గురువారం 28 మే 2020
Nagarkurnool - Jan 29, 2020 , 02:11:25

ప్రతిపక్షాల మ్యాచ్‌ఫిక్సింగ్‌

ప్రతిపక్షాల మ్యాచ్‌ఫిక్సింగ్‌

కొల్లాపూర్‌, నమస్తే తెలంగాణ: కొల్లాపూర్‌ మున్సిపాలిటీలో ఉన్న 20వార్డులకుగాను 14మంది ఇండిపెండెంట్లతో కలుపుకొని మొత్తం 97మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్న విషయం విదితమే. అయితే ఈ ఎన్నికల్లో జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌,   ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీ నాయకులు కుమ్మక్కై అధికార టీఆర్‌ఎస్‌ను దెబ్బతీసేందు కోసం లక్ష్యంగా పావులు కదిపారు. ప్రచారంలో కూడా ఎక్కడా బయటపడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈనెల 22న పోలింగ్‌ ఉండగా అంతకు రెండు రోజులు ముందుగా ఈ మూడు పార్టీల నాయకులు కుమ్మక్కై ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను ఎలాగైనా దెబ్బతీయాలని కుట్ర పన్నారన్నారు. అందులో భాగంగానే ఆయా వార్డుల్లో బరిలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల అభ్యర్థులకు వార్డుల వారీగా ఒక్కొక్కరికి పోలైన ఓట్లు 50లోపే ఉండడంతో ప్రజల్లో నవ్వులపాలయ్యారు. ఇందుకు కారణాలను లోతుగా విశ్లేషించి చూస్తే..ఆ రెండు జాతీయ పార్టీల అభ్యర్థులకు పడే ఓట్లను ఏఐఫ్‌బీపీ అభ్యర్థులకు పడే విధంగా లోపాయికారిగా కుదుర్చుకున్న ఒప్పందమేనని పలువురు అంటున్నారు. 


కొల్లాపూర్‌ మున్సిపాలిటీలో ఉన్న మొత్తం 19,488 ఓట్లు ఉండగా ఈనెల 22న జరిగిన పోలింగ్‌లో 15,858 ఓట్లు పోలయ్యాయి. 20వార్డుల్లో బరిలో ఉన్న 20మంది టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు కలిపి మొత్తం 7,107 ఓట్లు పోలుకాగా, ఏఐఎఫ్‌బీపీ 20మంది అభ్యర్థులకు కలిపి పోలైన ఓట్లు మొత్తం 7,328. అయితే జాతీయ పార్టీలుగా గాంభీర్యంగా చెప్పుకుంటున్న కాంగ్రెస్‌ 19వార్డుల్లో బరిలో ఉన్న అభ్యర్థులకు మొత్తం 303 ఓట్లు, బీజేపీ అభ్యర్థులు 20వార్డుల్లో బరిలో నిలిస్తే వారికి పోలైనవి 354 ఓట్లే. అయితే టీఆర్‌ఎస్‌కు పోలైన ఓట్ల కంటే ఏఐఎఫ్‌బీపీకి వచ్చిన మెజార్టీ ఓట్లు 221. మిగిలిన 762 ఓట్లలో ఒకొక్క స్థానానికి పోటీలో ఉన్న సీపీఐ,సీపీఎం,టీడీపీ అభ్యర్థులతో పాటు 14మంది ఇండిపెండెంట్‌ అభ్యర్థులకు ఒక్కొక్క వార్డుల్లో వారికి పడిన ఓట్లు 20నుంచి 30 ఓట్ల లోపే. ఇందులో చెల్లని ఓట్లు కూడా ఉన్నాయి. వామపక్ష అభ్యర్థులకు ఓ స్థానంలో 7 ఓట్లు, మరోస్థానంలో 25ఓట్లకే పరిమితమయ్యారు. 15వార్డులో కాంగ్రెస్‌ పోటీచేయకుండగా అక్కడ ఏఐఎఫ్‌బీపీ అభ్యర్థికి ప్రత్యక్షంగా ప్రచారం చేయడం జరిగింది. అయినా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఒంటరి పోరాటంలో అంతిమంగా 138 ఓట్లతో గెలిచాడు. 10వార్డులో కాంగ్రెస్‌ నుంచి పోటీచేసిన మాజీ జెడ్పీటీసీ రాణిగాలియాదవ్‌కు కేవలం 27 ఓట్లు, బీజేపీ అభ్యర్థి కుమ్మరి శ్రీరాంకు 7ఓట్లు పడ్డాయి. అంటే ఈ రెండు జాతీయ పార్టీలకు పడవల్సిన ఓట్లను ఏఐఎఫ్‌బీపీ అభ్యర్థులకు క్రాస్‌ ఓటింగ్‌ చేయించుకున్నారని విశ్లేషకులు అంటున్నారు. టీఆర్‌ఎస్‌ రెబల్‌ నాయకుడు తన రాజకీయ చతురతను ప్రదర్శించి ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి ప్రతిష్టతో పాటు ఉనికిని దెబ్బతీయాలని కుట్రలు, కుతంత్రాలు పన్నినప్పటికీ అంతిమ విజయం కారుకే దక్కింది. అయితే ప్రత్యర్థి పార్టీల వారు మాత్రం బేజారయ్యారనే విమర్శలను ఎదుర్కొంటున్నారు. 


 ఎమ్మెల్యే హర్షవర్ధన్‌ రెడ్డిని రాజకీయంగా దెబ్బతీయాలని ఆ పెద్దమనిషి వేసిన ముగ్గులో ఆరెండు జాతీయ పార్టీల నాయకులు పడిపోయి తమ పార్టీలకు ఉనికి లేకుండా చేసుకున్నారని పలువురు అంటున్నారు. గెలుపోటములు సహజం. కాని ఈ మున్సిపల్‌ ఎన్నికలు మాత్రం ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డికి జీవన్మరణ సమస్యగా రాజకీయాన్ని ప్రత్యర్థులు మార్చేశారనడంలో సందేహం లేదని చెప్పవచ్చు. ఈ ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీలు డబ్బు, మద్యం ఎరచూపి ఓటర్లను (మిగతా పార్టీలతో కుమ్మక్కై) తమ అభ్యర్థులకు అనుకూలంగా మార్చేసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే ఎమ్మెల్యే బీరం మాత్రం సీఎం కేసీఆర్‌ చేపట్టిన ప్రజాసంక్షేమ పథకాలే ప్రచారాస్ర్తాలుగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు ఓట్లేయమని అభ్యర్థించారు. ఏది ఏమైనప్పటికీ రాజకీయ ప్రత్యర్థులు ఎన్ని ఎత్తులు,జిత్తులు చేసినప్పటికీ తీరా పరువు పాయే..ప్రతిష్ట పాయే అన్నచందంగా కొల్లాపూర్‌ మున్సిపల్‌లో రాజకీయాలు చోటుచేసుకున్నాయన్నది నగ్నసత్యం.


logo