గురువారం 04 జూన్ 2020
Nagarkurnool - Jan 10, 2020 , 11:43:38

ఆశావహుల్లో ఉత్కంఠ

ఆశావహుల్లో ఉత్కంఠ

మహబూబ్‌నగర్ ప్రధాన ప్రతినిధి/నమస్తే తెలంగాణ : టీఆర్‌ఎస్ బీ ఫారాలు జిల్లా నేతలకు అందాయి. గురువారం హైదరాబాద్‌లోని టీఆర్‌ఎస్ భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డిలకు ముఖ్యమంత్రి కేసీఆర్ బీ ఫారాలను అందజేశారు. అయితే, నామినేషన్ల దాఖలుకు ఒక్క రోజే గడువు ఉండటంతో ఆశవహుల్లో ఉత్కంఠ నెలకొన్నది. జిల్లాలోని రెండు మున్సిపాలిటీల్లో ఉన్న 59 వార్డుల్లో పోటీ చేసేందుకు పలువురి మధ్య తీవ్ర పోటీ ఉంది. ఒక్కో వార్డు నుంచి ఐదు నుంచి పది మంది వరకు టీఆర్‌ఎస్ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో వార్డుల వారీగా అభ్యర్థులను ఎంపిక చేయడం పార్టీ నేతలకు తలనొప్పిగా మారింది. ఆశావహులు వారి వారి మార్గాల్లో బీ ఫారాలు దక్కించుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఎమ్మెల్యేలు, పార్టీ నాయకుల ఆశీస్సులతో టికెట్లు సాధించుకుంటే గెలుపు తథ్యమన్న ధీమా ఉండటంతో ఆశావహులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అయితే, మహబూబ్‌నగర్, భూత్పూర్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థులంతా ఘన విజయం సా ధించాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు పార్టీ నేతలు తెలిపా రు. గెలుపు గుర్రాలకే టిక్కెట్లు ఇవ్వాలని సూచించారని పేర్కొన్నారు. పార్టీలో కొత్త, పాత తేడా లేకుండా అందరి సేవలు వినియోగించుకునాలని సీఎం ఆదేశించారని తెలిపారు. చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ప్రజల వద్దకు వెళ్లాలని ముఖ్యమంత్రి తెలిపారన్నారు. కాగా, రెండు మున్సిపాలిటీల పరిధిలో శుక్రవారం కౌన్సిలర్ అభ్యర్థులు అట్టహాసంగా నామినేషన్లు దాఖలు చేయనున్నారు. నామినేషన్ల దాఖలు సందర్భంగా మహబూబ్‌నగర్‌లో మంత్రి, భూత్పూర్‌లో ఎమ్మెల్యే ఆల పాల్గొననున్నారు. నేటి నామినేషన్ల కార్యక్రమానికి పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరు కానున్నారు.


logo