వనదేవతల జాతరకు వేళాయె..

- రేపటి నుంచి ‘మినీ మేడారం’
- నాలుగు రోజుల పాటు ఉత్సవాలు
- భక్తుల కోసం సకల సౌకర్యాలు
- అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు
మేడారం మినీ జాతరకు వేళయ్యింది. రేపటి నుంచి మూడు రోజుల పాటు సాగే ఉత్సవాలు వైభవంగా సాగనుండగా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లుచేసింది. వరాలిచ్చే దేవతలు, ఆదివాసీ గిరిజన దైవాలు, కోరిన కోర్కెలు తీర్చే సమ్మక్క-సారలమ్మల దర్శనం కోసం వివిధ ప్రాంతాల నుంచి లక్షలాదిగా భక్తులు తరలిరానున్నారు. తాగునీటి కోసం మినీ ట్యాంకులు, స్నానాల కోసం షవర్లు, వైద్య సదుపాయం, విద్యుత్ సరఫరా కోసం 18 ట్రాన్ఫ్‌ఫార్మర్లు, నిత్యం పర్యవేక్షించేందుకు 40 సీసీ కెమెరాలు ఏర్పాటుచేశారు.
- తాడ్వాయి, ఫిబ్రవరి 22
జాతరకు సుమారు 4నుంచి 5లక్షల మంది భక్తులు వస్తారనే అంచనా మేరకు ఇటు ములుగు జిల్లా కలెక్టర్‌తో పాటు ఐటీడీఏ పీఓలు ప్రణాళిక ప్రకారం పనులు చేయించారు.
రూ.18లక్షలతో ఆర్డబ్ల్యూఎస్ పనులు
భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు ఆర్‌డబ్ల్యూఎస్‌శాఖ అధికారులు పనులు చేపట్టారు. గత మహాజాతరలో భాగంగా మూడు వాటర్ ట్యాంకుల నిర్మించగా ఇప్పుడు వాటిని వినియోగంలోకి తీసుకురానున్నారు. జాతర పరిసరాలలో తాగునీటిని అందిచేందుకు గద్దెల పరిసరాలు, చిలుకలగుట్ట, ఆర్టీసీ బస్టాండ్, జంపన్నవాగు తదితర ప్రాంతాల్లోని మినీ వాటర్ ట్యాంకులకు, బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్‌కు పైప్లైన్ల కనెక్షన్లను ఏర్పాటు చేసి నీటిని సరఫరా చేస్తున్నారు.
పుణ్యస్నానాల కోసం షవర్లు
వనదేవతల దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడు జంపన్నవాగులోని నీటితో పుణ్యస్నానం చేసేందుకు ఆసక్తి చూపుతారు. భక్తుల కోసం జంట వంతెనల వద్ద ఉన్న స్నానఘట్టాలపై రెండు వైపులా ఒక్కో ట్యాప్‌కు 32 నల్లాలను బిగించి మొత్తం 32 బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్‌ను ఏర్పాటు చేశారు. మహిళలు దుస్తులు మార్చుకునేందుకు గాను 6లక్షల 50వేలతో రేకుల గదులను సిద్ధంచేశారు.
భక్తులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు
ఎస్పీ సంగ్రామ్‌సింగ్ జీ పాటిల్.. జాతర ఏర్పాట్ల పరీశీలన
మినీ జాతర సందర్భంగా దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టామని ఎస్పీ సంగ్రామ్‌సింగ్ జీ పాటిల్ అన్నారు. సోమవారం ఐటీడీఏ పీఓ హన్మంతు కే జండగే, ఏఎస్పీలు సాయిచైతన్య, గౌస్ ఆలంతో కలిసి మేడారంలో పర్యటించారు. మొదట జంపన్నవాగు వద్ద ప్రమాదాలు జరుగకుండా చేసిన ఏర్పాట్లను పరీశీలించారు. చిలకలగుట్ట వద్ద ఏర్పాటుచేసిన పార్కింగ్ స్థలానికి భక్తులు ఎక్కువగా వస్తే తీసుకోవాల్సిన చర్యలను అధికారులకు సూ చించారు. అనంతరం గద్దెల ప్రాంగణానికి వెళ్లి భక్తులు వచ్చిపో యే మార్గాలను పరిశీలించారు. మినీ జాతరలో గద్దెల చుట్టూ ఉన్న గ్రిల్స్‌ను మూసేసి దర్శనం కల్పించాలని సూచించారు. రోడ్లపై ఎక్కడా వాహనాలు నిలుపకుండా చూడాలని, అదే సమయంలో దూరంలో వాహనాలను నిలిపి భక్తులకు ఇబ్బం దులు కలగనివ్వద్దని చెప్పారు. గద్దెల వద్ద ఏర్పాట్లను జాతర కార్యనిర్వాహక అధికారి రాజేంద్రాన్ని అడిగి తెలుసుకున్నారు.
‘స్వచ్ఛ మేడారం’గా మార్చేందుకు..
మినీ జాతరతో మేడారంలో వాతావరణ కాలుష్యం కాకుండా చర్యలు తీసుకుంటున్నారు. స్వచ్ఛ మేడారం కోసం పంచాయతీ అధికారులు రూ.18లక్షలతో పనులు చేపడుతున్నారు. జాతర ముందునుంచే పరిసరాల్లో ఎక్కడా చెత్త కనిపించకుండా సుమారు 200మంది పారిశుధ్య కార్మికులతో ఎప్పటికప్పుడు చెత్త తీయిస్తున్నారు. ముందస్తుగా మొక్కులు చెల్లించేందుకు భక్తులు తరలివస్తుండడంతో పనులు ముమ్మరం చేశారు.
