e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 25, 2021
Home జనగాం ఖైదీల కుశలమడిగి..

ఖైదీల కుశలమడిగి..

ఖైదీల కుశలమడిగి..

కేంద్ర కారాగారంలో కలియదిరిగిన సీఎం
ముద్దాయిలతో మాట్లాడి బాగోగులు తెలుసుకున్న కేసీఆర్‌
నర్సరీ నిర్వహణ, ఉత్పత్తులపై ప్రశంసలు
కారాగారాన్ని సందర్శించి ఖైదీలతో ముచ్చటించిన ఏకైక ముఖ్యమంత్రి

పోచమ్మమైదాన్‌, మే 21: వరంగల్‌ కేంద్ర కారాగారాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ శుక్రవారం పరిశీలించారు. జైలు ఆవరణ, లోపల కలియదిరిగారు. దాదాపు అరగంట పాటు జైలు అధికారులు, ఖైదీలతో ముచ్చటిస్తూ వారి బాగోగులు తెలుసుకున్నారు. వందేళ్లు దాటిన కారాగారాన్ని ఇక్కడి నుంచి తరలించి, ఈ ప్రదేశంలో ఆధునాతన సూపర్‌ స్పెషాలిటీ దవాఖాన ఏర్పాటుపై తీసుకోవాల్సిన చర్యలపై త్వరలో నిపుణుల కమిటీని పంపిస్తామని అధికారులకు సీఎం వివరించారు. దాదాపు కిలోమీటరున్నర ఆవరణను తిరిగి క్షుణ్ణంగా పరిశీలించారు. జైలు పక్కనే ఉన్న కేఎంసీ, కాళోజీ యూనివర్సిటీ కొత్త భవనం నిర్మాణంతో పాటు ఇంకా దాదాపు 20 ఎకరాల స్థలం ఖాళీగా ఉన్నట్లు తెలుసుకున్నారు. జైలు ఆవరణలో ఉన్న నర్సరీ, వ్యవసాయ క్షేత్రంలో ఉత్పత్తులపై ఆరా తీసి అధికారులు, ఖైదీలను ప్రశంసించారు. సత్ప్రవర్తన కలిగిన ఖైదీలు తయారు చేస్తున్న స్టీల్‌, చేనేత ఉత్పత్తులను నేరుగా చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఖైదీలుగా ఉన్నా తమ నైపుణ్యంతో ప్రజలకు ఉపయోగపడే వాటిని అందుబాటులోకి తేవడం అభినందనీయమని కొనియాడారు. రైతు వేదికల కోసం ఖైదీలు తయారు చేస్తున్న కుర్చీలు, అల్మారాలను చూసి ప్రశంసించారు. జైలు లోపల దర్రీ, ఫినాయిల్‌, స్టీల్‌, ప్రింటింగ్‌ ప్రెస్‌ యూనిట్‌ చేనేత వస్ర్తాలు, స్టీల్‌ ఫర్నిచర్‌ను పరిశీలించారు. ఖైదీలకు అందుతున్న వైద్య, విద్య, సంక్షేమ కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. కొవిడ్‌ నివారణలో భాగంగా తయారుచేస్తున్న మాస్కులు, శానిటైజర్‌ను పరిశీలించి, జైలు అధికారులు, ఖైదీలను ప్రశంసించారు.
జైలును సందర్శించి తొలి సీఎం
వరంగల్‌ సెంట్రల్‌ జైలును సందర్శించిన తొలి ముఖ్యమంత్రి కేసీఆరే కావడం గమనార్హం. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ముఖ్యమంత్రి హోదాలో ఎవ్వరూ కేంద్ర కారాగారాన్ని సందర్శించిన దాఖలాలు లేవు. సీఎం హోదాలో కేసీఆర్‌ జైలును సందర్శించడం ఒకెత్తయితే ఏకంగా ఖైదీలతో ముచ్చటించడం మరో ఎత్తు. ముఖ్యమంత్రి ఇలా ఖైదీలతో మాట్లాడి వారి యోగక్షేమాలు తెలుసుకోవడం మొదటిసారి అని జైలు సిబ్బంది చెబుతున్నారు. సెంట్రల్‌ జైలులో సుమారు అరగంట పాటు గడిపిన ముఖ్యమంత్రి, 20 నిమిషాల పాటు జైలు లోపల గడిపారు. లోపల ఆవరణను కిలోమీటరున్నర(ఒక రౌండ్‌)మేర ఆయన కాన్వాయ్‌ ద్వారా తిరిగారు. అనంతరం ఖైదీలతో మాట్లాడారు. జైలు లోపల నర్సరీ, పరిశ్రమలను పరిశీలించారు. ఖైదీలు తయారు చేసిన వస్ర్తాలు, జంపఖానాలను పరిశీలించి, వారి పనితనాన్ని మెచ్చుకున్నారు. క్షమాభిక్ష ప్రసాదించాలన్న ఖైదీల మొరను ఆలకించారు. ముఖ్యమంత్రితో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌, ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌, మేయర్‌ గుండు సుధారాణి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, జైళ్లశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రవిగుప్తా, ఐజీ బచ్చు సైదయ్య, డీఐజీ రాజేశ్‌, సీపీ తరుణ్‌ జోషి, కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు, జైలు సూపరింటెండెంట్‌ సంతోష్‌కుమార్‌ రాయ్‌, డిప్యూటీ సూపరింటెండెంట్లు భరత్‌కుమార్‌, అమరావతి, డాక్టర్‌ చందు, డాక్టర్‌ సింధూజ, డాక్టర్‌ శ్రీనివాస్‌ తదితరులు ఉన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఖైదీల కుశలమడిగి..

ట్రెండింగ్‌

Advertisement