గురువారం 26 నవంబర్ 2020
Mulugu - Oct 30, 2020 , 02:24:25

గ్రామాల అభివృద్ధిలో యువత పాత్ర కీలకం

గ్రామాల అభివృద్ధిలో యువత పాత్ర కీలకం

ములుగురూరల్‌, అక్టోబర్‌29: పల్లెలను స్వచ్ఛ గ్రామాలుగా మార్చేందుకు యువత పాత్ర కీలకమని కలెక్టర్‌ ఎస్‌.కృష్ణ ఆదిత్య అన్నారు. మండలంలోని పత్తిపల్లి గ్రామంలో  ఎంపీటీసీ నూనవత్‌ మహేశ్‌ అధ్యక్షతన ఏర్పాటు చేసిన స్వచ్ఛభారత్‌ అవగాహన కార్యక్రమంలో కలెక్టర్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. స్వచ్ఛ భారత్‌ బలోపేతం చేయడంలో భాగంగా స్వచ్ఛ గ్రామాల వైపు యువత దృష్టి సారించాలని అన్నారు. గ్రామాల అభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషించాలని అన్నారు. పత్తిపల్లి గ్రామాన్ని స్వచ్ఛ గ్రామంగా మార్చేందుకు ముందడుగు వేసిన యువతను కలెక్టర్‌ అభినందించారు. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కల్పించడంలో యువత ముందుండాలని అన్నారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించడంతో వ్యాధులు దరిచేరవని, ఆరోగ్యంగా ఉండవచ్చునని తెలిపారు. గ్రామాలు స్వచ్ఛతలో ముందుంటే అభివృద్ధికి నాంది పలికినట్లేనని తెలిపారు. ముఖ్యంగా యువత సామాజిక సేవలో పాల్గొంటూనే విద్యపై శ్రద్ధ వహించాలని అన్నారు. యువతను ఉన్నత స్థాయిలో నిలబెట్టేది చదువు మాత్రమేనని అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ గద్దల రేణుక, యువకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. 

ములుగు ఆర్డీవోపై చర్యలు తీసుకోవాలి

ములుగు కలెక్టరేట్‌: దివ్యాంగులకు చెందిన స్వావలంబన్‌ డబ్బుల పంపిణీ విషయంలో ఏళ్ల తరబడి కాలయాపన చేస్తున్న ములుగు ఆర్డీవో రమాదేవిపై చర్యలు తీసుకోవాలని దివ్యాంగుల ఐక్యవేదిక నాయకులు కలెక్టర్‌ కృష్ణ ఆదిత్యకు గురువారం వినతిపత్రం అందజేశారు. జిల్లా  జాగృతి దివ్యాంగుల విభాగం  అధ్యక్షుడు రాయబారపు రమేశ్‌, జయశంకర్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి కొయ్యడ స్వామి మాట్లాడుతూ ఇప్పటికైనా డబ్బులు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు. కార్యక్రమంలో అల్లెపు రవి, మహేశ్‌, సంతోష్‌, సదయ్య పాల్గొన్నారు.