ఆదివారం 31 మే 2020
Nagarkurnool - Jan 28, 2020 , 03:59:12

వైస్‌ చైర్మన్‌ పదవీ ఇవ్వకుండా మోసం చేశారని ఆందోళన

వైస్‌ చైర్మన్‌ పదవీ ఇవ్వకుండా మోసం చేశారని ఆందోళన

నారాయణపేట ప్రతినిధి, నమస్తే తెలంగాణ : మున్సిపల్‌ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్‌, ఇండిపెండెంట్‌ కౌన్సిలర్లకు వైస్‌ చైర్మన్‌ పదవులు ఇస్తామని చెప్పి మోసం చేశారంటూ కాంగ్రెస్‌, ఇండిపెండెంట్‌ కౌన్సిలర్లు ఇద్దరు బీజేపీ నాయకులతో వాగ్వివాదానికి దిగారు. చైర్మన్‌ పదవిని తాము తీసుకొని, వైస్‌ చైర్మన్‌ పదవిని మీకు ఇస్తామని బీజేపీ నాయకులు కాంగ్రెస్‌, ఒక ఇండిపెండెంట్‌ అభ్యర్థుకు ఒకరికి తెలియకుండా మరొకరికి హామీ ఇచ్చారు. టీఆర్‌ఎస్‌ వైపు వారు వెళ్లకుండా బీజేపీ నేతలు మాయమాటలతో ఒప్పించారు. ఈ మేరకు బీజేపీ కౌన్సిలర్లతో పాటు క్యాంపునకు  కాంగ్రెస్‌, ఇండిపెండెంట్‌ కౌన్సిలర్లు తరలి వెళ్లారు. సోమవారం నేరుగా ఎంపిక సమయానికి మున్సిపల్‌ కార్యాలయానికి చేరుకున్నారు. చైర్మన్‌ పదవికి జరిగిన ఎన్నికలో బీజేపీ కౌన్సిలర్లతో పాటు కాంగ్రెస్‌, ఇండిపెండెంట్‌ అభ్యర్థులుగా మద్దతిచ్చారు. వైస్‌ చైర్మన్‌ ఎంపికలో కాంగ్రెస్‌, ఇండిపెండెంట్‌ అభ్యర్థుల పేరు కాకుండా బీజేపీకి చెందిన మరో అభ్యర్థి పేరు ప్రకటించారు. దీంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయన కాంగ్రెస్‌, స్వతంత్ర కౌన్సిల్‌ సభ్యులు వెంటనే తేరుకొని అభ్యంతరం వ్యక్తం చేశారు ఆపై గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. వైస్‌ చైర్మన్‌ ఎంపిక ప్రక్రియను ఆపివేయాలని డిమండ్‌ చేశారు. సభ్యుల కోరం ఉండటంతో అధికారులు ఎన్నిక ప్రక్రియను కొనసాగించారు. వైస్‌ చైర్మన్‌ ఎంపికకు అవసరమైన మ్యాజిక్‌ ఫిగర్‌  ఉండటంతో ఆ పదవి సైతం బీజేపీ పరం అయ్యింది. తమను బీజేపీ నేతలు మోసం చేశారని కాంగ్రెస్‌, స్వతంత్ర అభ్యర్థి బయటకు రావడంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు వారి అనుచరులు అందరూ కలిసి బీజేపీ ముఖ్య్యనేతలపై విరుచుకుపడ్డారు. ఒక నాయకుడిని గల్లా పట్టీ నిలదీశారు. మరో నాయకుడి ఇంటిని ముట్టడించారు. అనంతరం ఆందోళనకారులు నేరుగా రోడ్డపైకి చేరుకొని బీజేపీ నేతల మోసాన్ని ఎండగడుతూ నినాదాలు చేశారు. ఈ సమయంలో మక్తల్‌లోనే ఉన్న ఎమ్మెల్సీ రామ చందర్‌ రావు, రాష్ట్ర నాయకురాలు, మాజీ మంత్రి డీకే అరుణ ఈ విషయాన్ని మీడియా ప్రతినిధులు అడుగగా నో కామెంట్‌ అంటూ దాటవేసి వెళ్లిపోయారు.logo