సోమవారం 01 జూన్ 2020
Nagarkurnool - Jan 26, 2020 , 05:03:50

కందనూలులో కారుజోరు

కందనూలులో కారుజోరు
  • -పురాల్లో టీఆర్‌ఎస్‌ హవా
  • -33స్థానాల్లో గులాబీ ప్రభంజనం
  • -కమలం..ఒక్క స్థానంతోనే సరి
  • -16స్థానాల్లో గెలిచిన స్వతంత్రులు
  • -టీఆర్‌ఎస్‌కు భారీగా పోలైన ఓట్లు
  • -కాంగ్రెస్‌, బీజేపీల్లో నైరాశ్యం

మరోసారి కారు జోరు చూపించింది. మూడు మున్సిపాలిటీల్లోని 66స్థానాలకు జరిగిన ఎన్నికల ఎన్నికల ఫలితాల్లో 33వార్డులను కైవసం చేసుకున్నది. నాగర్‌కర్నూల్‌ మున్సిపాలిటీలో తొలిసారిగా కారు జెండా ఎగరనుండగా..రెండోసారి కల్వకుర్తిలో పుర పీఠం దక్కించుకోబోతోంది. కొల్లాపూర్‌లోనూ కారు 9స్థానాల్లో గెలుపొందింది. ఇదిలా ఉంటే కమలం కేవలం ఒక్క సీటుకే పరిమితం కాగా, కాంగ్రెస్‌ పార్టీ సైతం కుదేలైంది. ఎమ్మెల్యేల ప్రత్యక్ష పర్యవేక్షణలో టీఆర్‌ఎస్‌ విజయ దుందుభి మోగించగా ప్రతిపక్ష పార్టీలు అడ్రస్సు గల్లంతైంది. మూడు మున్సిపాలిటీల్లోను 58,221 ఓట్లు పోలవ్వగా టీఆర్‌ఎస్‌ అత్యధికంగా 25,930 ఓట్లను పొందడం విశేషం.
- నాగర్‌కర్నూల్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ

నాగర్‌కర్నూల్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని మూడు మున్సిపాల్టీల్లో టీఆర్‌ఎస్‌ ప్రభంజనం సృష్టించింది. మొత్తం 66వార్డు స్థానాలకు గాను 33స్థానాలను సాధించింది. నాగర్‌కర్నూల్‌లో 24స్థానాలకు గాను 14స్థానాల్లో విజయం సాధించి తొలిసారి మున్సిపల్‌ పీఠాన్ని స్పష్టమైన ఆధిక్యతతో కైవసం చేసుకొంది. ఇక కల్వకుర్తిలోనూ 22స్థానాలకు గాను 10స్థానాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గెలుపొందగా రెబెల్స్‌గా పోటీ చేసి గెలిచిన నలుగురు అభ్యర్థులు గులాబీ గూటిలోకి చేరుకొన్నారు. ఫలితంగా రెండోసారి కల్వకుర్తి పురాన్ని కారు దక్కించుకొంది. అదే విధంగా కొల్లాపూర్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు 9మంది గెలుపొందగా ఫార్వర్డ్‌బ్లాక్‌ తరపున పోటీ చేసిన మరో 11మంది గెలిచారు. ఇక్కడ ఆధిక్యంలో తేడా ఉన్నా టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర అధిష్టానం సూచనలతో కొల్లాపూర్‌లోనూ కారు రేసులోనే నిలిచింది. ఇలా మూడు మున్సిపాల్టీల్లోనూ టీఆర్‌ఎస్‌ పార్టీ మంచి ఆధిక్యాన్ని కనబర్చింది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు తోడు ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఎంఎల్‌సీలు, మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు సంయుక్తంగా చేపట్టిన ప్రచారం టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల గెలుపునకు దోహదం చేసింది. అదే కాంగ్రెస్‌ పార్టీ మాత్రం మరోసారి భంగపడింది. కేవలం 16స్థానాలకే పరిమితమైంది. కొల్లాపూర్‌లో ఖాతానే తెరవలేకపోయింది. ఇక బీజేపీ కల్వకుర్తి 12వ వార్డులో ఒక్క స్థానంలోనే గెలిచి బొక్క బోర్లా పడింది. నాగర్‌కర్నూల్‌, కొల్లాపూర్‌లో బోణీ లేకుండా పోయింది. అదే కొల్లాపూర్‌లో ఫార్వర్డ్‌బ్లాక్‌ నుంచి 11మంది, కల్వకుర్తిలో నలుగురు, నాగర్‌కర్నూల్‌లో ఒకరు, కొల్లాపూర్‌లో ఫార్వర్డ్‌ బ్లాక్‌ నుంచి 11చొప్పున ఇలా 16మంది స్వతంత్ర అభ్యర్థులుగా గెలుపొందడం గమనార్హం. కాంగ్రెస్‌, బీజేపీల కేవలం అభ్యర్థులను నిలబెట్టడానికి మాత్రమే పరిమితమయ్యావన్న ఆరోపణలకు ఈ ఫలితాలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. టీడీపీ, కమ్యూనిస్టు పార్టీలు ఉనికిలో లేకుండా పోయాయి. ఓటింగ్‌లోనూ టీఆర్‌ఎస్‌ మంచి ఫలితాలను పొందింది.

