మంగళవారం 26 మే 2020
Nagarkurnool - Jan 24, 2020 , 02:01:29

అమ్రాబాద్‌ అడవుల్లోకి రెండు చిరుతలు..

అమ్రాబాద్‌ అడవుల్లోకి రెండు చిరుతలు..
  • -కొల్లంపెంట, పిచ్చకుంట్ల ప్రాంతంలో వదిలిన అధికారులు
  • -ఈనెల 13న షాద్‌నగర్‌ సమీపంలో..
  • -14న మర్రిగూడ పట్టుబడ్డ వైనం
  • -ఎట్టకేలకు ఏటీఆర్‌ ఫీల్డ్‌ డైరెక్టర్‌ ఏకే సిన్హా
  • -సమక్షంలో అడవుల్లో వదిలివేత

అమ్రాబాద్‌ రూరల్‌ : నల్లమలలోని ఏటీఆర్‌ అడవుల్లో అటవీశాఖ ఉన్నతాధికారుల సమక్షంలో వేరు వేరు ప్రదేశాల్లో రెండు చిరుత పులులను గురువారం సాయంత్రం అధికారులు వదిలారు.  ఈ సందర్భంగా ఏటీఆర్‌ ఫీల్డ్‌ డైరెక్టర్‌ ఏకే సిన్హా ఐఎఫ్‌ఎస్‌ మండల పరిధిలోని మన్ననూర్‌ అటవీశాఖ విశ్రాంతి భవనంలో తెలిపారు. ఈ నెల 14న నల్లగొండ జిల్లాలోని మర్రిగుడ మండలంలోని హజిలాపురం సమీపంలో ఓ చిరుత రైతు పంట పొలానికి ఏర్పాటు చేసుకున్న కంచెలో చిక్కుకున్నదని తెలిపారు. గమనించిన ఆ రైతు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో అధికారులు చిరుతను హైదరాబాద్‌లోని జూలాజికల్‌ పార్క్‌కు తరలించారు. అదేవిధంగా ఈ నెల 13న షాద్‌నగర్‌లో చిరుత సంచరించడంతో అటవీశాఖ అధికారులు హైదరాబాద్‌ జూపార్క్‌కు తరలించారు. అక్కడ చిరుతలను పరీక్షించారు. అనంతరం జూపార్క్‌ అటవీశాఖ అధికారులు గురువారం ఉదయం 10గంటల తర్వాత జూపార్క్‌ నుంచి నల్లమల అటవీ ప్రాంతానికి తీసుకొచ్చారని తెలిపారు. రెండు చిరుత పులుల్లో ఒక పులిని అమ్రాబాద్‌ రేంజ్‌ పరిధిలోని కొల్లంపెంట అటవీ ప్రాంతంలో సాయంత్రం 5:25 గంటలకు అడవిలోకి వదిలారు. మరో చిరుతను మన్ననూర్‌ రేంజ్‌ పరిధిలోని పిచ్చకుంట్ల చెరువు అటవీ ప్రాంతంలో సాయంత్రం 6:15 గంటల సమయంలో వదిలారు.  అడవిలో చిరుతులను వదిలే క్రమంలో అటవీశాఖ అధికారులు అన్ని రకాల రక్షణ చర్యలు తీసుకున్నారని అన్నారు. కార్యక్రమంలో జిల్లా అటవీశాఖ అధికారి జోజి, అచ్చంపేట, జూపార్క్‌ క్యూరేటర్‌ క్షితిజ, అమ్రాబాద్‌ ఎఫ్‌డీవోలు సుధాకర్‌రావు, రాజశేఖర్‌రెడ్డి, అమ్రాబాద్‌, మన్ననూర్‌ రేంజర్లు ప్రభాకర్‌, మురళిమనోహర్‌, అటవీశాఖ సిబ్బంది పాల్గొన్నారు.


logo