గురువారం 03 డిసెంబర్ 2020
Mulugu - Oct 25, 2020 , 02:15:54

నేడు విజయదశమి

నేడు విజయదశమి

వరంగల్‌ కల్చరల్‌ : లోక కల్యాణం కోసం మహిషాసురుడిని దుర్గామాత వధించింది. శిష్ట రక్షణ కోసం దుష్ట శిక్షణ తప్పదనీ, ఏనాటికైనా చెడుపై మంచే గెలుస్తుందని నిరూపించింది. తొమ్మిది రోజుల పాటు భీకర పోరు చేసి, పదో రోజు ఆశ్వీయుజ శుద్ధ దశమి రోజున మహిషుడిని సంహరించింది. చెడుపై ‘మంచి’ సాధించిన విజయంగా ఆ రోజున విజయదశమిని జరుపుకొంటున్నాం. కాగా, నేడు ఈ వేడుకలను ఘనంగా నిర్వహించుకునేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. ఆలయాలను ముస్తాబు చేశారు. వాహన, ఆయుధ, శమీ పూజలకు ఏర్పాట్లు చేసుకున్నారు. 

మహిషాసుర మర్దినిగా భద్రకాళీమాత 

దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఎనిమిదో రోజు శనివారం భద్రకాళి అమ్మవారు మహిషాసుర మర్దినిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం మహాగౌరి, సిద్ధిదాత్రి క్రమంలో, సాయంకాలం నిశుంభహా, శుంభహా దుర్గాక్రమంలో పూజలు చేశారు. డోలోత్సవం (ఊయల సేవ), భద్రపీఠ సేవ, అశ్వవాహన సేవ, విమానక సేవ (సర్వభూపాల వాహనసేవ) నిర్వహించారు. వేదపండితులు అమ్మవారి ఆజ్ఞ తీసుకొని మహాపూర్ణాహుతి చేశారు. ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ పూజల్లో పాల్గొన్నారు. పద్మాక్షి అమ్మవారిని మహాగౌరీగా అలంకరించి నవరసాభిషేకం చేశారు.  

మంత్రి ఎర్రబెల్లి శుభాకాంక్షలు 

పాలకుర్తి రూరల్‌ : ప్రజలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు దసరా శుభాకాంక్షలు తెలిపారు. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ పండుగ చేసుకోవాలని సూచించారు. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.