శుక్రవారం 07 ఆగస్టు 2020
Nagarkurnool - Jan 24, 2020 , 02:01:29

గెలుపెవరిదో..?

 గెలుపెవరిదో..?
  • -వార్డుల్లో భారీగా పెరిగిన పోలింగ్‌
  • -కందనూలు, కల్వకుర్తిలో పెరుగుదల
  • - ఓటింగ్‌ సరళిపై రాజకీయ విశ్లేషణలు
  • - మూడు పీఠాలూ తమవనే ధీమాలో టీఆర్‌ఎస్‌
  • -రేపటి ఫలితాల వెల్లడిపైనే

నాగర్‌కర్నూల్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: నాగర్‌కర్నూల్‌, కల్వకుర్తి, కొల్లాపూర్‌ మున్సిపాల్టీల్లో ఎన్నికల్లో గెలుపు, ఓటములపై ఊహాగానాలు ఊపందుకొన్నాయి. మూడు మున్సిపాల్టీల్లోనూ ఎన్నికల్లో భారీగా పోలింగ్‌ నమోదైంది. నాగర్‌కర్నూల్‌లో 76.89శాతం, కల్వకుర్తిలో 80.84శాతం, తొలిసారి ఎన్నికలు జరుగుతున్న కొల్లాపూర్‌లో 81.37శాతం చొప్పున మూడు మున్సిపాల్టీల్లో కలిపి 79.32శాతం పోలింగ్‌ జరగడం విశేషం. ఈ పోలింగ్‌ ఎవరికి లాభం, నష్టం కలిగిస్తుందోననే ఆందోళన ఆయా పార్టీల అభ్యర్థుల్లో కనిపిస్తోంది. అత్యధిక వార్డుల్లో 70శాతానికిపైగానే పోలింగ్‌ జరిగింది. ఇక పోలింగ్‌ ముగియడంతో ఏయే వార్డుల్లో ఎవరెవరు గెలుస్తారోననే చర్చలు మొదలయ్యాయి. టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీలు పోటీలో ఉండగా గులాబీ పార్టీ అభ్యర్థులే అత్యధిక స్థానాల్లో గెలిచే అవకాశాలు ఉన్నట్లుగా ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు పార్టీ అభ్యర్థులకు అండగా నిలుస్తామని నమ్ముతున్నారు. ఇక పార్టీ అభ్యర్థుల ప్రచారం కూడా ఇతర పార్టీలు దరిదాపుల్లోకి రాలేని విధంగా సాగింది. పోలింగ్‌ జరిగిన తీరు దీనికి నిదర్శనంగా నిలిచింది. దీన్నిబట్టి కల్వకుర్తిలో మరోసారి కారు పాగా వేస్తుందని నాయకులు అంచనా వేస్తున్నారు. తొలిసారిగా కొల్లాపూర్‌లో జరిగిన పోరులోనూ టీఆర్‌ఎస్‌ పథకాలతో కారు జోరు చూపించి కోటపై పాగా వేస్తుందని, నాగర్‌కర్నూల్‌లోనూ తొలిసారిగా సంపూర్ణ మెజార్టీ ఖాయమనే నమ్మకాన్ని టీఆర్‌ఎస్‌ నేతలు పేర్కొంటున్నారు. ఇలా మూడు పురపీఠాలూ కైవసం చేసుకుంటుందనే ఆశలో టీఆర్‌ఎస్‌ నేతలు ఉన్నారు. ఎట్టకేలకు శనివారం నాడు ఫలితాలు వెలువడుతుండటంతో కౌన్సిలర్లుగా గెలిచేదెవరోననే చర్చ ప్రజల్లో జరుగుతోంది. ఇక పోలింగ్‌ నమోదైన తీరును బట్టి తమకు ఏయే వర్గాలు అండగా నిలిచాయో, గెలుపు, ఓటమిపై అభ్యర్థులు అంచనాకు వస్తున్నారు. మహిళలు, పింఛన్‌దార్ల ఓట్ల ప్రభావంపై కూడా బేరీజు వేస్తున్నారు. గెలుపు అవకాశాలపై మీడియా, ఇతర మేధావి వర్గాలతో తెలుసుకొంటున్నారు. ఇక ఆయా పార్టీల నేతలు సైతం తమ పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయోననే లెక్కలు వేస్తున్నారు. ఇక శనివారం ఫలితాలు లెక్కింపు, విడుదల కానుండటంతో ఈ విశ్లేషణలు, ఊహాగానాలకు తెరపడనుంది. అయితే చైర్మన్‌ పదవులను ఎవరికి కేటాయిస్తారోననే ఉత్కంఠ సైతం గెలిచే అవకాశాలున్న అభ్యర్థులతో పాటుగా ప్రజల్లోనూ వ్యక్తమవుతోంది. తమకే పదవులు దక్కేలా ఇప్పటి నుంచే నాయకుల మెప్పుపొందే ప్రయత్నాలు చేస్తున్నారు. ఏది ఏమైనా శనివారం నాటి ఫలితాలతో కౌన్సిలర్లుగా ఎవరెవరు గెలుస్తారో,  ఏ పార్టీకి మెజార్టీ సీట్లు  వస్తాయో, మున్సిపల్‌ పీఠాలు ఏ పార్టీకి దక్కుతాయో తేలనుంది. మొత్తం మీద రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, ప్రజలంతా ఈనెల 25వ తేదీపైనే దృష్టిlogo