మంగళవారం 09 మార్చి 2021
Mulugu - Nov 27, 2020 , 01:18:34

కరోనా సెకండ్‌ వేవ్‌పై అప్రమత్తంగా ఉండాలి

కరోనా సెకండ్‌ వేవ్‌పై అప్రమత్తంగా ఉండాలి

  • ములుగు  కలెక్టర్‌ ఎస్‌.కృష్ణ ఆదిత్య  

ములుగు కలెక్టరేట్‌ : కరోనా సెకండ్‌ వేవ్‌ వచ్చే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ములుగు జిల్లా కలెక్టర్‌ ఎస్‌.కృష్ణ ఆదిత్య అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కొవిడ్‌ ప్రారంభమైనప్పటి నుంచి జిల్లాలో నిరంతరం టెస్టులు చేస్తున్నామన్నారు. ఇటీవల కేసులు తగ్గుముఖం పట్టినా వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో మళ్లీ పెరిగే అవకాశం ఉందన్నారు.

కరోనా సోకకుండా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, నిత్యం శానిటైజర్‌ వాడడాన్ని అలవాటు చేసుకోవాలని సూచించారు. జిల్లాలో ప్రెస్‌క్లబ్‌ కోసం ప్రతిపాదనలు ఇస్తే స్థలం కేటాయిస్తామన్నారు. జిల్లాలో బస్‌డిపో ఏర్పాటుకు చర్యలు చేపడతామన్నారు. గిరిజన సంక్షేమ భవనాన్ని ఆధీనంలోకి తీసుకొని ప్రభుత్వ పనులకు వినియోగిస్తామని చెప్పారు. జిల్లాలో ఆర్టీవో కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. నివర్‌ తుఫాన్‌ ప్రమాదం పొంచి ఉందని, రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

కొనుగోలు కేంద్రాలకు తరలించిన ధాన్యం తడవకుండా టార్పాలిన్లు సిద్ధం చేసినట్లు తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో త్వరలోనే డిజిల్‌ ఎక్స్‌ రే టెక్నికల్‌ సిబ్బందిని నియమించటంతోపాటు మార్చురీ గదిలో మృతదేహాలను భద్రపరచడానికి చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామాల్లో వైకుంఠధామాలు, రైతు వేదికలు, ప్రకృతి వనాల పనులు చురుగ్గా సాగుతున్నాయని, కొన్ని చోట్ల పనులు కూడా పూర్తయ్యాయని చెప్పారు. కలెక్టరేట్‌కు దగ్గరలోనే అన్ని శాఖల కార్యాలయాలు ఉండే విధంగా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.గిరిజన యూనివర్సిటీ కోసం స్థలం కేటాయింపునకు చర్యలు చేపట్టామన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఇబ్బందిపడకుండా ప్రత్యేకాధికారులను నియమించినట్లు తెలిపారు. 


VIDEOS

logo