గురువారం 28 మే 2020
Nagarkurnool - Jan 17, 2020 , 02:26:25

పుష్పపల్లకీలో శ్రీశైల మల్లికార్జునుడు

పుష్పపల్లకీలో శ్రీశైల మల్లికార్జునుడు


శ్రీశైలం :  శ్రీశైల మహా క్షేత్రంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. సంస్కృతీ, సంప్రదాయాలకు అద్దంపట్టే సంక్రాంతి కనుమ పండుగకు బసవన్నకు ప్రత్యేక పూజలు చేసి ఐదవరోజు ఉత్సవంలో స్వామిఅమ్మవార్లకు పుష్పపల్లకీ సేవ జరిపించినట్లు ఈవో కేఎస్ రామారావు చెప్పారు. భారతీయ సంప్రదాయాన్ని ప్రపంచానికి చాటిచెప్పడంలో ముగ్గులకు గల ప్రాధాన్యతను వివరించారు.సాయంత్రం నందివాహన సేవ అనంతరం చెంచుల ఆరాధ్య దైవమైన ఆది దంపతులకు కల్యాణం జరిపించారు.

చెంచుల సమక్షంలో కల్యాణం

గిరిపుత్రుల ఆరాధ్య దైవమైన భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల కల్యాణాన్ని సంక్రాంతి పండుగ రోజు రాత్రి నిత్యకల్యాణ మండపంలో వైభవంగా జరిపించారు. క్షేత్ర పరిసర ప్రాంతాలతో పాటు వివిధ జిల్లాలకు సంబంధించిన చెంచులు కల్యాణంలో పాల్గొన్నట్లు ఆలయ స్థానాచార్యులు తెలిపారు.

నంది వాహనంపై ఊరేగిన స్వామిఅమ్మవార్లు..

మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలలో భాగంగా భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లు నంది  వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవమూర్తులను అక్కమహాదేవి మండపంలో వాహనంపై వేంచేపు చేయించి ప్రత్యేక పూజాదికాల అనంతరం గ్రామోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో ఏఈవోలు కృష్ణారెడ్డి, మల్లయ్య, మధుసూదన్ రెడ్డి, వెంకటేశ్వరావు, పీఆర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు.

శోభాయమానంగా మహా పుష్పపల్లకీ సేవ

శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్ల పుష్పపల్లకీ శోభాయమానంగా సాగింది. దాదాపు 500 కేజీల పైగా పూలు, 800 మీటర్లకు పైగా విడిమాలలు, పలురకాల 4500 విడి పూలను వినియోగించి పల్లకీని సిద్ధం చేశారు. గంగాధర మండపంనుంచి అంకాలమ్మ దేవాలయం మీదుగా బయలు వీరభద్రస్వామి ఆలయం వరకు ఉత్సవం జరిగింది.

శ్రీశైల దేవస్థానానికి లక్ష విరాళం

  భక్తుల సౌకర్యార్థ్దం శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకానికి  హైదరాబాద్ చెందిన శ్రీసాయి శ్రీధర్ కుటుంబసభ్యులు లక్ష రూపాయల విరాళాన్ని చెక్కు రూపంలో ఆలయ సూపరింటెండెంట్ వెంకటేశ్వరావుకు అందించారు.


logo