40 సీసీ కెమెరాలతో నిరంతర నిఘా
జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పోలీసు శాఖ పకడ్బందీ చర్యలు చేపడుతోంది. ఇందుకోసం జనసంచారం ఎక్కువగా ఉండే చిలుకలగుట్ట, జంపన్నవాగు, గద్దెల పరిసరాలు, హరితహోటల్ ఇలా 18 ప్రాంతాల్లో 40 సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేస్తున్నారు. అలాగే 200మంది సిబ్బంది విధుల్లో ఉంటారని అధికారులు తెలిపారు.
భక్తుల కోసం తాత్కాలిక వైద్యశాల
భక్తుల కోసం వైద్య శాఖ అధికారులు అన్ని చర్యలు తీసుకుంటోంది. మేడారంలోని టీటీడీ కల్యాణ మండపంలో వైద్య శిబిరం ఏర్పాటుచేశారు. అక్కడే ఎనిమిది పడకల సామర్థ్యమున్న వైద్యశాలలో సేవలందిస్తోంది. కరోనా వైరస్ కారణంగా శానిటైజర్, మాస్కులు ధరించేలా భక్తులకు పలు సూచనలు చేస్తున్నారు.
పార్కింగ్ స్థలాలు
అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు ఎక్కువగా ప్రైవేట్ వాహనాల్లో తరలివస్తారు. వాహనాలను గద్దెలకు సమీపంలోకి వచ్చేలా పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు. హరిత హోటల్, చిలుకలగుట్ట, ఆదివాసీ మ్యూజియం తదితర ప్రాంతాల్లో ఇవి ఉన్నాయి. భక్తులు వారి వాహనాలను అక్కడ పార్క్ చేసి కేవలం 200 మీటర్ల దూరం నడిచి వెళ్లి అమ్మవార్లను దర్శించుకోవచ్చు.
విద్యుత్ కోసం 10 ట్రాన్స్ఫార్మర్లు
మినీ జాతరలో విద్యుత్‌శాఖది కీలక పాత్ర. మేడారం పరిసరాలతో పాటు గద్దెలు, జనసమ్మర్దం ఉండే ప్రాంతాలకు విద్యుత్ సరఫరా చేసేందుకు చర్యలు చేపట్టారు. 10 కొత్త ట్రాన్స్ఫార్మర్లతో పాటు మరో 8 పాతవి ఏర్పాటు చేశారు. పనులు పూర్తి కావడంతో ఆదివారం నుంచి సరఫరాను ప్రారంభించారు. జాతర జరిగే నాలుగు రోజుల పాటు ఎక్కడా అంతరాయం కలుగకుండా జాగ్రత్త పడుతున్నారు.
రూ.25లక్షలతో రహదారులకు మరమ్మతులు
ఐటీడీఏ ఆధ్వర్యంలో రోడ్ల మరమ్మతులకు సుమారు రూ.25లక్షలను కేటాయించారు. ఇందులో భాగంగా ఐలాపురం, కన్నెపల్లి, బయ్యక్కపేట, మేడారం తదితర ప్రాంతాల్లో పనులు చివరిదశకు వచ్చాయి. అలాగే భక్తులు విశ్రాంతి శాలలను అందుబాటులోకి తీసుకొచ్చారు.
భక్తులకు అసౌకర్యం కలుగకుండా..
భక్తులకు అసౌకర్యం కలుగకుండా దేవాదాయశాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. గద్దెల వద్ద తడకలతో చలువ పందిళ్లు వేశారు. క్యూలైన్లలో తాగునీటిని అందించేలా ఏర్పాట్లు చేశారు. భక్తులు అమ్మవార్లను సులువుగా దర్శనం చేసుకుని వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని జాతర కార్యనిర్వాహక అధికారి రాజేంద్రం తెలిపారు.
బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ ప్రారంభం
జంపన్నవాగు ఒడ్డున ఉన్న స్నాన ఘట్టాల వద్ద ఏర్పాటుచేసిన బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్‌ను సోమవారం ఎస్ఈ సుధీర్ ప్రారంభించారు. అమ్మవార్ల మినీ జాతర సందర్భంగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేందుకు ఇరిగేషన్ శాఖ అధికారులు జంట వెంతెనలకు ఇరువైపులా 20 ట్యాప్స్‌ను బిగించారు. పైప్‌లైన్ కనెక్షన్లు ఇవ్వడంతో వీటిని అందుబాటులోకి తీసుకొచ్చారు.
రేపటి నుంచి ‘మినీ మేడారం’
- నాలుగు రోజుల పాటు ఉత్సవాలు
- భక్తుల కోసం సకల సౌకర్యాలు
- అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు
- తాగునీటి కోసం ట్యాంకులు, స్నానాల కోసం షవర్లు
- విద్యుత్ కోసం 10 ట్రాన్స్ఫార్మర్లు
- 40 సీసీ కెమెరాలతో నిరంతర నిఘా
తాజావార్తలు
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్.. ఫోటోలు ఇలా డిలిట్
- పెట్టుబడిదారులకు లిటిల్ సీజర్స్ న్యూ బిజినెస్ ప్రపోజల్
- భారత్‌పై సైబర్ దాడుల వార్తలు నిరాధారం:చైనా
- అక్షరమై మెరిసెన్..సయ్యద్ అఫ్రీన్!
- ఆరోగ్యానికి..ప్రకృతి సూత్రం
- సేవలను విస్తరించిన సెటిల్
- రోబో-జోజో.. ఫ్రెండ్స్!
- కార్న్ దోశ
- మహారాష్ట్రలో పది వేలకు చేరిన కరోనా కేసుల నమోదు
- శశికళ సంచలన నిర్ణయం..