బుధవారం 03 జూన్ 2020
Nagarkurnool - Jan 28, 2020 , 03:56:14

కొల్లాపూర్‌ అభివృద్ధికి కృషిచేస్తా

కొల్లాపూర్‌ అభివృద్ధికి కృషిచేస్తా

కొల్లాపూర్‌, నమస్తే తెలంగాణ: రానున్న రోజుల్లో కొల్లాపూర్‌ మున్సిపాలిటీని అన్ని రంగాల్లో నూతన పాలకవర్గం అభివృద్ధికి కృషి చేయాలని, అందుకు తాను సహకరిస్తానని నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ సభ్యుడు పోతుగంటి రాములు అన్నారు. పార్టీ పక్షాన ప్రభుత్వం ఆదేశాల మేరకు తాను ఎమ్మెల్సీ, శాసనమండలి విప్‌ కూచకుళ్ల దామోదర్‌రెడ్డి, ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డిలతో ఎక్స్‌ అఫీషియో సభ్యులుగా  వచ్చి తమ ఓటును వినియోగించుకొని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్‌పర్సన్‌ ఎన్నిక చేసినట్లు వివరించారు. ఈ సందర్భంగా స్థానిక గ్రంథాలయం-యోగా భవన్‌లో ఎమ్మెల్యే బీరం, ఎమ్మెల్సీ శాసన మండలి విప్‌ కూచకుళ్లతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. భారత రాజ్యంగం ప్రకారంగా సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు తమ ఓటును కొల్లాపూర్‌లో వినియోగించుకోవాలని సూచించడంతో చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్‌పర్సన్‌ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగిందన్నారు. ఈ పరిణామాలు కొల్లాపూర్‌లో చోటు చేసుకుంటాయని అనుకోలేదన్నారు. తాము సభ్యులుగా ప్రతి సమావేశానికి రావాల్సి ఉందని ఎంపీ రాములు వెల్లడించారు. ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ ఎన్ని ఎత్తులు జిత్తులు చేసినా ఎట్టకేలకు కొల్లాపూర్‌ మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్‌పర్సన్‌ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగిందన్నారు. కొల్లాపూర్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో జాతీయపార్టీలకు సింగిల్‌ డిజిట్‌ ఓట్లు కూడా దక్కలేదని విమర్శించారు. తాము స్వల్ప ఓట్ల తేడాతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఓటమి చెందినప్పటికీ ఇక్కడ ఎక్స్‌ అఫీషియో సభ్యులుగా ఓటు వినియోగించుకున్నట్లు ఆయన చెప్పారు. కొల్లాపూర్‌ అభివృద్ధి కోసం మున్సిపల్‌ ఎన్నికల్లో  ప్రజలకు ఇచ్చిన  హామీలను అమలుచేస్తామని ఎమ్మెల్యే బీరం ప్రకటించారు.


logo