వరంగల్‌కు విదేశీయుల వరుస..

- ప్రపంచ పర్యాటకులకు కేరాఫ్‌గా ఓరుగల్లు
- రోజురోజుకూ పెరుగుతున్న టూరిస్టుల సంఖ్య
- ఆకర్షిస్తున్న రామప్ప, లక్నవరం, వేయిస్తంభాల గుడి, వరంగల్ కోట, మేడారం జాతర
- ఫారినర్లను ఆకట్టుకుంటున్న ఓరుగల్లు శిల్ప కళా సౌందర్యం
- రాష్ట్రంలోనే రెండో స్థానంలో వరంగల్
- పుణ్యక్షేత్రాలతో పాటు ప్రకృతి అందాలకు నెలవు
చారిత్రకంగా, పర్యాటకంగా విశ్వవిఖ్యాతి గాంచిన ఓరుగల్లు.. విదేశీయులను ఆకర్షించడంలో ముందువరుసలో ఉంది. అద్భుతమైన శిల్పసౌందర్యంతో ఉండే రామప్ప, వేయిస్తంభాల గుడి, ప్రకృతి సోయగాల నడుమ అందమైన లక్నవరం సరస్సు, కాకతీయుల వైభవానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచే వరంగల్ కోట, అలాగే ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరైన మేడారం సమ్మక్క-సారలమ్మ.. ఇంకా అనేక దర్శనీయ ప్రాంతాలకు నెలవైన ఉమ్మడి వరంగల్ ప్రపంచ పర్యాటకులకు కేరాఫ్‌గా మారింది. తెలంగాణ రాకముందు పట్టింపు కరువైన పర్యాటకరంగం స్వరాష్ట్రంలో మెరుగైన వసతులు, ఏర్పాట్లతో కొత్త కళ సంతరించుకొని స్థానికులనే గాక విదేశీయులనూ తన వైపు తిప్పుకుంటోంది. ఐదేళ్లలో 9554మంది విదేశీయులు మన వరంగల్‌కు వరుస కట్టినట్లు తాజాగా పర్యాటక శాఖ వివరాలు వెల్లడించింది. రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత విదేశీయులు ఎక్కువగా సందర్శించిన ప్రాంతంగా వరంగల్ రికార్డు దక్కించుకొని పర్యాటకంగా దూసుకుపోతోంది.
- ములుగు, జనవరి 21 (నమస్తే తెలంగాణ)
ప్రపంచ పర్యాటకులకు కేరాఫ్‌గా ఓరుగల్లు
చారిత్రక కట్టడాలకు కేరాఫ్‌గా ఉన్న ఓరుగల్లు ప్రపంచ పర్యాటకులను ఆకర్షిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పుణ్యక్షేత్రాలు, పర్యాటక కేంద్రాలు ఉన్నప్పటికీ విదేశీయులను ఎక్కువగా సందర్శించే ప్రాంతంగా వరంగల్ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది. రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత ఎక్కువ మంది వచ్చే టూరిజం స్పాట్‌గా ఓరుగల్లు రికార్డులకెక్కింది. ఆకట్టుకునే శిల్పకళా సౌందర్యం, కాకతీయుల వైభవాన్ని చాటిచెప్పే రామప్ప ఆలయం, వరంగల్ కోట, వేయి స్తంభాల గుడి, కోటగుళ్లు విదేశీ పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తూ ఎల్లలు దాటి వచ్చేలా చేస్తున్నాయి. ఇలా ఎప్పటికప్పుడు ఉమ్మడి జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను, పుణ్యక్షేత్రాలను సందర్శించే వారి సంఖ్య పెరుగుతోంది. తెలంగాణ ఏర్పడకముందు ఎంతో వెనుకబడిన పర్యాటక రంగం స్వరాష్ట్రంలో మెరుగైన వసతులను, పర్యాటకులకు భద్రతను కల్పించడంలో మంచి పేరు తెచ్చుకుంది. ఫలితంగా హైదరాబాద్ తరహాలో ఇక్కడ పర్యాటక ప్రాంతాలు ఆతిథ్యం ఇస్తుండగా ఐదేళ్ల నుంచి కళకళలాడుతున్నాయి. అలాగే ప్రకృతి అందానికి నెలవైన లక్నవరం, బొగత జలపాతం, తాడ్వాయి-ఏటూరునాగారం అభయారణ్యం, తాడ్వాయి మండలం కాటాపూర్, చిన్నగూడురు మండలం జయ్యారంలోని ఆదిమానవుల గుహలు, అటవీ శాఖ నడుపుతున్న వన కుటీరాలు, మల్లూరు పుణ్యక్షేత్రం, ములుగు మండలంలోని కొత్తూరు గుట్టపై ఉన్న పురాతన బౌద్దాలయం, ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర, రేగొండ మండలం తిరుమలగిరి వద్ద ఉన్న పాండవుల గుహలు, రఘునాథపల్లి మండలం ఖిలాషాపూర్ కోట, జఫర్‌గఢ్ మండలకేంద్రంలోని ఖిలా విదేశీ పర్యాటకులను ఎంతో ఆకర్షింపజేస్తున్నాయి.
