గురువారం 28 మే 2020
Nagarkurnool - Jan 10, 2020 , 11:42:03

నేరాలపై నిఘా ఉంచాలి

నేరాలపై నిఘా ఉంచాలి

మహబూబ్‌నగర్ క్రైం : నేరాల నివారణపై నిఘా పెంచాలని వెస్ట్‌జోన్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ స్టీఫెన్ రవీంద్ర ఐపీఎస్ అన్నారు. జిల్లా కేంద్రంలోని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌ను గురువారం ఆయన సందర్శించారు. ముందుగా జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి పుష్పగుచ్చం అందించి స్టీఫెన్ రవీంద్రకు స్వాగతం పలికారు. అనంతరం సాయుధ బలగాలతో గౌరవ వందనం స్వీకరించిన అనంతరం పోలీస్‌స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. రాష్ట్ర డీజీపీ నూతనంగా ఆవిష్కరించిన పోలీస్ స్టేషన్ నిర్వహణ విధానాన్ని అమలు చేస్తున్న తీరు, కోర్టు వారెన్స్, బ్లూ కోల్ట్స్, స్టేషన్ రైటర్, రెసెప్షన్ వంటి వేర్వేరు విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం ఐజీపీ స్టీఫెన్ రవీంద్ర మాట్లాడుతూ అధికారులు, కిందిస్థాయి సిబ్బంది సమన్వయం తో పని చేస్తేనే పోలీసులకు కీర్తి లభిస్తుందన్నారు. పోలీస్ శాఖ నూతన టెక్నాలజీ పట్ల పూర్తి అవగాహన ఉండాలన్నారు. సంఘ వ్యతిరేక కార్యకలాపాలపై గట్టి నిఘా ఉంచాలని తెలిపా రు. నేర నివారణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. జిల్లాలో నిర్వహిస్తున్న పోలీస్ ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహణపై ఐజీపీ అభినందనలు తెలిపారు. గ్రామ పోలీస్ అధికారులు, బ్లూ కోట్స్ బృందాలు, షీ పోలీసుల వల్ల పోలీస్ శాఖకు వి స్తృతమైన సమాచారం అందుతుందని, సకాలంలో స్పం దించి నేరాలను అదుపు చేయాలన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా సంఘ వ్యతిరేక శక్తులు, కొత్త వ్యక్తుల కదలికలు, పాత నేరగాళ్లపై నిఘా ఉంచాలన్నారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో మరింత జాగ్రత్త తీసుకోవాలని తెలిపారు. ఈ ఏడాదిలో ప్రధానంగా రోడ్డు ప్రమాదాలు, మహిళల భద్రత, సంరక్షణ అంశాలపై మరింత శ్రద్ధతో కృషి చేయాలని కోరారు. బహిరంగంగా మద్యం తాగే వారిపై, మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై కఠినంగా వ్యవహరించి కేసులు నమోదు చేయాలన్నారు. డయల్ 100పై అవగాహన కార్యక్రమాలు నిరంతరం నిర్వహించాలని సూచించారు. ఈ సందర్భంగా ఉత్తమంగా విధులు నిర్వహించిన సిబ్బందికి ఆయన నగదు రివార్డులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. అనంతరం పోలీస్‌స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఏఎస్పీ ఎన్ వెంకటేశ్వర్లు, డీ ఎస్పీలు శ్రీధర్, తివారి, సైదులు, వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ రాజేశ్వర్ ఉన్నారు.


logo