ఆదివారం 31 మే 2020
Nagarkurnool - Jan 25, 2020 , 01:15:29

క్షణక్షణం ఉత్కంఠ

క్షణక్షణం ఉత్కంఠ
  • ఐదు బల్దియాల్లో నేడు కౌంటింగ్
  • ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం
  • పకడ్బందీగా ఏర్పాట్లు చేసిన అధికారులు
  • 19 మంది మైక్రోఅబ్జర్వర్ల నియామకం
  • మున్సిపాలిటీల వారీగా కేంద్రాల ఏర్పాటు
  • ప్రతి వార్డుకు ఒక రౌండ్..పోలీసుల పటిష్ట బందోబస్తువనపర్తి ప్రతినిధి, నమస్తే తెలంగాణ : మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కోసం అధికార యంత్రాంగం ఏర్పాట్లను పూర్తి చేసింది. ఇందుకు శుక్రవారం ఆయా మున్సిపాలిటీల వారీగా కేంద్రాలను గుర్తించి టేబుల్స్‌ను సిద్ధం చేశా రు. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలు వనపర్తి, పెబ్బేరు, కొత్తకోట, ఆత్మకూరు, అమరచింతల్లో కౌంటింగ్ కోసం ప్రత్యేకంగా భవనాలను గుర్తించారు. జిల్లా వ్యాప్తంగా 79 వార్డులకు ఎన్నికలు జరిగాయి. వీటిలో 342 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఈ మేర కు వీరి భవితవ్యం కౌంటింగ్‌తో తేలిపోనుంది. ఈనెల 22వ తేదీన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరిగిన సం గతి తెలిసిదే. బ్యాలెట్ బాక్సులను ఆయా మున్సిపాలిటీ ల వారీగా స్ట్రాంగ్ రూంల్లో భద్రపరిచారు. కాగా, శనివా రం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియను ఆయా కేంద్రాల్లో ప్రారంభించేలా చర్యలు తీసుకున్నారు.

ప్రతి వార్డుకు ఒక రౌండ్..

కౌంటింగ్ కేంద్రాల్లో అవసరమైన మేరకు ఏర్పాట్లు చేశారు. మున్సిపాలిటీ పరిధిలోని వార్డులను పరిగణలోకి తీసుకుని ఓట్లు లెక్కించేలా చర్యలు చేపట్టారు. ప్రతి వార్డుకు ఒక టేబుల్ చొప్పున ఏర్పాటు చేశారు. ఒక సూపర్‌వైజర్, మరో ఇద్దరు సహాయకులు టేబుల్ వ్యవహారాలను చూసేలా నిర్ణయించారు. అలాగే మూడు వార్డులకు ఒక ఆర్వోను పరిశీలన నిమిత్తం నియమించారు. వీరితోపాటు జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలకు సంబంధించి 19 మంది మైక్రో అబ్జర్‌వర్స్‌ను నియమించారు. ఎక్కడ వివాదాలు లేకుండా కౌంటింగ్‌ను ప్రశాంతంగా కొనసాగించేలా చర్యలను తీసుకున్నారు. ప్రతి రౌండ్‌కు ఒక టేబుల్‌ను ఏర్పాటు చేసినందునా కౌంటిం గ్ ప్రక్రియ కూడా వేగంగా జరిగే అవకాశం ఉంది. ఎక్కడికక్కడ అన్ని వార్డులు ఆయా కేంద్రాల్లో ఒకేసారి కౌం టింగ్ మొదలవుతాయి. ఫలితాలు కూడా ఒకదాని వెం ట ఒకటి వెల్లడి అయ్యేలా కార్యాచరణ తీసుకున్నారు.

ఏజెంట్ల నియామకం

కౌంటింగ్ సందర్భంగా ఆయా రాజకీయ పార్టీలు ఏజెం ట్ల నియామకాన్ని చేపట్టాయి. ప్రతి వార్డు నుంచి పోటీ చేసిన అభ్యర్థితోపాటు మరొకరికి కౌంటింగ్ ఏజెంట్‌గా అవకాశం కల్పించారు. ఈ మేరకు ఆయా అభ్యర్థులు పాస్‌లను పొందారు. పోలింగ్ సందర్భంగా ఏర్పాటు చేసుకున్న వ్యక్తులనే కౌంటింగ్‌కు అభ్యర్థులు సిద్ధం చేసుకున్నారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే కౌంటింగ్ ప్రక్రియ దాదాపు మధ్యాహ్నం వరకు కొలిక్కిరావచ్చని అంచనా వేస్తున్నారు. అయితే, గెలుపులపై అధికారిక ప్రకటన వెలువడేందుకు మాత్రం మరికొంత సమయం తీసుకోవచ్చన్న అభిప్రాయం ఉంది.

పటిష్టంగా బందోబస్తు

కౌంటింగ్ సందర్భంగా పోలీస్ శాఖ పటిష్టమైన భద్రతా చర్యలను ఏర్పాటు చేసింది. మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో ఇప్పటి వరకు ఎలాంటి వివాదాలు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. అక్కడక్కడ ఒకటి, రెండు చిన్న విషయాలు మినహాయిస్తే మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా జరిగింది. ఇక కౌంటింగ్‌ను కూడ అదే తీరులో నిర్వహించేందుకు గట్టి భద్రతా చర్యలను ఎస్పీ అపూర్వరావు పర్యవేక్షణలో చేపట్టారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందునా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలను కలెక్టర్ శ్వేతామొహంతి, ఎస్పీ అపూర్వరావులు తీసుకున్నారు. స్ట్రాంగ్ రూంలను అనుసరించే కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినందునా ఎలాంటి సమస్యలు లేకుండా ప్రక్రియ కొనసాగనుంది.


logo