శనివారం 06 జూన్ 2020
Nagarkurnool - Jan 28, 2020 , 03:58:12

ప్రతిపక్షాల బేజారు

ప్రతిపక్షాల బేజారు

మహబూబ్‌నగర్‌ ప్రధాన ప్రతినిధి నమస్తే తెలంగాణ : పుర పోరులో కారు జోరు ముందు ప్రతిపక్షాలు కకావికలయ్యాయి. హంగ్‌ స్థానాల్లో తిమ్మినిబొమ్మి చేసి గెలవాలని విపక్షాలు చేసిన కుట్రలు విఫలమయ్యాయి. ఉమ్మడి జిల్లాలోని 17 మున్సిపాలిటీలకు గాను 15 మున్సిపాలిటీలు టీఆర్‌ఎస్‌ పార్టీ కైవసం చేసుకుంది. కేవలం రెండు స్థానాలు మాత్రమే కాంగ్రెస్‌, బీజేపీ పరమయ్యాయి. అధికార పార్టీపై, సీఎం కేసీఆర్‌, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌పై విమర్శలు చేస్తే గెలుస్తామనే భ్రమలో ఉన్న ప్రతిపక్షాలకు ప్రజలు కీలెరిగి వాత పెట్టారు. రాష్ర్టాన్ని అభివృద్ధి పథాన తీసుకుపోతున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై విమర్శలతో దాడి చేయాలనుకున్న ప్రతిపక్షాలు బొక్క బోర్లా పడ్డాయి. ఎన్నికల్లో అత్యధిక వార్డులను కైవసం చేసుకున్న టీఆర్‌ఎస్‌ పార్టీని కాదని కాంగ్రెస్‌, బీజేపీ జత కట్టి చైర్మన్‌ గిరిని తన్నుకుపోదామని చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. హంగ్‌ వస్తుందని ఊహించిన అమరచింత, భూత్‌పూర్‌, కోస్గిల్లో ప్రతిపక్షాల పప్పులుడకలేదు. మక్తల్‌, వడ్డేపల్లిలో అవకాశం లేనందుకు టీఆర్‌ఎస్‌ పార్టీ కనీసం ప్రయత్నాలు కూడా చేయలేదు. మక్తల్‌లో బీజేపీ మిత్రధర్మం చేసిందంటూ కాంగ్రెస్‌, ఇండిపెండెంట్‌ అభ్యర్థులు గొడవకు దిగడం కొసమెరుపు. కోస్గిలో కాంగ్రెస్‌, భూత్‌పూర్‌లో బీజేపీ చివరి వరకు ప్రయత్నం చేసి తమ వల్ల కాదని పెట్టెబేడా సర్దుకున్నాయి. ఇక మహబూబ్‌ నగర్‌లో టీఆర్‌ఎస్‌ వారు ఎంఐఎంకు చైర్మన్‌ గిరి ఇస్తారని బీజేపీ లక్ష్మణ్‌ చేసింది దుష్ప్రచారం మాత్రమేనని తేలిపోయింది. మహబూబ్‌ నగర్‌లో చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ స్థానాలు రెండూ టీఆర్‌ఎస్‌కే దక్కాయి. ఇక కోస్గిలో హల్‌చల్‌ చేద్దామని కాంగ్రెస్‌ నేతలు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. అమరచింతలో కమ్యూనిస్టులు కలిసిరావడంతో ఏకగ్రీవంగా చైర్‌ పర్సన్‌ గిరి  టీఆర్‌ఎస్‌ పార్టీకే దక్కింది. కొల్లాపూర్‌లో సింహాల కథ ముగిసింది. ఎక్స్‌అఫీషియో సభ్యుల సహకారంతో సులభంగా చైర్‌ పర్సన్‌, వైస్‌ చైర్మన్‌ రెండూ టీఆర్‌ఎస్‌ ఖాతాలో జమ అయ్యాయి. ఇక ఉమ్మడి జిల్లాలోని అన్ని జిల్లా కేంద్రాల్లోని మున్సిపాలిటీలన్నీ అధికార పార్టీనే కైవసం చేసుకుని సత్తా చాటింది. ప్రతిపక్షాలు కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే వస్తాయని వాటిని ఆదరించేందుకు జనం సిద్ధంగా లేరని ఈ ఎన్నికలతో మరోసారి నిరూపణ అయ్యింది.

