శుక్రవారం 29 మే 2020
Nagarkurnool - Jan 25, 2020 , 01:07:59

మిషన్ భగీరథ తాగునీటికి రూ.6 కోట్లు

మిషన్ భగీరథ తాగునీటికి రూ.6 కోట్లు
అమ్రాబాద్ రూరల్ : తెలంగాణ రాష్ర్టానికి, జిల్లా సరిహద్దు ప్రాంతమైన నల్లమల ప్రాంతంలోని నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండల పరిధిలోగల శ్రీశైలం ప్రాజెక్టు ఎడమగట్టు ప్రాంతమైన పాతాళగంగ వద్ద నుంచి దోమలపెంట వరకు మిషన్ భగీరథ తాగునీటి పథకాన్ని శుక్రవారం నాబార్డ్ ఈఈ శ్రీధర్‌రావు, ఇతర అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా పై గ్రామాలకు తాగునీటి వసతులు కల్పించుటకు ప్రత్యేకంగా నిధులు కావాలని స్థానిక శాసన సభ్యులు విప్ గువ్వల బాలరాజు సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారని నాబార్డ్ ఈఈ శ్రీధర్‌రావు తెలిపారు. ఈ క్రమంలో గతేడాది రూ.6 కోట్ల నిధులు అవసరం ఉందని సంబంధిత అధికారులు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించారన్నారు. దానికి సంబంధించి నేడు పర్యటన చేశామని, ఎక్కడ నుంచి నీటిని ఇవ్వవచ్చు, అందుకు గల సమస్యలు ఏమున్నాయి, వాటిని పరిశీలన చేసినట్లు తెలిపారు. అధికారులు ప్రతిపాదించినట్టుగా నాబార్డు నుంచి రూ.6కోట్లు మంజూరు చేసేందుకు చర్యలు సిద్ధం చేశారన్నారు. త్వరలోనే నిధులు విడుదల చేస్తామన్నారు. దీంతో రాష్ట్ర సరిహద్దులో ఉన్న గ్రామాలైన పాతాళగంగ, ఈగలపెంట, దోమలపెంట గ్రామాలకు పంపూర్ణ తాగునీరు అందుతుందని గుర్తుచేశారు. పనులకు సంబంధించి వారం పది రోజుల్లో టెండర్లు పూర్తి చేసి, తదుపరి పనులు ప్రారంభించవచ్చన్నారు. దోమలపెంట గ్రామంలో ఏ ప్రదేశంలో ఓవర్‌హెడ్ ట్యాంకును నిర్మించాలి, శ్రీశైలం ఎడమగట్టు నుంచి పైకి నీటిని ఎత్తిపోసే ప్రదేశాన్ని పరిశీలించి ఎక్కడ నుంచి ఎక్కడి వరకు పైపులైన్ అవసరం ఉంటుంది, తదితర విషయాలపై స్థానిక ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులతో చర్చించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈఈ పుల్లారెడ్డి, వేణుగోపాల్‌రావు, భాస్కర్, మిషన్ భగీరథ డీఈ మణిపాల్, ఆర్‌డబ్ల్యూస్ డీ హేమలత, మేఘా పీఆర్‌జీటీ మేనేజర్ శ్రీనువాసులు, గ్రామ సర్పంచ్ శారద, ఏఈలు, టీఆర్‌ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షడు శివారెడ్డి, మాజీ ఉపసర్పంచ్ భూదాల ప్రసాద్ తదితరులు ఉన్నారు.


logo