గురువారం 04 జూన్ 2020
Nagarkurnool - Jan 12, 2020 , 03:13:26

యురేనియం సర్వేకు అనుమతులు లేవు

యురేనియం సర్వేకు అనుమతులు లేవు
  • -నల్లమల ప్రజలు వదంతులు నమ్మొద్దు
  • -అనుమతి లేకుండా ఒక్క వాహనం కూడా వెళ్లదు
  • -జెట్‌ విమానాలు..పైలెట్స్‌ శిక్షణ కోసం
  • -నల్లమలలో పర్యటించిన పిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ శోభ
  • -పాల్గొన్న ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజు

అచ్చంపేట రూరల్‌ : నల్లమల ప్రాంతంలో యురేనియం సర్వేకు, తవ్వకాలకు ఎలాంటి అనుమతులు లేవని ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటివ్‌ ఆఫ్‌ ఫారెస్టు (పీసీసీఎఫ్‌) శోభ అన్నారు. శనివారం మండల పరిధిలోని రంగాపూర్‌లో కొనసాగుతున్న పల్లె ప్రగతి పనులను ఆమె పరిశీలించి పంచాయతీ కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. యురేనియం సర్వే, తవ్వకాలకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం ఇది వరకే అసెంబ్లీ తీర్మాణం చేసిందని గుర్తు చేశారు. నల్లమలలో తిరుగుతున్న జెట్‌ విమానాలు పైలెట్స్‌ శిక్షణకు ఉపయోగిస్తున్నారని, అవి ఎక్కడైనా తిప్పుకోవచ్చని స్పష్టం చేశారు. వాటిని చూసి ప్రతి పక్ష పార్టీల నాయకులు కావాలని వదంతులు ప్రచారం చేస్తూ అచ్చంపేట, అమ్రాబాద్‌, పదర మండలాల ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నారని గుర్తు చేశారు. కావాలని ఆందోళనకారులు చేస్తున్న వదంతులను ఎవరూ నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన వైఖరి తెలియజేసినప్పటికీ ప్రతిపక్ష పార్టీల ప్రజలను పక్కదారి పట్టించడం సరైనది కాదన్నారు. అనుమతులు లేకుండా ఒక్క వాహనం కూడా అడవిలోకి వెళ్లేందుకు అవకాశం లేదని పేర్కొన్నారు.

యురేనియంపై ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే గువ్వల బాల్‌రాజు పదే పదే స్పష్టమైన వైఖరి తెలియజేస్తున్నా.. కావాలని రాద్దాంతం చేయడం ఆందోళనకారుల అవివేకానికి నిదర్శన మన్నారు. ఇప్పటికైనా నల్లమల, నియోజక వర్గ ప్రజలు ప్రభుత్వంపై నమ్మకంతో ఉండాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా గ్రామాల్లో నాటిన ప్రతి మొక్కనూ కంటికి రెప్పలా కాపాడుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతితో పల్లె ప్రజల్లో చైతన్యం వచ్చిందని పేర్కొన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్య పనులను నిరంతరం కొనసాగించాలని కోరారు. అనంతరం తడి, పొడి చెత్త డబ్బాలను అందజేశారు. కార్యక్రమంలో అటవీశాఖ ఎఫ్‌డీ అశోక్‌కుమార్‌ సిన్హా, జిల్లా అధికారి జోజి, ఎఫ్‌డీవోలు రాజశేఖర్‌, సుధాకర్‌, ఐటీడీఏ పీవో డాక్టర్‌ వెంకటయ్య, రైతు సమితి జిల్లా అధ్యక్షుడు మనోహర్‌, ఎంపీపీ శాంతాభాయి, సర్పంచ్‌ లోక్యా నాయక్‌, రైతు సమితి మండల అధ్యక్షుడు రాజేశ్వర్‌రెడ్డి, ఎంపీడీవో చెన్నమ్మ, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు రాజేందర్‌, మండల పార్టీ అధ్యక్షుడు నర్సింహ్మగౌడ్‌, దవాఖాన చైర్మన్‌ రహమతుల్లా ఉన్నారు.


logo