శుక్రవారం 05 జూన్ 2020
Nagarkurnool - Jan 14, 2020 , 03:37:30

కోరిన కోరికలు తీర్చే రామలింగేశ్వరస్వామి

కోరిన కోరికలు తీర్చే రామలింగేశ్వరస్వామికోడేరు: మండల పరిధిలోని ఎత్తం గట్టుపై వెలసిన రామలింగేశ్వరస్వామి ఉత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి.  భక్తులు కోరిన కోరికలు తీర్చే మహిమగల దేవుడిగా ఎత్తం రామలింగేశ్వరస్వామి ప్రజలచే ప్రతి ఏటా  పూజలు అందుకుంటున్నాడు. కోడేరు మండలం ఎత్తం గ్రామ శివారులోని ఎత్తం గట్టుపై వెలసిన శ్రీరామలింగేశ్వరస్వామి ఉత్సవాలు ఈనెల14,15,16, తేదీలలో అత్యంత వైభవంగా జరుపనున్నారు.  ప్రతి సంవత్సరం సంక్రాంతి పర్వదినానికి వరుసగా మూడుసార్లు ఎత్తం గట్టు ఎక్కితే భక్తులు కోరుకున్న కోరికలు తీరుతాయని ఈప్రాంత ప్రజల నమ్మకం. సుమారు  450 ఏళ్ల కిందట జయలక్ష్మారెడ్డి అనే సంస్థానాధీశుడు  ఎత్తం గ్రామానికి సమీపంలో ఉన్న కల్వకోలులో నంది కోటను  నిర్మించి ఈప్రాంతాన్ని పరిపాలించేవారు. మిగతా తెలంగాణ సంస్థానాధీశులకు వైరిగా ఉండటంతో వారు ఇతన్ని హతమార్చారు. అతని మరణానంతరం పాన్‌గల్‌ ఖిల్లాను ఏలుతున్న  అల్లాఉద్దీన్‌ ఇదే అదునుగా తీసుకొని ఎత్తం కల్వకోలును స్వాధీనం చేసుకొని తన మిత్రుడైన కరణం నారాయణరావుకు ఈప్రాంతాన్ని భుక్తిగా ఇచ్చి సత్కరించారు. ఇతడు గొప్ప రామభక్తుడు కావడంతో ఎత్తం గ్రామానికి సమీపంలో ఉన్న అతి ఎత్తైన గట్టు శిఖరంపై శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారని పురవస్తువాఖ అధికారులు తెలుపుతున్నారు.
      
కొల్లాపూర్‌కు వెళ్లే ప్రధాన రహదారి పక్కన..ఎత్తం గ్రామ శివారులో సుమారు 2000అడుగుల ఎత్తులో గట్టుపై బండరాళ్లతో ఏర్పాటు చేసిన చిన్న గుడిలో వెలసిందే శ్రీ రామలింగేశ్వరస్వామి. ఇక్కడ లింగం రూపంలో ఉండి విష్ణువు నామాలు కళ్లు కిరీటం తదితర వెండి ఆభరణాలతో శివకేశవ స్వరూపంలో భక్తులకు దర్శనమిస్తారు.  ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ఘనంగా వేడుకలు జరుగుతాయి. గ్రామాల్లో సంక్రాంతి పండుగను ప్రజలు జరుపుకుంటే ఇతర ప్రాంతాలనుంచి పెద్ద సంఖ్యలో భోగి మరుసటి రోజున స్వామి వారికి తమ మొక్కులను చెల్లించుకునేందుకు కొండమీదికి భక్తులు వెళ్తారు. వందలాది మంది భక్తులు ఎత్తైన కొండపైకి ఒకరి వరుసలో ఒకరు బయలుదేరి ఎక్కుతారు. భక్తులు చీకటిలో చలిని సైతం లెక్క చేయకుండా జనవరి 14,  తేదీలలో రాళ్లు చెట్లు ముళ్లు రాతి గుహలు పెద్ద పెద్ద రాతి గుండ్లను దాటుతూ పైకి ఎలాంటి ప్రమాదం లేకుండా ఎక్కుతారు. ఈ క్షేత్రం మిక్కిలి మహిమ గలది కనుకనే పూర్వ రామభక్తులైన హనుమదాసు, వెంకటదాసులు స్వామిని దర్శించి స్వామిపై కీర్తనలు రచించారు. మకరసంక్రమణ  పణ్యకాలం పవిత్రమైనది కనుక ఇప్పటికీ స్వా  దర్శించి కానుకలు సమర్పిస్తారు. రాత్రి వేళల్లో కొండపై వెలిగించే మకర జ్యోతిని దర్శించటానికి ఈమూడు రోజులు భక్తులు అశేషంగా తరలివస్తారు.

