బుధవారం 03 జూన్ 2020
Nagarkurnool - Jan 30, 2020 , 01:11:12

అనుమానాస్పద స్థితిలో జాలరి మృతి

అనుమానాస్పద స్థితిలో జాలరి మృతి

పెంట్లవెల్లి : మండల పరిధిలోని మల్లేశ్వరం గ్రామం కృష్ణానది ఒడ్డున ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్టానికు ఓ జాలరి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. ఘటనకు సంబంధించి పోలీసుల కథనం ప్రకారం... గ్రామ సమీ పంలోని కృష్ణానది తీరం ఒడ్డున శవం కొట్టుకొచ్చిందంటూ గ్రామస్తులు సమాచారం ఇచ్చారు. అక్కడికెళ్లి మృతదేహాన్ని పరిశీలించగా అతని వద్ద చెప్పులు, ఓ సంచి ఉన్నాయన్నారు. సంచిని పరిశీలించగా ఓ జత బట్టలు, బ్రష్‌, ఆధార్‌ కార్డు ఉన్నాయన్ని పోలీసులు తెలిపారు. ఆధార్‌ కార్డు ప్రకారం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం విజయనగరం జిల్లా, గరుడబిల్లి మండలం, బొండపల్లి గ్రామానికి చెందిన పిల్ల అప్పారావు (63)గా గుర్తించామన్నారు. శవానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమితం కొల్లాపూర్‌కు తరలించి కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టినట్లు కొల్లాపూర్‌ ఏఎస్సై లక్ష్మయ్య తెలిపారు.

ప్రతి ఏటా ఐదారుగురు మత్స్యకారుల మృతి

మండల పరిధిలోని కృష్ణానదితీరం గ్రామాలైన మల్లేశ్వరం, మంచాలకట్ట, వేంకల్‌, జటప్రోల్‌ గ్రామాల్లో ప్రతిఏటా ఏదో ఒక గ్రామం శివారులల్లో ఐదారుగురు ఆంధ్రా జాలర్లు మరణిస్తూ ఉంటారని ఆయా గ్రామాల ప్రజలు చర్చించుకోవడం గమనార్హం. అంతేకాక ఈ జాలర్ల మృతికి ప్రధాన కారణం వారిని సారాకు బానిసలను చేసి శారీరకంగా, మానసికంగా చిత్ర హింసలకు గురి చేసి నిషేధిత వలలు అర్ధరాత్రి వేళల్లో చేపలను పట్టించడమం, చలికి వలలను లాగడం మూలంగానే ప్రతి ఏడాదీ ఇలా జాలర్లు మృతి చెందుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. 

ఆంధ్రా జాలర్లను అరికట్టడంలో విఫలం 

ప్రతి సవత్సరం ఆంధ్రా ప్రాంత జాలర్లు తెలంగాణ రాష్ట్రంలోని కృష్ణానది తీర ప్రాంతాల్లో నివాసాలు ఏర్పరుచుకొని నిషేధిత వలలతో బహిరంగంగా  మత్స్య సంపదను కొల్లగొడుతున్నారని స్థానిక మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. సంబంధిత మత్స్యశాఖ, రెవ్వెన్యూ, పోలీస్‌ అధికారులు ముడుపులకు ఆశపడి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆశయాలకు గండి కొడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు అమాయక జాలర్ల ప్రాణాలతో చెలగాటమాడుతున్న దళారులను అరికట్టాలని కోరుతున్నారు.


logo