రైతులు, పింఛన్‌దారులు, మహిళలు పెద్ద ఎత్తున టీఆర్‌ఎస్‌కు ఆదరణ చూపించారు. మూడు మున్సిపాలిటీల్లో 73,397వేల ఓట్లు ఉండగా 58,221వేల ఓట్లు పోలయ్యాయి. ఇందులో  టీఆర్‌ఎస్‌కు 25930, కాంగ్రెస్‌కు13952, బీజేపీకి 4372 ఓట్లు పోలయ్యాయి. నాగర్‌కర్నూల్‌లో 6వ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన బి.తేజ సాయంత్రం ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌ రెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. దీంతో ఇక్కడ టీఆర్‌ఎస్‌ సంఖ్యాబలం 15కు చేరుకొంది. ప్రజల ఆదరణతో టీఆర్‌ఎస్‌ పార్టీ గత ఏడాది నుంచి జరుగుతున్న ఎనికల్లో వరుస విజయాలు సాధిస్తూ వస్తోంది. నాగర్‌కర్నూల్‌లో ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలను గెలుపొందడంతో పాటుగా పంచాయతీ, పరిషత్‌ ఎన్నికల్లోనూ అత్యధిక స్థానాల్లో గెలిచింది. ఇలా సీఎం కేసీఆర్‌పై, ప్రభుత్వంపై ప్రజలు ఓటింగ్‌ ద్వారా నమ్మకాన్ని చూపిస్తున్నారు.

అధికారుల పర్యవేక్షణ

నాగర్‌కర్నూల్‌లోని లిటిల్‌  ఫ్లవర్‌ హైస్కూల్‌, కొల్లాపూర్‌ పీజీ కళాశాలలో, కల్వకుర్తిలోని భ్రమరాంబ బీఈడీ కళాశాలలో కౌంటింగ్‌ ఉదయం 8గంటల నుంచి ప్రారంభమైంది. జిల్లా ఎన్నికల పరిశీలకులు పౌసామిబసు, కలెక్టర్‌ శ్రీధర్‌ ఫలితాలను పర్యవేక్షించారు. మూడు రౌండ్ల వారీగా జరిగిన లెక్కింపు ఫలితాలు మధ్యాహ్నం 2గంటల వరకు పూర్తయ్యాయి.

టీఆర్‌ఎస్‌  నాయకుల సంబురాలు

ఇక విజయం సాధించిన అభ్యర్థులు పట్టణాల్లో ఊరేగింపు నిర్వహించారు. మిఠాయిలు పంచుకుని, పటాకులు కాల్చి సంబురాలు చేసుకున్నారు. సాయంత్రం ఆయా పార్టీల అభ్యర్థులు హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక క్యాంపునకు బయలుదేరారు. సోమవారం మున్సిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నిలకు ఉండటంతో ఇప్పుడు చైర్మన్‌ అభ్యర్థులపై అభ్యర్థులు, రాజకీయ పార్టీల్లో హడావుడి మొదలైంది. పలువురి అభ్యర్థుల పేర్లతో అంచనాలు వేసుకొంటున్నారు. నాగర్‌కర్నూల్‌లో తొలి రౌండ్‌లో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లకు నాలుగు స్థానాల్లో గెలుపొందగా రెండో రౌండ్‌లో టీఆర్‌ఎస్‌కు 5, కాంగ్రెస్‌కు 3సీట్లు వచ్చాయి. ఇలా రెండు రౌండ్లల్లో కలిపి టీఆర్‌ఎస్‌ 9, కాంగ్రెస్‌ 7స్థానాలు సాధించింది. దీంతో మూడో రౌండ్‌ ఫలితాలపై అందరిలోనూ ఉత్కఠ నెలకొంది. అయితే ఇందులో ఓ స్వతంత్ర అభ్యర్థితో పాటుగా 5స్థానాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గెలుపొందడంతో స్పష్టమైన మెజార్టీ వచ్చింది. మొత్తం మీద టీఆర్‌ఎస్‌ పార్టీ మున్సిపల్‌ ఎన్నికల్లో స్పష్టమైన ఆధిక్యం సంపాదించి పుర పీఠాలను కైవసం చేసుకోనుండటం విశేషం.
ఈ ఎన్నికల ఫలితాలపై ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌పై, సీఎం కేసీఆర్‌పై, పార్టీ అధ్యక్షులు కేటీఆర్‌పై ప్రజలు ఉంచిన నమ్మకాన్ని నిరూపిస్తున్నాయన్నారు. గ్రామాల మాదిరిగానే పట్టణాల్లోనూ అభివృద్ధి జరగాలంటే టీఆర్‌ఎస్‌ రావాలని ప్రజ లు కోరుకున్నారని తెలిపారు. ప్రజల ఆకాంక్ష మేరకు నాగర్‌కర్నూల్‌తో పాటు అన్ని పట్టణాల్లోనూ త్వరలో పట్టణ ప్రణాళిక ఏర్పాటు చేసి అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించడంతో పాటు సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రజలు ఇచ్చిన ఈ తీర్పు సేవ చేసేందుకు తమకు మరింత బలం ఇచ్చిందన్నారు.


logo