గురువారం 28 మే 2020
Nagarkurnool - Jan 21, 2020 , 02:12:24

కేసీఆర్‌ నాయకత్వంలోనే.. కొల్లాపూర్‌ అభివృద్ధి

కేసీఆర్‌ నాయకత్వంలోనే.. కొల్లాపూర్‌ అభివృద్ధి
  • - బక్కచిక్కిన సింహాలను నమ్మొద్దు
  • - అవి అదును చూసి వేటు వేస్తాయి
  • - సోమశిల బ్రిడ్జి, పర్యాటకంతో కొల్లాపూర్‌ రూపురేఖలు మారుస్తాం
  • - 20వార్డులు టీఆర్‌ఎస్‌వే..
  • - ‘నమస్తే తెలంగాణ’తో ఎమ్మెల్యే బీరం

మహబూబ్‌నగర్‌ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: కొల్లాపూర్‌ మున్సిపల్‌ ఎన్నికల బరిలో ఉన్నవారిని గెలిపించేందుకు ప్రజలంతా ఒక్కటవుతున్నారని, గతంలో ఒక లెక్క ఇకపై ఒక లెక్క అంటూ ఎమ్మెల్యే బీరం పేర్కొన్నారు. కొల్లాపూర్‌ అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తానని ఆయన ఈ సందర్భంగా ప్రజలకు హామీ ఇచ్చారు. ‘నమస్తే తెలంగాణ’తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన కొల్లాపూర్‌లోని 20 వార్డులను టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులే కైవసం చేసుకుంటున్నారని స్పష్టం చేశారు.

సీఎం కేసీఆర్‌ నాయకత్వంలోనే..

సీఎం కేసీఆర్‌ నాయకత్వంలోనే కొల్లాపూర్‌ రూపురేఖలు మారతాయి. కొత్త మున్సిపాలిటీ అయిన వెంటనే వివిధ అభివృద్ధి పనుల కోసం రూ. 20 కోట్లు కేటాయించారు. అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజి, పట్టణంలోని చౌరస్తాల వద్ద సుందరీకీకరణ, సెంట్రల్‌ లైటింగ్‌, పుట్‌ పాత్‌ల నిర్మాణం, పార్కులు... వంటి పనులు చేపడుతున్నాం. ఎల్లూరు మిషన్‌ భగీరథ ప్లాంట్‌ నుంచి పట్టణానికి ప్రత్యేక పైప్‌లైన్‌ వేయించి ప్రతి ఇంటికి నిత్యం శుద్ధ జలం అందిస్తా. ఇందుకోసం రూ. 2 కోట్లు మంజూరీ చేయించాం.

కొల్లాపూర్‌ దశ దిశ మారుస్తా..

ఎంతో కాలంగా ఎందరో నేతలకు ఎన్నికల హామీగా మారిన సోమశిల- సిద్ధేశ్వరం బ్రిడ్జి నిర్మాణమే నా ధ్యేయం. ఇప్పటికే ఈ అంశంపై సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకుపోయాను. ఆయన సానుకూలంగా స్పందించారు. ఇక సోమశిల వద్ద ఏర్పాటు చేసిన పర్యాటక సొబగులు ఎందరినో ఆకట్టుకుంటున్నాయి. గతంలో భయంభయంగా బతికిన పట్టణ ప్రజలు స్వేచ్ఛగా జీవించేలా చూస్తా. నాకు కొల్లాపూర్‌ అభివృద్ధే ముఖ్యం. మాకు ముఖ్యమంత్రి ఆశీస్సులున్నాయి.

పార్టీ ద్రోహులకు బుద్ధి చెప్పండి...

పార్టీలో ఉంటూనే పార్టీకి ద్రోహం చేసే వారికి కొల్లాపూర్‌ ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని కోరుతున్నా. పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే వారిపై అధిష్టానం కఠినమైన చర్యలు తీసుకుంటుంది. భవిష్యత్తులో వారికి  దారులన్నీ మూసుకుపోయినట్లే. వారిని ఇక పార్టీలోకి రానిచ్చే పరిస్థితే ఉత్పన్నం కాదు. ఒకరితో పెళ్లి చేసుకుని మరొకరితో సంసారం చేసే వాళ్లను ప్రజలు నమ్మరు. పార్టీలో ఉండి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేసే వారు ధైర్యం ఉంటే బయటకు వెళ్లి పోరాటం చేయాలి. ఇలాంటి తెరచాటు రాజకీయాలు చేస్తే ప్రజలే తగిన గుణపాఠం చెప్తారు.

ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోంది...

ప్రజల నుంచి చక్కని స్పందన వస్తోంది. ఎన్నికల ప్రచారానికి వెళ్తే ఎక్కడ చూసినా బ్రహ్మరథం పడుతున్నారు. ఇన్నాళ్లు ఓట్లు వేయించుకుని మోసం చేసిన వారిని చూశామని..ఇప్పుడు అభివృద్ధి చేసే వారు వస్తున్నారని దీవిస్తున్నారు. కారు గుర్తు తప్ప తమకేమీ కనిపించడం లేదంటున్నారు. ప్రజల నుంచి ఇంతటి స్పందన ఊహించలేదు.

ప్రతిపక్షాల అడ్రస్‌ గల్లంతు..

ఇప్పటికే అన్ని ఎన్నికల్లోనూ వరుసగా ఓడిపోతున్న ప్రతిపక్షాలకు మున్సిపల్‌ ఎన్నికల్లో అడ్రస్‌ గల్లంతవుతుంది. కాంగ్రెస్‌, బీజేపీలను ప్రజలు ఛీదరించుకుంటున్నారు. ఏ మొహం పెట్టుకుని ఓట్లడుగుతున్నారని ప్రతిపక్షాలను నిలదీస్తున్నారు. మా విజయం నల్లేరుమీద నడకే. ప్రతిపక్షాలు కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే కనిపిస్తాయని ప్రజలే అంటున్నారు. అంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.logo