సోమవారం 01 జూన్ 2020
Nagarkurnool - Jan 29, 2020 , 02:07:01

అల.. మాయల వల

అల.. మాయల వల

పెంట్లవెల్లి: తెలంగాణ ప్రభుత్వం ఓవైపు మత్స్యకారుల జీవనోపాధి, ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తుండగా.. మరోవైపు సీమాంధ్ర జాలర్లు స్థానికుల బతుకుదెరువుపై గండి కొడుతున్నారు. కృష్ణానదితీర గ్రామాలైన జటప్రోల్‌, మంచాలకట్ట, వేంకల్‌, మల్లేశ్వరం, సోమశిల, అమరగిరి గ్రామాలతోపాటు, చీమలతిప్ప, కోతిగుండు గ్రామాల నదీఒడ్డున పాగవేశారు. రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమానికి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నది.  నదీతీరాలతోపాటు, చెరువులు, కుంటల్లో, చేపపిల్లలను వదిలే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అయితే కృష్ణానదితీర ప్రాంతాల్లో మాత్రం సీమాంధ్ర దళారులు స్థానిక మత్స్యకారుల బతుకుదెరువుపై నీళ్లు చల్లుతున్నారు. ఆంధ్రా ప్రాంతానికి చెందిన తుని, కొవ్వూరు, రాజమండ్రి, పూడిమర్క, గాజువాక, విజయవాడ  తదితర ప్రాంతాల నుంచి రప్పించిన మత్స్యకారులకు అన్ని వసతులు కల్పించడమేకాక, వారిని ప్రోత్సహించి వారితో కుమ్మక్కై నిషేధిత అలివి వలల ద్వారా చేపపిల్లలను వేటాడుతున్నారు. కృష్ణానదితీర ప్రాంతాల ఒడ్డున గూఢారాలను ఏర్పాటు చేసుకొని తమ కార్యకలపాలు సాగిస్తున్నారు. స్థానిక మత్స్యకారులు అభ్యంతరం వక్తం చేసినా.. భయపడకుండా తమ పని కానిస్తున్నారు. ఈ విషయంపై మత్స్యశాఖాధికారులకు ఫిర్యాదు చేసినా చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు కారణం దళారుల నుంచి కిందిస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు సంబంధిత శాఖఅధికారులకు భారీగా ముడుపులు అందుతుండటమే కారణమని స్థానిక మత్స్యకారులు ఆరోపిస్తున్నారు.  పేరుకు మాత్రమే అడపాదడపా తనిఖీలు చేస్తున్నారని, ఈ తనిఖీలు ప్రజలను నమ్మించేందుకు ప్రయత్నమేనని స్థానిక మత్స్యకారులు అంటున్నారు.  పైఅధికారులు ఎవరైనా తనిఖీ చేయడానికి వస్తున్నట్లుగా తెలిస్తే వెంటనే స్థానిక అధికారులు దళారులకు ఫోన్‌ ద్వారా సమాచారం అందించి సీమాంధ్ర జాలర్లను, నిషేధిత వలలను రహస్య ప్రాంతాలకు తరలించేందుకు సహకరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.

ఏటా లక్షల రూపాయల్లో వేలం

కృషానది తీరంలోని గ్రామాల్లో దళారులు తమ హద్దుబందులోని స్థలానికి (పట్టుకు) ఏటా చేపలవేటకు లక్షల రూపాయల్లో వేలం వేస్తున్నారు. స్థానికులు ఆంధ్ర ప్రాంత దళారులతో చేతులు కలిపి నిషేధిత వలలను వినియోగించి తెలంగాణ సంపదను కొల్లగొడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత మత్స్యశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానిక మత్స్యకారులు కోరుతున్నారు. 


logo