వార్శిక బ్రహ్మోత్సవాలకు జోగుళాంబ సేవా సమితి సభ్యులు బండారు బాబు , గౌరవ అధ్యక్షుడు బోరింగ్‌ శ్రీనివాస్‌ రావు తమ సొంత ఖర్చుతో పశ్చిమ గోదావరి జిల్లా ,ఏలూరు ప్రాంతం నుంచి కళాకారులను రప్చించి ,గ్రామ దేవతల వేషధారణతో విన్యాసాలు చేయిస్తున్నారు. ప్రతి యేడు మాదిరిగానే ఈ సారి కూడా గ్రామదేవతల వేషధారణలు అలరించాయి. ఈ సందర్భంగా అన్నదానం సైతం చేశారు. ఇదిలా ఉండగా పట్టణ వైశ్యసంఘం ఆధ్వర్యంలో తుంగభద్ర పుష్కరఘాట్‌ వద్ద అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.   భీమవరం గ్రామానికి చెందిన నరసింహారెడ్డి కొ న్నేండ్లుగా ఆవునెయ్యితో చేసిన చక్కెర పొం గలి, పులిహోర ప్రసాదాలను వితరణ చేస్తూన్నారు.ఈ ఏడూ దానిని కొనసాగించారు.  


కొత్త క్యూలైన్‌లతో ఊరట ః 

ఆలయంలో రెండు వరుసల క్యూలైన్‌ ఏర్పాటు తో భక్తులకు కొంత ఊరట కల్గింది.గతంలో స ర్వ దర్శనం,శీఘ్ర దర్శనం రెండు కలిపి ఉండటంతో భక్తులు ఒకానోక సందర్భంలో ఇబ్బం ది పడుతూ వచ్చారు. ఓ భక్తుని ఆర్థిక సహాయంతో క్యూలైన్లను వేర్వేరుగా చేశారు. వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక దర్శనాలు కల్పించారు.


గ్రామాల నుంచి తరలొచ్చిన కలశాలు..

మునుపెన్నడూ లేని విధంగా వివిధ సింగవరం, కాశాపురం, ఇమాంపురం, లింగనవాయి, బుక్కాపురం, సుల్తానాపురం,బైరంపల్లి,తదితర గ్రామా ల నుంచే కాకుండా పట్టణంలోని ప్రతి ఇంటి నుంచీ కలశాలు తీసుకురావడం విశేషం.  


ఆలయంలో ప్రముఖులు 

వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని పట్టణంలో ఆలయాలను జడ్పీ చైర్‌ పర్సన్‌ సరితా తి రుపతయ్య, ఎమ్మెల్యే డాక్టర్‌ అబ్రహం, ధరణీ ప్రాజెక్టు డైరెక్టర్‌ వాకాటి కరుణ, ఏఎస్పీ కృష్ణ తదితరులు ఆలయాలను దర్శించుకున్నారు. అలంపూర్‌ సీఐ రాజు ఆధ్వర్యంలోముగ్గురు ఎస్సైలు, నలభై మంది కానిస్టేబుళ్లు, నలుగురు మహిళా పోలీసులు భద్రతా విధుల్లో పాల్గొన్నారు. logo