ఆకర్షిస్తున్న ఓరుగల్లు శిల్పకళా సౌందర్యం
రాష్ట్రంలో 2017 నుంచి పర్యాటకుల సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటే విదేశీ పర్యాటకులు ఓరుగల్లు పర్యాటక రంగంపై మక్కువ చూపుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. విదేశీయులను ఆకర్షిస్తున్న జిల్లాల్లో హైదరాబాద్ ముందుండగా వరంగల్ ఉమ్మడి జిల్లా 2వ స్థానంలో నిలిచింది. 2017లో 3518 మంది, 2018లో 2381మంది, 2019లో 2980మంది విదేశీ పర్యాటకులు ఉమ్మడి జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించారు. 2020లో కరోనా వైరస్ కారణంగా లాక్డౌన్ విధించడంతో 675మంది పర్యాటకులు.. ఇలా ఇప్పటివరకు 9554మంది ఇక్కడి ప్రాంతాలను సందర్శించారు. పర్యాటకులను ఆకట్టుకునేందుకు జిల్లా పర్యాటక శాఖ పర్యావరణ అనుకూల విధానాలకు ప్రాధాన్యమిస్తూ సరస్సుల వద్ద స్పీడ్ బోట్లను అందుబాటులోకి తీసుకొచ్చి బోటింగ్‌కు ఏర్పాట్లు చేశారు. అలాగే వారికి వసతి కల్పించేందుకు జిల్లాకేంద్రంలోని నక్కలగుట్ట వద్ద అన్ని వసతులతో హోటళ్లు ఏర్పాటుచేశారు. అక్కడే గాక లక్నవరం, రామప్ప పర్యాటక ప్రదేశాల్లోనూ అత్యాధునిక హంగులతో హోటళ్లను నిర్మించి విదేశీ, స్వదేశీ రుచులను అందరూ మెచ్చేలా అందుబాటులో తీసుకొచ్చారు.
విశ్వవిఖ్యాతి గాంచిన రామప్ప
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేటలోని రామప్ప కట్టడం.. విశ్వవిఖ్యాతి గాంచిన దేవాలయంగా చరిత్ర పుటల్లోకి ఎక్కింది. ఆలయంలోని శిల్పాలు జీవకళను ఉట్టిపడేలా ఉండడం ఇక్కడి ప్రత్యేకత. నాడు ఓరుగల్లును ఏలిన కాకతీయు ల రాజసానికి, కళల పట్ల వారికి ఉన్న ఆసక్తికి నిదర్శనంగా నిలిచే వాటిలో ఈ ఆలయంతో, వరంగల్ కోటలోని స్వాగత తోరణాలున్నాయి. స్వరాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు కంకణం కట్టుకున్న ప్రభుత్వం ఉమ్మడి వరంగల్ జిల్లాకు ప్రత్యేక నిధులను కేటాయించి అభివృద్ధి చేయడం ద్వారా గతంలో ఎన్నడూ లేని విధంగా విదేశీ పర్యాటకుల సంఖ్య పెరుగుతోంది. అంతేగాక జిల్లాల్లోని రహదారుల ప్రవేశ ద్వారాల వద్ద కాకతీయుల శిల్పకళా నైపుణ్యాన్ని తెలిపే స్వాగత తోరణాలను సైతం ఏర్పాటుచేసింది. అలాగే విశ్వవిద్యాలయాల ప్రవేశాల మార్గాల వద్ద కూడా ఈ తోరణాలను ప్రత్యేకంగా ఏర్పాటుచేయడం అందరినీ ఆకట్టుకుంటోంది.
తాజావార్తలు
- అగ్ని ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం
- ఇలియానా బోల్డ్ కామెంట్స్.. షాక్‌లో నెటిజన్స్
- స్నేహితురాలికి వేధింపులు.. బీటెక్ విద్యార్థి అరెస్ట్
- పెండ్లి చెడగొట్టాలని ఇన్‌స్టాగ్రామ్‌లో వేధింపులు
- చేపల విక్రయ వాహనాలనుత్వరగా అందజేయండి
- భద్రతలో భాగస్వామ్యం..
- 12 భాషల్లో రైల్వే హెల్ప్‌లైన్ సేవలు
- రోడ్డు భద్రతలో ఇక సామాన్యుడే ‘సేవియర్'
- మూడు డిగ్రీలు పెరగనున్న ఉష్ణోగ్రతలు
- సమాజంలో స్త్రీల పాత్ర గొప్పది