ఎక్కడా ఇబ్బందులు రావద్దు

- మేడారం మినీ జాతరకు సకలం సిద్ధం చేయండి
- భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగొద్దు
- జంపన్నవాగులో ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టండి
- తాగునీటి సమస్యలు తలెత్తకుండా చూడండి
- మరుగుదొడ్లకు నిత్యం నీటి సరఫరా చేయాలి
- రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్
- జాతరపై అధికారులతో సమీక్ష
- గిరిజన యూనివర్సిటీ స్థలం పరిశీలన
తాడ్వాయి, జనవరి 21 : ఫిబ్రవరి 24 నుంచి 27వ తేదీ వరకు జరిగే మేడారం సమ్మక్క-సారలమ్మ మినీ జాతరకు ఏర్పాట్లు చేపట్టాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు. మేడారం ఐటీడీఏ క్యాంపు కార్యాలయంలో గురువారం మినీ జాతర ఏర్పాట్లపై పలు శాఖల అధికారులతో ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మహాజాతర తర్వాత కరోనా వైరస్ రాష్ట్రంలోకి వచ్చింది. మినీ జాతర తర్వాత ఖతమవుతుందన్నారు. తల్లులను దర్శించుకునేందుకు వచ్చే భక్తులు జంపన్న వాగులో పుణ్య స్నానాలు ఆచరిస్తారు. వాగులో ప్రమాదాలు జరుగకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఎక్కువ లోతుకు వెళ్లకుండా కంచెలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రమాదాలకు కారణమైన చెక్‌డ్యాంలను తొలిగించాలా ? లేక ప్రమాదాలు జరుగకుండా చర్యలు చేపట్టాలా? అనే అంశాలపై నివేదికలు అందజేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. మరుగుదొడ్లకు నిరంతరం నీరు సరఫరా జరిగేలా చూడాలన్నారు. జాతరలో మిషన్ భగీరథ నీరు అందేలా చూడాలన్నారు. పారిశుధ్య సమస్యలు ఎదురవకుండా సిబ్బందిని నియమించుకోవాలన్నారు.
భక్తులు మాస్క్ ధరించేలా చూడాలని డీపీవో వెంకయ్యకు సూచించారు. ఇతర రాష్ర్టాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నందున బస్ సౌకర్యం కల్పించాలన్నారు. అంతకు ముందు అమ్మవార్ల దర్శనానికి వచ్చిన మంత్రికి పూజారులు, దేవాదాయశాఖ అధికారులు డోలు వాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. గద్దెలపై పసుపు, కుంకుమ, బంగారం, నూతన వస్ర్తాలను సమర్పించి గిరిజన సంప్రదాయ పద్ధతుల్లో అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. మంత్రి వెంట జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్, కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఐటీడీఏ పీవో హన్మంతు కే జండగే, అడిషనల్ కలెక్టర్ ఆదర్శ్‌సురభి, ఏఎస్పీ సాయిచైతన్య, ఆర్డీవో రమాదేవి, జడ్పీ సీఈవో ప్రసూనా రాణి, జాతర కార్యనిర్వహణాధికారి రాజేంద్రం, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
తరగతులు ప్రారంభించాలి
ములుగురూరల్, జనవరి 21 : గిరిజన యూనివర్సిటీలో తరగతులు ప్రారంభించాలని మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. గురువారం ములుగు జిల్లా పర్యటనలో భాగంగా ముందుగా మల్లంపల్లిలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాన్ని జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్‌తో కలిసి ప్రారంభించారు. అక్కడి నుంచి జాకారం యూత్ ట్రైనింగ్ సెంటర్(వైటీసీ)ను ఎమ్మెల్యే సీతక్క, జడ్పీ చైర్మన్‌తో కలిసి సందర్శించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఎస్. కృష్ణ ఆదిత్య, ఐటీడీఏ పీవో హన్మంత్ జండగే, అదనపు కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి గిరిజన యూనివర్సిటీకి కేటాయించిన స్థలాల వివరాలు, వైటీసీలో ఏర్పాటు చేయనున్న తరగతి గదుల వివరాలపై చర్చించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఆంధ్ర రాష్ట్రంలో భూ సేకరణ చేయకుండానే గిరిజన యూనివర్సిటీ తరగతులను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. తెలంగాణలో యూనివర్సిటీ ఏర్పాటుకు అన్ని వసతులు ఉన్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. యూనివర్సిటీ ఏర్పాటుకు 116 ఎకరాల అసైన్డ్, 50 ఎకరాల అటవీ, 169 ఎకరాల ప్రభుత్వ భూమి ఇస్తామని రాష్ట్ర ప్రభు త్వం చెప్పినట్లు ఆమె వివరించారు. తాత్కాలికంగా తరగతుల నిర్వహణకు జాకారం యూత్ ట్రైనింగ్ సెంటర్ (వైటీసీ) బిల్డింగ్‌ను సిద్ధం చేశామన్నారు. రైతులకు పరిహారం చెల్లించడానికి రూ. 15 కోట్లు ఐటీడీఏ పీవో అకౌంట్లో ప్రభుత్వం జమ చేసి ఏడాది అయిందని తెలిపారు. యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని కేంద్రానికి ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. పార్లమెంట్ సమావేశాల్లో ఈ అంశంపై చర్చించనున్నట్లు తెలిపారు. అనంతరం జాకారం నుంచి గట్టమ్మ వద్దకు చేరుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అదేవిధంగా జిల్లా కేంద్రంలోని వ్యాక్సినేషన్ కేంద్రాన్ని పరిశీలించారు. ఆమె వెంట ఎంపీపీ గండ్రకోట శ్రీదేవి, జడ్పీటీసీ సకినాల భవాని, జడ్పీ సీఈవో ప్రసూనరాణి, డీఆర్వో కూతాటి రమాదేవి, డీఆర్డీఏ పీడీ పారిజాతం, డీటీడీవో ఎర్రయ్య, మల్లంపల్లి సర్పంచ్ చంద కుమారస్వామి, ఎంపీటీసీలు పోరిక విజయ్‌రాంనాయక్, మాచర్ల ప్రభాకర్ ఉన్నారు.
తాజావార్తలు
- మతసామరస్యానికి ప్రతీకగా ఉర్సు
- పాలమూరు కోడలిని ఆశీర్వదించండి
- ‘ప్రగతి’ పనుల్లో జిల్లా ముందుండాలి
- విరాట్ @100 మిలియన్ల ఫాలోవర్స్
- బెంగాల్ మంత్రుల కోడ్ ఉల్లంఘన: ఈసీకి బీజేపీ లేఖ
- బెంగాల్ పొత్తులు నెహ్రూ-గాంధీ సిద్ధాంతాలకు వ్యతిరేకం
- ఎన్ఎస్ఈలో లోపం అనూహ్యం.. బట్!
- ‘సత్యం’ ఫిక్స్డ్ డిపాజిట్లపై ఈడీ పిటిషన్ డిస్మిస్: టెక్ మహీంద్రా
- బావిలోపడి ఇద్దరు చిన్నారులు మృతి
- స్పెక్ట్రం వేలం: తొలి రోజే రూ.77 వేల కోట్ల బిడ్లు!