శనివారం 30 మే 2020
Nagarkurnool - Jan 28, 2020 , 03:56:53

నాగర్‌కర్నూల్‌ మున్సిపల్‌ పీఠం టీఆర్‌ఎస్‌ కైవసం

నాగర్‌కర్నూల్‌ మున్సిపల్‌ పీఠం టీఆర్‌ఎస్‌ కైవసం

నాగర్‌కర్నూల్‌ టౌన్‌ : నాగర్‌కర్నూల్‌ మున్సిపల్‌ పీఠాన్ని టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. చైర్మన్‌గా స్థానిక టీఆర్‌ఎస్‌ పార్టీ తరుపున 17వ వార్డు నుంచి గెలుపొందిన కల్పనభాస్కర్‌గౌడ్‌ను నియమించగా, వైస్‌ చైర్మన్‌గా 23వ కౌన్సిలర్‌ భాస్కర్‌రావు అలియాస్‌ బాబురావును ఎన్నుకున్నారు. మున్సిపల్‌లోని 24 వార్డులకు ఎన్నికలు నిర్వహించగా 14 వార్డుల్లో టీఆర్‌ఎస్‌, 9 వార్డుల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులు గెలుపొందగా, ఒక వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. ఫలితాల విడుతల తర్వాత స్వతంత్య్ర అభ్యర్థి సైతం టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరడంతో టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్ల కోరం 15కు చేరుకుంది. దీంతో మున్సిపల్‌ చైర్మన్‌ పీఠంపై గులాబీ అభ్యర్థి దక్కడం సులువైంది. సోమవారం మున్సిపల్‌ కార్యాలయంలో ఎన్నిక ప్రక్రియను కలెక్టర్‌ శ్రీధర్‌, శాసన సభ్యులు మర్రి జనార్దన్‌రెడ్డిల సమక్షంలో నిర్వహించారు. గెలుపొందిన అందరూ కౌన్సిలర్లతో  కమిషనర్‌ ప్రమాణం చేయించారు. ఆ తర్వాత నిర్ణయించిన సమయానికి 12.30 గంటలకు చైర్మన్‌, వైస్‌ చైర్మన్లను ఎన్నుకున్నారు. కాంగ్రెస్‌ నుంచి కోరం లేకపోవడంతో టీఆర్‌ఎస్‌ పార్టీ తరుపున 17వ వార్డు అభ్యర్థి కల్పనాగౌడ్‌  చైర్మన్‌ అభ్యర్థిగా 15వ వార్డు కౌన్సిలర్‌ ఇస్త్యాఖ్‌ అహ్మద్‌ఖాన్‌ ప్రతిపాదించగా,13వ వార్డు కౌన్సిలర్‌ కొత్త శ్రీనివాసులు బలపరిచారు. దీంతో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా కల్పనాగౌడ్‌ను ఏకగ్రీవంగా కలెక్టర్‌ ప్రకటించారు.అదేవిధంగా వైస్‌ చైర్మన్‌గా 23వ వార్డు కౌన్సిలర్‌ భా స్కర్‌రావు అలియాస్‌ బాబురావు పే రును టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన 16వ వా ర్డు కౌన్సిలర్‌ ఆలూరి విజయమ్మ ప్రతిపాదించగా, 19వ వార్డు సభ్యుడు బత్తుల బచ్చన్న బలపరిచారు. దీంతో వైస్‌ చైర్మన్‌గా  భాస్కర్‌రావు ఎంపికైనట్లు కలెక్టర్‌ ప్రకటించారు. చైర్‌పర్సన్‌ కల్పనాగౌడ్‌, వైస్‌చైర్మన్‌ భాస్కర్‌రావులకు కలెక్టర్‌ నియామకపత్రాలు అందజేశారు. 

కొత్త పురపాలక మండలిచే పాలన

ఇక నుంచి మున్సిపల్‌లో కొత్త పాలక మండలి పాలన కొనసాగనుంది. గత సంవత్సరం జూలై 3వ తేదీన మున్సిపల్‌ పాలక మండలి గడువు ముగిసిన వి షయం తెలిసిందే.  అప్పటి నుంచి నాగర్‌కర్నూల్‌ మున్సిపల్‌లో ప్రత్యేక అధికారిగా కలెక్టర్‌ ఆధ్వర్యంలో పాలన కొనసాగింది. నూతన పాలక మండలి ప్రమాణస్వీకారం చేయడంతో ప్రత్యేకాధికారి పా లనకు తెరపడింది. దాదాపు ఆరు నెలల కాలం పాటు ప్రత్యేకాధికారి పాలనలో మున్సిపల్‌ పాలన కొనసాగింది. కొత్త పాలక మండలి ప్రమాణం స్వీకారం చేయడంతో ఇక నుంచి పురపాలన కొత్త మండలి ఆధ్వర్యంలో కొనసాగనుంది. 

 చైర్‌పర్సన్‌కు  అభినందనలు

నాగర్‌కర్నూల్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన కల్పనాగౌడ్‌, వైస్‌చైర్మన్‌ భాస్కర్‌రావు అలియాస్‌ బాబురావులను ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్‌ పెద్దపల్లి పద్మావతి, కలెక్టర్‌ శ్రీధర్‌, కమిషనర్‌ జయంత్‌కుమార్‌రెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు సన్మానించారు. అనంతరం ము న్సిపల్‌ కార్యాలయం నుంచి ఎమ్మెల్యే మర్రి కౌన్సిలర్లతో కలిసి ర్యాలీగా తన క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు.  చైర్‌పర్సన్‌ , వైస్‌ చైర్మన్‌లకు  పూలమాలలు, బొకేలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. 


logo