15 స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యం..

ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లాలో టీఆర్‌ఎస్‌ పార్టీ తన ఆధిక్యాన్ని మరోసారి నిరూపించుకుంది. మొత్తం 17 మున్సిపాలిటీలకు గాను 15 స్థానాలను టీఆర్‌ఎస్‌ పార్టీ కైవసం చేసుకుంది. మహబూబ్‌ నగర్‌, వనపర్తి, నాగర్‌ కర్నూలు జిల్లాల పరిధిలోని మున్సిపాలిటీలను క్లీన్‌ స్వీప్‌ చేసిన కారు... జోగులాంబ గద్వాల పరిధిలో 4 స్థానాలకు గాను 3, నారాయణపేట జిల్లాలో 3 స్థానాలకు గాను 2 చోట్ల టీఆర్‌ఎస్‌ విజయం సాధించింది. జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లిలో కాంగ్రెస్‌, నారాయణపేట జిల్లా మక్తల్‌లో బీజేపీ గెలిచాయి. ప్రతిపక్షాలు ఎన్నో విమర్శలు, ఆరోపణలు చేసినా, కాంగ్రెస్‌, బీజేపీ అనైతిక పొత్తు కట్టినా అధికార పార్టీ ముందు నిలవలేకపోయాయి. పలు చోట్ల టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను కాదని ప్రతిపక్షాలన్నీ ఏకం అయ్యి మున్సిపాలిటీలను ఎగురేసుకుపోవాలని చేసిన ప్రయత్నాలు అధికార పార్టీ ముందు సఫలం కాలేదు. ఉమ్మడి జిల్లాలోని అన్ని జిల్లా కేంద్రాల్లోని మున్సిపాలిటీలు అధికార పార్టీ కైవసం చేసుకుంది. మహబూబ్‌ నగర్‌, గద్వాల, నారాయణపేట, నాగర్‌ కర్నూలు, వనపర్తితో పాటు కీలకమైన మున్సిపాలిటీలైన కల్వకుర్తి, కొల్లాపూర్‌, కొత్తకోట, భూత్‌పూర్‌, అయిజ, కోస్గిలో టీఆర్‌ఎస్‌ ఘన విజయం సాధించింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ చేస్తున్న అభివృద్ధికి ఈ ఫలితాల ద్వారా జనం మద్దతు ప్రకటించినట్లు  స్పష్టంగా చెప్పవచ్చు. జిల్లా మంత్రులు నిరంజన్‌ రెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్‌ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకుంటూ విజయవంతంగా ఎన్నికలను ముగించారు. 


భూత్‌పూర్‌ టీఆర్‌ఎస్‌దే 

మహబూబ్‌ నగర్‌ జిల్లా భూత్‌పూర్‌ ఫలితంపై ఉత్కంఠ నెలకొన్న పరిస్థితులు కనిపించాయి. ఇక్కడ టీఆర్‌ఎస్‌, బీజేపీకి చెరో 4 స్థానాలు, కాంగ్రెస్‌కు 2 స్థానాలు వచ్చాయి. అయితే కాంగ్రెస్‌, బీజేపీ జతకట్టి మున్సిపాలిటీ ఎగురవేసుకుపోయేందుకు ప్రయత్నించాయి. కానీ వారి మధ్య పొత్తుల బేరం కుదరలేదు. కాంగ్రెస్‌ పార్టీ చైర్మన్‌ గిరి ఆశించింది. ఈ పరిణామాల నేపథ్యంలో బీజేపీ చైర్మన్‌ అభ్యర్థి కెంద్యాల శ్రీనివాస్‌ మరో బీజేపీ కౌన్సిలర్‌తో కలిసి టీఆర్‌ఎస్‌లో చేరారు. అప్పటికే 4గురు కౌన్సిలర్లు, ఎమ్మెల్యే ఓటుతో ఆధిక్యంతో ఉన్న టీఆర్‌ఎస్‌ పార్టీకి బీజేపీ మద్దతుతో 6 గురు కౌన్సిలర్లు, ఎమ్మెల్యే ఎక్స్‌అఫీషియో ఓటు వచ్చింది. చివరికి బస్వరాజ్‌ గౌడ్‌ చైర్మన్‌గా, కెంద్యాల శ్రీనివాస్‌ వైస్‌ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. ఇక కోస్గిలో పరిస్థితి తమకు అనుకూలంగా లేకపోయినా చక్రం తిప్పాలని ప్రయత్నించి కాంగ్రెస్‌ పార్టీ భంగపడింది. 


