ఆదివారం 31 మే 2020
Nagarkurnool - Jan 14, 2020 , 03:38:44

స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దాలి

స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దాలి


కల్వకుర్తి రూరల్‌ : గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జనార్దన్‌రెడ్డి అన్నారు. సోమవారం కల్వకుర్తి మండలం మార్చాల, జిళ్లెల్ల గ్రామాల్లో పల్లె ప్రగతి  పనులను ఆయన పర్యవేక్షించారు.  ఈ సందర్భంగా ఆయా గ్రామాల సర్పంచ్‌లు మల్లయ్య, జంగయ్యలు ఆయనకు  స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలోని హరితహారంలో నాటిన మొక్కలను పరిశీలించారు. మొక్కల సంరక్షణ, నీటిని అందించే విధానం గ్రామ ప్రజాప్రతినిధులను, అధికారులను అడిగి తెలుసుకున్నారు. మొక్కలకు ట్రీ గార్డ్‌లు ఏర్పాటు చేసి సంరక్షించడం పట్ల ఆయన సంతృప్తి వ్యక్తంచేశారు. అనంతరం మార్చాలలో మొక్కను నాటి నీటిని పోశారు. అనంతరం జెడ్పీ ఉన్నత పాఠశాలను సందర్శించారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య, ఉపాధ్యాయులు, వసతులను, అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్‌, అదనపు గదులు ,ఫలితాల శాతం పరిశీలించారు. పాఠశాలలో విద్యార్థులు పాటించాల్సిన పది సూత్రాలను ఎందుకు అమలు చేయడం లేదని పాఠశాల హెచ్‌ఎంను ప్రశ్నించారు. దాతల సహకారంతో పాఠశాలను అభివృద్ధి చేసుకోవడం పట్ల ఆయన సంతోషం వ్యక్తంచేశారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయులు ఆయనను సత్కరించారు. గ్రామంలో నర్సరీ,  డంపింగ్‌ యార్డు, వైకుంఠధామాలను పరిశీలించిన అనంతరం గ్రామస్తులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన పల్లెప్రగతి కార్యక్రమం చాలా అద్భుతంగా ఉందని గ్రామస్తులు సమాధానమిచ్చారు.   అనంతరం జిళ్లెల్ల గ్రామంలో పర్యటించారు. కార్యక్రమంలో డీపీవో సురేశ్‌మోహన్‌, డీఈవో గోవిందరాజులు, ఏపీడీ గోవిందరాజు, గ్రామకార్యదర్శి లింగం, ప్రజాప్రతినిధులు  పాల్గొన్నారు.

పిల్లలతో సత్సంబంధాలు కలిగిఉండాలి

తల్లితండ్రులు తమ పిల్లలతో మంచి సంబంధాలు కలిగి ఉండాలని ప్రతి అంశాన్ని తమతో పంచుకునేలా ఉండాలని, అప్పుడే వారిలో ఆత్మైస్థెర్యం పెంపొంది ఉన్నతంగా ఎదుగుతారని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జనార్దన్‌రెడ్డి అన్నారు. సోమవారం కల్వకుర్తి పట్టణంలోని ఆక్షరవనంలో నిర్వహించిన ది ఆర్ట్‌ ఆఫ్‌ పేరెంటింగ్‌ ఐదు రోజుల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమ ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.  తల్లితండ్రులు తమ పిల్లల ఆసక్తి, సామర్థ్యం,పైపుణ్యం, లక్ష్యాలను గుర్తించి ప్రోత్సహించినట్లేతే వారు విజయం సాధిస్తారని అన్నారు. తల్లితండ్రులు తమ పిల్లల్లో విద్యతో పాటు విజ్ఞానం, విలువలు, నైపుణ్యం, మూర్తిమత్వ విలువలు నేర్పించగలిగితే వారు సమాజానికి మార్గదర్శకులుగా నిలుస్తారని అభిప్రాయపడ్డారు.  తల్లితండ్రులు తమ పిల్లలకు ప్రతి అంశంలో స్వేచ్ఛాయుత వాతావరణం కల్పించాలని వారి ఆసక్తులను బట్టి వారిని ప్రోత్సహించకుండా నిర్భంధంగా వారి పట్ల వ్యవహరించడం వల్ల వారిలో దాగి ఉన్న ప్రతిభ కనుమరుగై పోతుందని వివరించారు.  తల్లితండ్రులతో పేరెంటింగ్‌ కార్యక్రమం నిర్వహించడం పట్ల అక్షరవనం నిర్వాహకులు మాధవరెడ్డి, శ్రీపతిరెడ్డి, రవీందర్‌లను ఆయన అభినందించారు. ఈ సందర్భంగా పలువురు ప్రసగించారు.logo