బుధవారం 27 మే 2020
Nagarkurnool - Jan 25, 2020 , 01:09:42

అందరి దృష్టి మున్సిపల్ ఎన్నికల ఫలితాల పైనే

అందరి దృష్టి మున్సిపల్ ఎన్నికల ఫలితాల పైనే
  • -ఏర్పాట్లను పరిశీలించిన జాయింట్ కలెక్టర్
  • -తేలనున్న అభ్యర్థుల భవిత్యం

కొల్లాపూర్, నమస్తే తెలంగాణ : ఈ నెల 22న కొల్లాపూర్‌లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరిగింది. రెండు రోజుల నిరీక్షణకు శనివారంతో తెరపడనుంది. బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైన అభ్యర్థుల భవితవ్యం శనివారం వెల్లడికానుంది. ఫలితాల కోసం అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థులలో ఒకటే ఉత్కంఠ. ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద పోలీసుల భారీ భద్రతను పెంచారు. కొల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని 20 వార్డులకు  97 మంది అభ్యర్థులు ఎన్నిల బరిలో నిలిచారు. పట్టణంలోని గ్రంథాలయ - యోగా భవనం లో ఓట్ల లెక్కింపు ఏర్పాట్లకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. శుక్రవారం సాయంత్రం నాగర్‌కర్నూల్ జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, ఆర్డీవో శ్రీరాం ఓట్ల లెక్కింపు కేంద్రంలో ఏర్పాట్లను పరిశీలించారు. ఓట్ల లెక్కింపు అధికారులకు సూచనలు, సలమాలను చేశారు. కొల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న మొత్తం ఓటర్లు 19,488 ఉండగా ఈనెల 22న జరిగిన పోలింగ్‌లో 15,858 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకొని నాగర్‌కర్నూల్ జిల్లాలోనే అత్యధికంగా కొల్లాపూర్ మున్సిపాలిటీలో 81.37శాతం నమోదయింది.  20 వార్డులకు ఒక టేబుల్‌లో 7వార్డులల్లోని 14 పోలింగ్ కేంద్రాల ఓట్లను లెక్కింపు చేశారు. రెండో టేబుల్‌లో మరో 7వార్డుల్లోని 14 పోలింగ్‌కేంద్రాల ఓట్ల లెక్కింపు చేపడుతారు. మూడో టేబుల్‌లో  మిగిలిన 6వార్డుల్లోని 12 పోలింగ్‌కేంద్రాల ఓట్లను లెక్కిస్తారు. ఒక టేబుల్‌కు ఒక ఆర్వో,ఒక సూపర్‌వైజర్, మరోఇద్దరు ఓట్ల లెక్కింపు సిబ్బంది చొప్పున ఉంటారని స్థానిక మున్సిపల్ కమిషనర్ వెంకటయ్య వివరించారు. ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 46మంది ఆర్వోలు,ఏపీవోలు విధుల్లో ఉంటారని  పేర్కొన్నారు. ఉదయం 8గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలవుతుందన్నారు. ఉదయం 7 : 30గంటలకే అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ తెరిచి ఆ తరువాత పోస్టల్ బ్యాలెట్ పేపర్లను లెక్కింపును షురూ చేయనున్నట్లు కమిషనర్ తెలిపారు. ఇదిలావుండగా ఈ నెల 22న రాత్రి స్ట్రాంగ్‌రూమ్ వద్ద చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో భద్రత చర్యల నిమిత్తం పెద్దఎత్తున పోలీస్ బలగాలను రంగంలోకి దించారు. ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద రహదారిని కట్టడి చేసి బారికేడ్లను ఏర్పాటు చేసి పోలీసు నిఘాలో ఉంచారు.

 ఏలేది ఎవరో.. తేలేది నేడే

కొల్లాపూర్ మున్సిపాలిటీలో ఉన్న 20 వార్డులకు తొలిసారిగా ఈ నెల 22న పో లింగ్ జరిగింది. గత 9ఏళ్లుగా పాలకవర్గం లేకపోవడంతో ప్రత్యేకాధికారి పాలనలోనే కొనసాగింది. ఐదేళ్ల పాలన సాగించే నేతల భవిష్యత్ కొన్ని గంటల్లో  ఓట్ల లెక్కింపు( శనివారం) తేటతెల్లమవుతుంది. తొలిసారిగా కొల్లాపూర్ మున్సిపాలిటీ పీఠాన్ని ఏ పార్టీ అధికారాన్ని చేపట్టనుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫలాన వార్డులో ఏపార్టీ అభ్యర్థి గెలుస్తారని నలుగురు కలిసిన ప్రతి చోట చర్చించుకుంటున్నారు. ప్రధాన పార్టీలైన టీఆర్‌ఎస్-ఏఐఎఫ్‌బీపీ మధ్యే నువ్వా.. నేనా అన్నట్లుగా ఎన్నికల  ప్రచారం జరిగినప్పటికీ సీఎం కేసీఆర్ చేపట్టిన సంక్షేమపథకాలే తమను గట్టేకిస్తాయని టీఆర్‌ఎస్ శ్రేణులు ధీమాగా ఉన్నారు.

 కౌంటింగ్ వద్ద 144 సెక్షన్

ఓట్ల లెక్కింపు కేంద్రం పరిసర ప్రాం తంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండగా 144 సెక్షన్ అమలులో ఉందని  సీఐ వెంకట్‌రెడ్డి తెలిపారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున గెలిచిన అభ్యర్థులు ఎవరూ కూడా విజయోత్సవ ర్యాలీలకు అనుమతులు లేవని పేర్కొన్నారు. కౌంటింగ్‌కు వచ్చే అభ్యర్థులు,వారి వెంట ఒక ఏజెంటు మాత్రమే అనుమతి ఉంటుందని చెప్పారు. అభ్యర్థులు, ఏజెంట్లు ఎవరూ కూడా సెల్‌ఫోన్లు, అగ్గిపెట్టెలు, సిగరెట్లు, నీళ్ల బాటిళ్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు అనుమతించవని సీఐ వెల్లడించారు.



logo