కోస్గిలో రేవంత్‌కు భంగపాటు...

కోస్గిలోమొత్తం 16 స్థానాలకు గాను టీఆర్‌ఎస్‌7, కాంగ్రెస్‌కు 7, టీఆర్‌ఎస్‌ రెబెల్స్‌కు 2 సీట్లు వచ్చాయి. అయితే తమకు బలం లేకపోయినా ఎలాగైనా విజయం సాధించాలని కాంగ్రెస్‌ నేతలు చేసిన ప్రయత్నం విఫలమైంది. కోస్గిలో ఏకగ్రీవంగా గెలిచిన టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థిని తమ వైపు లాక్కుని మున్సిపాలిటీ చేజిక్కించుకునాలని కాంగ్రెస్‌ యత్నించింది. అయితే టీఆర్‌ఎస్‌ పార్టీలో ఉన్న 6గురు కౌన్సిలర్లకు అదనంగా ఇండిపెండెంట్‌ కౌన్సిలర్‌తో పాటు ఎంపీ మన్నె శ్రీనివాస్‌ రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి, ఎమ్మెల్యే నరేందర్‌ రెడ్డి ఎక్స్‌ అఫీషియో ఓట్లతో సులభంగా కోస్గిని టీఆర్‌ఎస్‌ చేజిక్కించుకుంది. ప్రతిపక్ష కాంగ్రెస్‌ సభ్యులు ప్రమాణ స్వీకారం తర్వాత సభ నుంచి బయటకు వెళ్లిపోవడంతో చైర్‌ పర్సన్‌, వైస్‌ చైర్‌పర్సన్‌ స్థానాలు ఏకగ్రీవంగా టీఆర్‌ఎస్‌ వశమయ్యాయి. కొడంగల్‌ మాజీ ఎమ్మెల్యే అయిన ఎంపీ రేవంత్‌ రెడ్డి ఎన్ని కుయుక్తులు పన్నినా అటు కొడంగల్‌(వికారాబాద్‌ జిల్లా)తో పాటు ఇటు కోస్గి మున్సిపాలిటీ కూడా టీఆర్‌ఎస్‌ వశమయ్యాయి. స్థానికంగా రేవంత్‌ రెడ్డిపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకు ఈ ఎన్నికలు అద్దం పట్టాయి. ఈ ఫలితాలతో అభివృద్ధి నిరోధకుడు రేవంత్‌ రెడ్డిని కొడంగల్‌ నుంచి శాశ్వతంగా తరిమికొట్టినట్లు అయ్యిందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. 


అయిజ, కొల్లాపూర్‌లో కారుదే జోరు...