నాగర్‌కర్నూల్‌కు 34 కిలోమీటర్ల దూరంలో

నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రానికి సుమారు 34 కిలోమీటర్ల దూరంలో ఎత్తం గట్టు ఉన్నది. కోడేరు మండలం కేంద్రం మీదుగా కొల్లాపూర్‌కు వెళ్లే ప్రధాన రహదారి పక్కన ఎత్తం గట్టు శిఖరంపై ఈ ఆలయాన్ని బండరాళ్లతో ఏర్పాటు చేశారు. అలాగే నియోజకవర్గ కేంద్రమైన  కొల్లాపూర్‌కు కేవలం 20 కిలో మీటర్ల దూరంలో, కోడేరు నుంచి కొల్లాపూర్‌ వెళ్లే రోడ్డుకు అతి సమీపంలో ఉంది. ప్రధాన రోడ్డునుంచి వ్యవసాయ పొలాలగుండా గట్టు వద్దకు చేరుకోవచ్చు.

మహిమాన్వితం..  క్షేత్రం

అచ్చంపేట రూరల్‌: పురాణ ప్రసిద్ధి గాంచిన శ్రీశైల క్షేత్రమునకు ఉత్తర ద్వారముగా ఉమాశక్తి పీఠంగా ఉమామహేశ్వర స్వామి దేవస్థానము ప్రసిద్ధిగాంచినది. శ్రీరాముడు రావణసుర వధానంతరము శ్రీశైల ప్రదక్షిణము క్షేత్రము నుంచే ప్రారంభించినట్లు శ్రీశైల పురాణము చెబుతుంది. ఉమామహేశ్వర క్షేత్రము పవిత్ర ప్రసిద్ధ క్షేత్రమైన రెండో శ్రీశైలముగా పిలవబడుతుంది.

భోగమహేశ్వరము

ఉమామహేశ్వరము కొండ కింద స్థలానికి భోగ మహేశ్వరము అని పేరు. పూర్వం యాత్రికులు కొండ పైకి వెళ్లి స్వామి వారిని దర్శించుకుని తిరిగి కొండ కిందకు వచ్చి వంటలు చేసుకునేవారు. అప్పుడు ఇక్కడ ఒక గ్రామము కూడా ఉన్నది. కానీ ప్రస్తుతం అరణ్యం తప్ప ఊరు కానరాదు. క్రీ.శ. 1280లో కరణం రామయ్య భోగమహేశ్వరములో కాకతీయ రుద్రమదేవి పేర చలమర్తి గండరుద్రేశ్వర ప్రతిష్ట చేశారు. అప్పుడాయన భార్యలు మల్లసాని అమరనాథ దేవర, చెన్న సోమనాథ దేవర, చెన్న మల్లనాథ, సోమేశ్వర దేవరల పేర 5గదులు నిర్మించి లింగ ప్రతిష్ఠ చేయించాడు. నేడు ఆ ద్వారాలు శిథిలావస్థకు చేరుకోవడంతో నూతన దేవలయ నిర్మాణం, విగ్రహాల (లింగాలు)ను ప్రతిష్ఠించేందుకు సిద్ధంగా ఉంది.

ఉమామహేశ్వరము-క్షేత్రాభివృద్ధి

శ్రీ ఉమామహేశ్వరము క్షేత్రాబివృద్ది నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట మండల పరిధిలోని రంగాపూర్‌ గ్రామ నివాసి మర్యాద గోపాల్‌రెడ్డి 1954 నుంచి నిరంతర కృషితో శిథిలావస్థ దశలో ఉన్న క్షేత్రమును నేడు దివ్య సుందర క్షేత్రముగా తీర్చిదిద్దడం జరిగింది. అదేవిధంగా 2014 తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం గా ఏర్పడినప్పటి నుంచి క్షేత్రం మరింత అభివృద్ధి చెందుతూ పలువురి నుంచి ప్రశంసలు పొందుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ శైవ క్షేత్రాల అభివృద్ది కోసం ప్రత్యేక దృష్టి పెట్టడంతో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చురుకుగా సాగుతున్నాయి. ఇప్పటికే భోగమహేశ్వరం నుండి ఉమామహేశ్వరం వరకు భక్తుల సౌకర్యార్థం నూతనంగా రాతి మెట్లు ఏర్పాటు చేశారు. భక్తులకు సెక్యూరిటీ గదులు, సేద తీరేందుకు ప్రత్యేక గదులు, మహిళలకు దుస్తులు మర్చుకునే గదులు మొదలైన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశారు.

నేటి నుంచి ఉత్సవాలు

ప్రతి ఏడాది జనవరి 15 నుంచి 22 వరకు ఈ ఉమామహేశ్వర క్షేత్రములో బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. 15 రాత్రికి 9 గ్రామాల నుండి ప్రభోత్సవము, పల్లకీసేవ 16తెల్లవారుజామున పార్వతీ పరమేశ్వరుల కల్యాణం, 17న ప్రాతరౌపాసన, బలిహరణము 18న కుంకుమార్చన, రుద్రాభిషేకము, హోమము 19న ధ్వజారోహణము, త్రిశూల స్నానం మొదలైన  పూజలను నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

ఎక్కడ ఉంది

ఉమామహేశ్వర క్షేత్రము నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట పట్టణం నుంచి 13 కిలో మీటర్ల దూరంలో కలదు. ఈ క్షేత్రమునకు రేపటి నుంచి ఉత్సవాలు పూర్తయ్యే వరకు అచ్చంపేట ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపిస్తున్నట్లు దేవస్థాన కార్యనిర్వహణ అధికారి శ్రీనివాస్‌రావు గుర్తు చేశారు.logo