మంగళవారం 27 అక్టోబర్ 2020
Mulugu - Sep 24, 2020 , 05:41:25

రైతు వేదికల నిర్మాణం పూర్తి చేయాలి

రైతు వేదికల నిర్మాణం పూర్తి చేయాలి

  • వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర ప్రభుత్వ 
  • ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌

ములుగు కలెక్టరేట్‌/భూపాలపల్లి కలెక్టరేట్‌, సెప్టెంబర్‌23: రైతు వేదికల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ అధికారులను ఆదేశించారు. రైతు వేదికల నిర్మాణం, పల్లె ప్రగతి, ఎల్‌ఆర్‌ఎస్‌ వంటి అంశాలపై పురపాలక శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అర్వింద్‌ కుమార్‌, పంచాయతీ రాజ్‌ సెక్రెటరీ సందీప్‌ కుమార్‌ సుల్తానియా ఇతర ఉన్నత అధికారులతో కలిసి బుధవారం అన్ని జిల్లాల కలెక్టర్ల, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు, మున్సిపల్‌ కమిషనర్ల, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులు, జిల్లా పంచాయతీ అధికారులతో నిర్వహించిన కార్యక్రమం అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య మాట్లాడుతూ

పౌరసరఫరాల అధికారి సీఎంఆర్‌ రైస్‌ ప్రక్రియను ప్రతి రోజూ పర్యవేక్షించాలని, డీపీఎస్‌ రైస్‌ స్టాక్‌ ఈనెల 28లోగా పూర్తి చేయాలని అన్నారు. రైతు వేదిక నిర్మాణాలు దసరాలోగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. బిల్లుల చెల్లింపులు ఎప్పటికప్పుడు పూర్తిచేయాలన్నారు. పారిశుధ్య కార్యక్రమం చేపట్టాలని అన్నారు. 10 శాతం గ్రీన్‌ బడ్జెట్‌ వినియోడించుకోవాలని అన్నారు. రెవెన్యూ రికార్డుల నిర్వహణ పకడ్బందీగా చేయాలని, కార్యాలయాల నిర్వహణ ఈ-ఆఫీస్‌ ద్వారానే చేయాలన్నారు. ధరణి నిర్వహణకు సిద్ధం కావాలని, ఉపాధి హామీ పనుల్లో కూలీల సంఖ్య పెంచేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఉపాధి హామీ చెల్లింపులు 100 శాతం పూర్తి చేయాలని అన్నారు.

ములుగులో అదనపు కలెక్టర్‌(స్థానిక సంస్థలు)ఆదర్శ్‌ సురభి, జిల్లా రెవెన్యూ అధికారిణి కే.రమాదేవి, డీఆర్డీవో ఏ.పారిజాతం, జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య, జిల్లా పౌరసరఫరాల అధికారి అరవింద్‌ రెడ్డి, ఈఈ గిరిజన సంక్షేమ అధికారి నిరంజన్‌, అధికారులు పాల్గొన్నారు. భూపాలపల్లిలో అదనపు కలెక్టర్‌ వైవీ గణేశ్‌, జిల్లా పంచాయతీ అధికారి సుధీర్‌ కుమార్‌, పంచాయతీ రాజ్‌ ఈఈ రాంబాబు, ఎల్డీఎం శ్రీనివాస్‌, మున్సిపల్‌ కమిషనర్‌ సమ్మయ్య, సివిల్‌ సైప్లె జిల్లా మేనేజర్‌ రాఘవేందర్‌, ధరణి డిస్ట్రిక్ట్‌ ఆపరేటర్‌ సందీప్‌, పంచాయతీ రాజ్‌ డీఈలు పాల్గొన్నారు.


logo