జోగులాంబ గద్వాల జిల్లా అయిజలో ఫార్వర్డ్‌ బ్లాక్‌ (టీఆర్‌ఎస్‌ రెబల్స్‌) నుంచి గెలుపొందిన 10 మంది సభ్యులు టీఆర్‌ఎస్‌ పార్టీకి మద్దతునిచ్చారు. ఇక్కడ చైర్మన్‌ టీఆర్‌ఎస్‌ నుంచి వైస్‌ చైర్మన్‌ రెబల్‌ అభ్యర్థికి లభించాయి. కొల్లాపూర్‌లో 20 స్థానాలకు గాను 11 గెలిచి ఫార్వర్డ్‌ బ్లాక్‌ అభ్యర్థులు చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ స్థానాలను చేజిక్కించుకునాలని చేసిన ప్రయత్నం విఫలమైంది. ఫార్వర్డ్‌ బ్లాక్‌ సహకారం లేకుండానే టీఆర్‌ఎస్‌ పార్టీ ఎక్స్‌అఫీషియో సభ్యులు ఎంపీ రాములు, ఎమ్మెల్సీ కె.దామోదర్‌ రెడ్డి, ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌ రెడ్డి సహకారంతో కొల్లాపూర్‌ను కైవసం చేసుకుంది. అమరచింతలో 10 స్థానాలకు గాను టీఆర్‌ఎస్‌కు మెజార్టీ స్థానాలు (3) లభించాయి. సీపీఎం (2), ఓ టీఆర్‌ఎస్‌ రెబల్‌ అభ్యర్థితో మెజార్టీ లభించింది. ఎక్స్‌ అఫీషియో ఓటు ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌ రెడ్డి ఇక్కడే నమోదు చేయించుకున్నారు. ఎన్నికలకు చిట్టెం హాజరయ్యారు. ఏకగ్రీవంగా చైర్మన్‌ స్థానం టీఆర్‌ఎస్‌కు వచ్చింది. కల్వకుర్తిలో చైర్మన్‌ ఎన్నికలకు ప్రతిపక్ష కాంగ్రెస్‌, బీజేపీ గైర్హాజరయ్యాయి. కల్వకుర్తిలో మొత్తం 22 స్థానాలకు గాను టీఆర్‌ఎస్‌ 10, ఇండిపెండెంట్లు 4గురు, ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌ ఎక్స్‌ అఫిషియో ఓటుతో బలం 15కు చేరుకుంది. ఎన్నిక ఏకగ్రీవంగా ముగిసింది. నారాయణపేటలో 24 స్థానాలకు గాను 10 స్థానాలు సాధించిన టీఆర్‌ఎస్‌ తన రెబెల్‌ అభ్యర్థులు ఇద్దరితో ఎమ్మెల్యే రాజేందర్‌ రెడ్డి ఎక్స్‌ అఫీషియో ఓటుతో సులభంగా ఆధిక్యం సాధించింది. దాంతో పాటు ఎంఐఎం1, కాంగ్రెస్‌ 2 కూడా టీఆర్‌ఎస్‌కు మద్దతు తెలిపాయి. దీంతో ఏకగ్రీవంగా చైర్‌ పర్సన్‌, వైస్‌ పదవులు టీఆర్‌ఎస్‌ ఖాతాలోకి వచ్చాయి. మక్తల్‌లో 16 స్థానాలకు గాను 8 స్థానాలు సాధించిన బీజేపీ తనకు బలం లేకపోయినా ఎక్స్‌ అఫీషియో ఓటుతో మున్సిపాలిటీ కైవసం చేసుకునేందుకు కుట్రలు పన్నింది. టీఆర్‌ఎస్‌ పార్టీ తనకున్న 5 స్థానాలతో పాటు కాంగ్రెస్‌, ఇండిపెండెంట్‌, ఎక్స్‌ అఫీషియో సభ్యుల బలంతో ఎక్కడ పదవులు పొందుతుందో అని భయపడి కాంగ్రెస్‌, ఇండిపెండెంట్‌ అభ్యర్థులకు వైస్‌ చైర్మన్‌ ఇస్తామని బేరం పెట్టుకుంది. చివరకు మోసం చేసి వైస్‌ పదవి కూడా బీజేపీనే దక్కించుకుంది. మోసపోయామని తెలుసుకున్న కాంగ్రెస్‌, ఇండిపెండెంట్‌ అభ్యర్థులు తమ అనుచరులతో కలిసి బీజేపీ నేతలతో గొడవకు దిగారు. కొద్ది సేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ మోసపు విధానాలకు ఇదే నిదర్శనంగా స్థానికులు చెబుతున్నారు. 


logo