శుక్రవారం 05 జూన్ 2020
Nagarkurnool - Jan 19, 2020 , 01:36:20

నేడే పల్స్‌ పోలియో

నేడే పల్స్‌ పోలియో
  • -సర్వం సిద్ధం చేసిన అధికారులు
  • -88,608 మంది చిన్నారుల గుర్తింపు
  • -హైరిస్క్‌ ప్రాంతాలు 165
  • - 719 కేంద్రాల ఏర్పాటు
పల్స్‌పోలియో కార్యక్రమానికి జిల్లాలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 1438 పోలింగ్‌ బృందాలు ఏర్పాటు చేశారు. పోలియో డ్రాప్స్‌ పంపిణీ విధుల్లో 6092 మంది ఉద్యోగులు పాలుపంచుకోనున్నారు. ఆదివారం ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు పోలియో చుక్కలను వేస్తారు.             - బిజినేపల్లి

బిజినేపల్లి: రెండు పోలియో చుక్కలతో నిండు జీవితం సాధించేందుకు పల్స్‌ పోలియో చుక్కలు వేయడం జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా పల్స్‌పోలియోకు ఏర్పాట్లు చేశారు. 0-5 సంవత్సరాల్లోపు చిన్నారులందరికి పల్స్‌పోలియో చుక్కలు వేయనున్నారు. ఆదివారం ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు ఈ పల్స్‌పోలియో కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ప్రధానంగా దేవాలయాలు, పాఠశాలలు, బస్టాండ్‌లు, రహదారి కూడళ్ల వద్ద ఈ పల్స్‌ పోలియో కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. చెంచు గూడెలు, ఆవాస ప్రాంతాలు, సంచార జాతులకు కూడా పోలియో చుక్కలను వేయడం జరుగుతుంది. ఈ పోలియో చుక్కలు వందశాతం వేసేందుకు సర్వం సిద్ధ్దం చేస్తున్నారు.  ప్రతి యేడాది రెండు సార్లు పుట్టిన బిడ్డ నుంచి ఐదు సంవత్సరాల్లోపు చిన్నారులకు ఖచ్చితంగా పోలియో చుక్కలు వేయించాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

ఆదివారం పోలియో చుక్కలు వేయడంతో పాటు మరో మూడు రోజుల పాటు మిగిలిపోయిన చిన్నారులకు ఈ పోలియో చుక్కలను వేయడం జరుగుతుంది. ఈ పోలియోకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా పరిశీలిస్తే మొత్తం 9,29,810 పాపులేషన్‌ ఉండగా 0 -5 నుంచి ఐదు సంవత్సరాల్లోపు చిన్నారులు 28,608 మంది ఉన్నట్లు గుర్తించడం జరిగింది. కాగా గృహాలు 1,92,283 ఉన్నాయి. హైరిస్క్‌ కేంద్రాలకు సంబంధించి నెంబర్‌ ఆఫ్‌ సీడ్స్‌ 165, పాపులేషన్‌ 3971 మంది ఉండగా 1,077 ఇండ్లు కలవు. కాగా ఈ ఇండ్లల్లో 0-5 సంవత్సరాల్లోపు చిన్నారులు 634 మంది ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 26 పీహెచ్‌సీలు ఉన్నాయని, 179 సబ్‌ సెంటర్లు ఉన్నాయి. కాగా జిల్లా వ్యాప్తంగా గ్రామాలు 510 ఉండగా తండాలు 133 ఉన్నాయి. జిల్లా వ్యాప్తం గా పోలింగ్‌ బూత్‌ కేంద్రాలను 719 ఏర్పాటు చేశారు. అదేవిధంగా 1438 పోలింగ్‌ బృందాలు జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసి పోలియో చుక్కలను వేయడం జరుగుతుంది. 26 మొబైల్‌ టీమ్‌లు, 18 ట్రాన్సిస్ట్‌ పాయింట్లు, 3వేల వ్యాకినేటర్స్‌, 92 సూపర్‌వైజర్లు కేటాయించడం జరిగింది. ఈ పోలింగ్‌ కార్యక్రమంలో ఏఎన్‌ఎమ్‌లు 246, ఆశలు 902, ఏడబ్ల్యూడబ్ల్యూ 1017, వాలెంటిర్లు 835 మంది పాల్గొననున్నట్లు వైద్యాధికారులు తెలుపుతున్నారు. ఏదేమైనప్పటికి ఈ పోలియో కోసం జిల్లా వ్యాప్తంగా అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు.

పోలియో నిర్మూలన ధ్యేయంగా పనిచేద్దాం

నాగర్‌కర్నూల్‌ టౌన్‌: పోలియో రహిత జిల్లాగా మార్చేందుకు అందరం కలిసికట్టుగా పనిచేద్దామని జిల్లా అదనపు వైద్యాధికారి డాక్టర్‌ వెంకటదాస్‌, ఇమ్యూనైజేషన్‌ అధికారి డాక్టర్‌ సాయినాథ్‌రెడ్డిలు పిలుపునిచ్చారు. శనివారం జిల్లా కేంద్రంలో చేపట్టిన పోలియో రహిత అవగాహన ర్యాలీని వారు ప్రారంభించారు. జూనియర్‌ కళాశాల నుంచి ప్రారంభమైన ర్యాలీ పట్టణంలోని ప్రధాన రహదారుల పొడవునా ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ జిల్లాలోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాలు, సబ్‌ సెంటర్లు, బస్టాండ్‌ల పరిధిలో సెంటర్ల ఏర్పాటు చేశామని వివరించారు. నిర్ధేశించిన లక్ష్యాన్ని వందశాతం పూర్తి చేసేందుకు పక్కా ప్రణాళికలు రూపొందించామన్నారు. జిల్లా నుంచి పోలియో మహమ్మారిని తరిమేసేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో మండల వైద్యాధికారి డాక్టర్‌ దశరథం, వైద్య సిబ్బంది విద్యాసాగర్‌, శ్రీనివాసులు, రమాదేవి, మల్లమ్మ, రజిత, ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ రాంచంద్రారెడ్డి, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.
logo