వానకాలానికి అందుబాటులో విత్తనాలు
స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక రకాలు
ఆలస్యంగా నాటేస్తే చీడపీడలు వాటిల్లే ప్రమాదం
వరంగల్ సబర్బన్, జూన్ 4 : నాణ్యమైన విత్తనాలను ఎంచుకుని సాగుచేస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని వ్యవసాయ పరిశోధనా స్థానం ఏడీఆర్ డాక్టర్ ఆర్ ఉమారెడ్డి తెలిపారు. దీర్ఘకాలిక (150రోజులు) రకాలను సాగు చేస్తే నీరు, విద్యుత్ వాడకం అధికమవుతుందని సూచిస్తున్నారు. దీర్ఘకాలిక రకాలను జూన్ చివరి మాసంలో నార్లు పోసి 30 రోజుల్లోపు నాటు వేసుకోవాలని, ఆలస్యంగా నాటు వేస్తే చీడ పీడలు వాటిల్లే ప్రమాదముందని సూచించారు. అవకాశం ఉంటే నేరుగా విత్తే పద్ధతి మంచిదని చెబుతున్నారు.
అనువైన రకాలు సిద్ధి (డబ్ల్యూజీఎల్-44)
పంటకాలం 140 రోజులు. ఎకరాకు 30 క్వింటాళ్ల దాకా దిగుబడి వస్తుంది. ఉల్లికోడును తట్టుకుంటుంది. అన్నం నాణ్యత బాగుంటుంది. సాంబమసూరికి ప్రత్యామ్నాయంగా సాగు చేసుకోవచ్చు.
వరంగల్ సాంబ (డబ్ల్యూజీఎల్-14)
పంట కాలం 140 రోజులు. 30 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఉల్లికోడును కొంత వరకు తట్టుకుంటుంది. అన్నం నాణ్యత బాగుంటుంది.
వరంగల్ సన్నాలు (డబ్ల్యూజీఎల్ 32100)
పంట కాలం 135 రోజులు. ఎకరాకు 30 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. అన్నం నాణ్యత బాగుంటుంది.
తెలంగాణ సోనా (ఆర్ఎన్ఆర్ 15048)
పంట కాలం 125-30 రోజులు. 28 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. అధిక మార్పిడి శాతం ఉంటుంది. ఆలస్యంగా నార్లు పోసేందుకు అనుకూలం. అగ్గి తెగులును తట్టుకుంటుంది. ైగ్లెసిమిక్ ఇండెక్స్ తక్కువ.
సోమ్నాథ్ (డబ్ల్యూజీఎల్ 347)
పంట కాలం 135 రోజులు. 28 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఉల్లికోడును తట్టుకుంటుంది.
సాంబమసూరి (బీపీటీ 5204)
150రోజుల్లో చేతికొస్తుంది. 28 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. పొట్టిరకం, అన్నం నాణ్యత చాలా బాగుంటుంది. చీడపీడలను తట్టుకునే శక్తి లేదు. ముదురు నారు నాటేందుకు అనుకూలం.
జై శ్రీరామ్ : పంటకాలం 135-140 రోజులు. 24 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఎక్కువ సన్నగింజ కలిగి అన్నం నాణ్యత బాగుంటుంది.
కూనారం (కేఎన్ఎం 118)
పంట కాలం 120 రోజులు. 30 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. సుడిదోమ, అగ్గి తెగులును కొంత వరకు తట్టుకుంటుంది.
విజేత (ఎంటీయూ 1001)
పంట కాలం 135 రోజులు. 30 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. సుడిదోమ, అగ్గితెగులును తట్టుకుంటుంది. అధిక దిగుబడినిచ్చే ముతక రకం.
జగిత్యాల రైస్ -1 (జేజీఎల్ 24423)
పంట కాలం 125 రోజులు. 32 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. సుడిదోమ, అగ్గితెగులును కొంత వరకు తట్టుకుంటుంది. చలి, చీడను కూడా తట్టుకుంటుంది. గింజ రాలే గుణం లేదు.
కాటన్ దొర సన్నాలు (ఎంటీయూ1010
పంట కాలం 120 రోజులు. 30 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. సుడిదోమ, అగ్గి తెగులును కొంత వరకు తట్టుకుంటుంది.
వరంగల్ రైస్-1 (డబ్ల్యూజీఎల్ 915)
పంట కాలం 135 రోజులు. 30 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. సుడిదోమ, అగ్గితెగులు, ఎండాకు తెగులును కొంతవరకు తట్టుకుంటుంది. అటుకులు, పేలాలకు అనుకూల రకం.
బతుకమ్మ (జేజీఎల్ 18049)
పంట కాలం 120 రోజులు. 30 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. సుడిదోమ, అగ్గితెగులును కొంత వరకు తట్టుకుంటుంది.