గురువారం 28 మే 2020
Nagarkurnool - Jan 24, 2020 , 02:01:29

కొల్లాపూర్‌ ఘటనపై ఉన్నతాధికారుల సీరియస్‌

కొల్లాపూర్‌ ఘటనపై ఉన్నతాధికారుల సీరియస్‌
  • -పీడీపీపీ యాక్ట్‌ కింద కేసులు
  • -దాదాపు 60 బైకుల స్వాధీనం
  • -ఆరుగురు పోలీసులకు గాయాలు, క్షతగాత్రుల్లో ముగ్గురు ఎస్సైలు
  • -నిందితులకోసం ఆరాతీస్తున్న పోలీసులు
  • -ఏఐఎఫ్‌బీ నేత, 16వార్డు అభ్యర్థి నర్సింహారావుపై కేసు నమోదు

కొల్లాపూర్‌, నమస్తే తెలంగాణ : పోలింగ్‌ అనంతరం కొల్లాపూర్‌లో చోటుచేసుకున్న పరిణామాలపై పోలీసులు ఉన్నతాధికారులు సీరియస్‌గా ఉన్నారు. ఆందోళన కారులు స్ట్రాంగ్‌ రూంపై దాడి, అద్దాలు ధ్వంసం చేయ డంతో పాటు అడ్డుకొనేందుకు వచ్చిన పోలీసు జీపుల పైనా రాళ్ల వర్షం కురిపించిన విషయం విదితమే. ఈ ఘటనలో ఆరుగురు పోలీసులు గాయపడ్డారు. ఎట్టకేలకు పరిస్థితిని అదుపులోకి తెచ్చిన పోలీసులు గురువారం ఉదయం దర్యాప్తు ప్రారంభించారు. స్ట్రాంగ్‌ రూం వద్ద వదిలి వెళ్లిన 60 బైకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ బైకులు ఎవరికి సంబంధించినవని తేల్చే పనిలో నిమగ్నమయ్యారు. బుధవారం రాత్రి 10.30 గంటల సమయంలో ఆల్‌ ఇండియా ఫార్వార్డ్‌ బ్లాక్‌ పార్టీ నాయకుడు, కొల్లాపూర్‌ 16వ వార్డు అభ్యర్థి నర్సింహారావు తన అనుచరులతో కలిసి వచ్చి స్ట్రాంగ్‌ రూంపై దాడి చేసినట్టు నిర్ధారణకు వచ్చిన పోలీసులు ఆయనను ఏ-1 నిందితుడిగా పేర్కొంటూ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఆయన అనుచరులు ఎవరు ఈ దాడిలో పాల్గొని ఉంటారు..? అనే కోణంలో దర్యాప్తును ముమ్మరం చేశారు.

అర్ధరాత్రి హంగామా సాగిందిలా..

కొల్లాపూర్‌ మున్సిపాలిటీ పరిధిలని 20 వార్డు స్థానాలకు బుధవారం పోలింగ్‌జరిగింది. అనంతరం బ్యాలెట్‌ బాక్సులను పట్టణంలోని యోగా- గ్రంథాలయ భవన్‌లోని స్ట్రాంగ్‌ రూమ్‌లో భద్రపర్చారు. రాత్రి 10.30 సమయంలో పట్టణంలో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలో స్ట్రాంగ్‌ రూం పరిసరాల్లో ఉన్న కొందరు వ్యక్తులు బ్యాలెట్‌ బాక్సులను తారుమారు చేస్తున్నారంటూ అరవటంతో పెద్ద ఎత్తున జనం గుమిగూడారు. ఈ క్రమంలో ఫార్వార్డ్‌ బ్లాక్‌ నాయకుడు, 16వ వార్డు అభ్యర్థి నర్సింహారావు స్ట్రాంగ్‌ రూం తెరవాలని పోలీసులపై ఒత్తిడి తెచ్చాడు. వారు నిరాకరించడంతో దాడికి దిగినట్టు ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేశారు. స్ట్రాంగ్‌ రూం అద్దాలను ధ్వంసం చేయడంతోపాటు అడ్డుకొనేందుకు వచ్చిన పోలీసులపైనా రాళ్ల వర్షం కురిపించారు. ఈ ఘటనలో పోలీసు కానిస్టేబుళ్లు వెంకటయ్య ఎడమ కాలికి, రోజ్‌నాయక్‌కు కుడి చేతికి, లింగమయ్య కుడిపాదానికి గాయమైంది. ఇదే సంఘటనలో ముగ్గురు ఎస్సైలు సైతం గాయపడ్డారు. కొల్లాపూర్‌ ఎస్సై మురళీగౌడ్‌ ఎడమకాలికి, సిద్ధాపూర్‌ ఎస్సై రాజు ఎడమ చేయి మధ్య వేలికి, లింగాల ఎస్సై రమేశ్‌ ఎడమ చేయి బొటన వేలికి గాయాలైనట్టు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.
ధ్వంసమైన పోలీసు వాహనాలు

ఆందోళనకారుల దాడిలో పోలీసు వాహనాలు ధ్వంసమయ్యాయి. పెంట్లవెల్లి ఠాణా ఇన్నోవా కుడివైపు విండో గ్లాసు, కోడేరు ఠాణాకు చెందిన బొలేరో వాహనం కుడివైపు విండో అద్దం ధ్వంసమయ్యాయి. ఆందోళనకారుల దాడిలో గాయపడిన పోలీసులకు కొల్లాపూర్‌ దవాఖానలో చికిత్సలు అందించారు. స్ట్రాంగ్‌ రూం వద్ద విధి నిర్వహణలో ఉన్న కోడేరు ఠాణా హెడ్‌ కానిస్టేబుల్‌ మద్దిలేటి ఫిర్యాదు మేరకు నిందితులపై భారతీయశిక్షా స్మృతి 147, 148, 332, 353, రెడ్‌విత్‌ ఐపీసీ 149, ప్రివెన్షన్‌ ఆప్‌ డ్యామేజ్‌ టు పబ్లిక్‌ ప్రాపర్టీ (పీడీపీపీ) చట్టంలోని సెక్షన్‌ 3,4లతోపాటు రిప్రజెంటేషన్‌ ఆఫ్‌ ద పీపుల్‌ యాక్ట్‌ (ఆర్పీ యాక్ట్‌) 135(ఏ)కింద కేసులు నమోదు చేసినట్టు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.logo